అసెంబ్లీలో స్పీకర్‌-హరీశ్‌రావు-కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధం | Telangana Assembly Day 2, Harish Rao Vs Speaker Prasad, Clash Over BRS Protests And Women MLAs Treatment | Sakshi
Sakshi News home page

అసెంబ్లీలో స్పీకర్‌-హరీశ్‌రావు-కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధం

Sep 8 2026 10:36 AM | Updated on Sep 8 2026 12:20 PM

Harish Rao vs Speaker Prasad: War of Words Erupts in Telangana Assembly

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల రెండో రోజు.. నిన్నటి పరిణామాల నేపథ్యంగా హాట్‌ హాట్‌గా మొదలైంది. నల్ల బ్యాడ్జీలతో సెషన్‌కు హాజరైన బీఆర్‌ఎస్‌ సభ్యులు.. నిరసనకు దిగారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత హరీశ్‌ రావు, అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ మధ్య మాటల యుద్ధం నడిచింది. 

మహిళా ఎమ్మెల్యేలపై కేసులు పెట్టడం దారుణం. నిన్న మా పట్ల పోలీసులు దురుసుగా పవ్రర్తించారు. సబితా ఇంద్రారెడ్డి గొంతు పిసికారు. సునీతా లక్ష్మారెడ్డి చీరలాగి అవమానించారు. కలియుగ దుశ్శాసనుడిలా రేవంత్‌ ‍వ్యవహరించారు. అసెంబ్లీ కౌరవసభగా మారింది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు నినాదాలు చేయడంతో.. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

నా పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. నా తల్లిదండ్రులను అవమానకరంగా మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ సభ్యులు నా తల్లిని అసభ్యంగా దూషించారు. సునీత, సబితా, కోవా లక్ష్మి అంటే నాకు గౌరవం.  వాళ్లు నాకు తోబుట్టువులతో సమానం. సబితమ్మకు జరిగిన దానిపై నేనే విచారణ చేయమని చెప్పా. మీ తల్లిని అనలేదు హరీశ్‌.. నా సంగతి ఏంటి?. ముందు నన్ను అవమానించిన అంశంపై మాట్లాడూ.. అంటూ స్పీకర్‌ మాట్లాడారు. 

ఆ సమయంలో..  చర్చ జరగకుండా డ్రామాలు చేస్తున్నారని కాంగ్రెస్‌ సభ్యులు ఒక్కొక్కరిగా బీఆర్‌ఎస్‌పై మండిపడ్డారు. దళిత స్పీకర్‌ పట్ల అమానుషంగా వ్యవహరించారని.. జరిగిన దానిపై క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్‌ను మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారని చూడకుండా.. చొక్కాలు విప్పి ముందుకు రావడం ఏంటని? సీతక్క మండిపడ్డారు. నిన్నటి పరిణామాలపై సమగ్ర విచారణ జరపాలని స్పీకర్‌ను కోరారామె. ఆ సమయంలో హరీశ్‌ రావు మరోసారి జోక్యం చేసుకుని.. 

స్పీకర్‌గా మీపై మాకు గౌరవం ఉంది. మీ పట్ల వ్యాఖ్యలపై మా ఎమ్మెల్సీ నిన్ననే విచారం వ్యక్తం చేశారు. మేం కూడా విచారం వ్యక్తం చేస్తున్నాం. విచారం వ్యక్తం చేశాక.. దీనిపై రాద్ధాంతం అవసరమే లేదు. కాంగ్రెస్‌కు నిజంగా గిరిజనుల మీద ప్రేమ ఉంటే..ఎస్సీ,ఎస్టీ డిక్లరేషన్‌ ఎందుకు చేయలేదు?.. అని హరీశ్‌ రావు అన్నారు. అయితే 

ఎందుకంత ఆవేశం..  నీ తల్లిననలేదు.. హరీష్ రావు పై స్పీకర్ ఆగ్రహం ..

హరీశ్‌రావు వైఖరి స్పీకర్‌నే బెదిరించినట్లు ఉందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్‌పై జరిగిన దానిని పక్కన పెట్టాలట. స్పీకర్‌ను డిక్టేట్‌ చేయడం ఏంటి?. స్పీకర్‌ ఇలా చేయొద్దు.. అలా చేయొద్దు అని చెప్పడానికి వాళ్లెవరూ?  అంటూ బీఆర్‌ఎస్‌ సభ్యులపై మంత్రి శ్రీధర్‌ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి పరిణామాలపై దర్యాప్తు జరుగుతోందని.. మహిళా ఎమ్మెల్యేలతో దురుసుగా ప్రవర్తించిన అధికారులపై కచ్చితంగా చర్యలు ఉంటాయని అన్నారాయన. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement