అరెస్టులతో ప్రతిపక్ష గొంతు నొక్కుతున్నారు: హరీష్‌రావు | Harish Rao Slams Revanth Reddy Govt Over Arrests Of BRS MLCs Tata Madhu And Naveen Reddy, Check Post Inside | Sakshi
Sakshi News home page

అరెస్టులతో ప్రతిపక్ష గొంతు నొక్కుతున్నారు: హరీష్‌రావు

Sep 8 2026 9:14 AM | Updated on Sep 8 2026 9:31 AM

Harish Rao Targets Revanth Govt Over BRS MLCs Arrest

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డి అరెస్టులపై బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్రంగా స్పందించారు. రేవంత్‌రెడ్డి ఆదేశాలతోనే పోలీసులు తమ పార్టీ ప్రజాప్రతినిధులపై దాడులు చేసి, ఇప్పుడు వారినే అరెస్ట్‌ చేయడం దురదృష్టకరమని ఆరోపించారు. హైకోర్టు చెప్పినా పట్టించుకోకుండా కేసులు పెట్టి అరెస్టు చేయడం చట్టాన్ని, న్యాయస్థానాలను ధిక్కరించడమేనని మంగళవారం ఉదయం ఓ ట్వీట్‌ చేశారు.

ప్రతిపక్షం అంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఎందుకింత కక్ష అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి రాకుండా చేసి ప్రజా సమస్యలు చర్చకు రాకుండా చేయడమే ప్రభుత్వ కుట్రా అని నిలదీశారు. 1000 రోజుల పాలన వైఫల్యాలు, 22ఏ భూముల వ్యవహారం, భూ కుంభకోణాలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులు, రైతుల సమస్యలు సభలో చర్చకు వస్తాయనే భయంతోనే అరెస్టులు చేస్తున్నారా? అని ప్రశ్నించారు.

“ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే” అంటే.. తప్పు చేసినవాడే ఎదుటివారిని నిందించడం అని హరీష్‌రావు పేర్కొన్నారు. పోలీసులు తమపై దాడి చేసి, ఇప్పుడు తమ పార్టీ ఎమ్మెల్సీలనే అరెస్ట్‌ చేస్తున్నారని విమర్శిస్తూ.. “దొంగే పోలీసును మందలించినట్టుంది” అని ఆయన వ్యాఖ్యానించారు. తమ మహిళా ఎమ్మెల్యేల చీరలు లాగి, గొంతు పిసికిన వారిపై చర్యలు తీసుకోకుండా తమపైనే కేసులు, అరెస్టులు చేయడం ఏమిటని హరీష్‌రావు మండిపడ్డారు. 

బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందు భారీగా పోలీసులను మోహరించడాన్ని కూడా తప్పుబట్టారు. ఖాకీలను ప్రైవేట్‌ సైన్యంగా వాడుకుంటూ హిట్లర్‌ పాలనను తలపిస్తున్నారని విమర్శించారు. ఇది ప్రజాపాలన కాదని, ప్రతిపక్ష గొంతు నొక్కే ఎమర్జెన్సీ రాజ్యమని వ్యాఖ్యానించారు. ‘ప్రశ్నిస్తే కేసు.. నిలదీస్తే అరెస్ట్‌.. ప్రజల సమస్యలపై మాట్లాడితే నిర్బంధం’ అంటూ ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా బీఆర్‌ఎస్‌ గొంతుకను అణచలేరని, ప్రజా సమస్యలపై తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement