బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్‌ | Tension at MLA Quarters as Police Move Against Tatha Madhu | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్‌

Sep 8 2026 7:10 AM | Updated on Sep 8 2026 8:32 AM

Tension at MLA Quarters as Police Move Against Tatha Madhu

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ శాసన సభా స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్‌ అయ్యారు. ఆయనతో పాటు మరో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డిని కూడా పోలీసులు ఈ ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. అయితే అరెస్ట్‌ సమయంలో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ వద్ద హైడ్రామా నడిచింది.  

తెలంగాణ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా.. శాసనసభ ప్రాంగణంలో నిన్న తాతా మధు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆయన స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. అయితే తానేం దూషించలేదని నిన్ననే మధు వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో.. ఈ ఉదయం ఎమ్మెల్సీ తాతా మధు ఇంటికి చేరుకున్న పోలీసులు ఆయన్ని ఇంట్లోంచి బయటకు రావాలని పిలిచారు. అయితే అందుకు ఆయన నిరాకరించారు. 

సమాచారం అందుకున్న బీఆర్‌ఎస్‌ శ్రేణులు అక్కడికి చేరుకుని మధు అరెస్టును అడ్డుకునే ప్రయత్నం చేశాయి. అనంతరం అధికారులు వాళ్లతో మాట్లాడి ఆయన్ని తమ వెంట తీసుకెళ్లారు. 

 

మరోవైపు మరో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌ రెడ్డిపై సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో బలవంతంగా ఆయన్ని తరలించారు.  

మధును తరలిస్తున్న సమయంలో ఆయనతో మాట్లాడించేందుకు సాక్షి ప్రయత్నించింది. అయితే పోలీస్‌ అధికారి మైక్‌ను తోసేశారు. తనను అక్రమంగా అరెస్ట్‌ చేశారంటూ మధు చెప్పారు. తాతా మధును నారాయణగూడ పీఎస్‌కు తరలించి స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేస్తున్నారు. మధు, నవీన్‌లను ఇవాళ నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

ఇటు.. అసెంబ్లీ గేటు వద్ద నిన్నటి పరిణామాల నేపథ్యంలో పలు కేసులు నమోదు అయ్యాయి. పోలీసులతో అనుచితంగా ప్రవర్తించినందుకుగానూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, సీనియర్‌ నేత హరీష్‌ రావు, ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుదీర్‌రెడ్డి సహా మరికొందరిపై బీఎన్‌ఎస్‌లోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు పెట్టినట్లు తెలుస్తోంది.

తాతా మధు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. కలత చెందిన స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ సభలో కంటతడి పెట్టారు. ఆ సమయంలో ‘‘మధు వ్యాఖ్యలు స్పీకర్‌కే కాదు.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానం’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. పార్టీలకు అతీతంగా సభలోని ప్రతి సభ్యుడు ఈ వ్యాఖ్యలను ఖండించాలని కోరారు. ప్రతిపక్ష నేత కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలని, అనుచిత వ్యాఖ్యలు చేసిన సభ్యుడి సభ్యత్వాన్ని శాశ్వతంగా బర్తరఫ్‌ చేయాలని సీఎం డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి: గొంతులు నొక్కారు.. చీరలు లాగారు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement