సాక్షి, సిటీబ్యూరో: ఇందిరమ్మ టవర్స్ పథకంలో దరఖాస్తుదారుల నుంచి మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణతో పాటు డిపాజిట్ (ఈఎండీ)గా ఆన్‌లైన్ ద్వారా రూ.10 వేలు స్వీకరించారు. ఇళ్ల కేటాయింపు లాటరీ పూర్తి కావడంతో ఎంపిక కాని దరఖాస్తుదారులకు ఈఎండీ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతం తెలిపారు. దరఖాస్తుదారులు చెల్లించిన అకౌంట్‌కే డబ్బులు జమ చేస్తున్నట్లు వెల్లడించారు.
ఎటువంటి దరఖాస్తులను సమర్పించాల్సిన అవసరం లేదని, వారం రోజుల్లోగా చెల్లింపుల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. అయితే.. కొంతమంది దరఖాస్తుదారులు నగదు ద్వారా, ఇతరుల అకౌంట్ నుంచి చెల్లించామని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చారు. ఇలా చెల్లించిన వారికే జమ అయ్యేలా చూడటానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందుకోసం హౌసింగ్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ tghb.telangana.gov. in ద్వారా ఈ నెల 10లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. లేని పక్షంలో ఏ అకౌంట్ ద్వారా చెల్లింపు చేశారో, అదే అకౌంట్‌కు తిరిగి జమ అవుతుందని గౌతం తెలిపారు. సందేహాల నివృత్తికి 040– 24603572ను సంప్రదించవచ్చని ఆయన సూచించారు.
చదవండి: పుట్టిన 13 రోజులకే పాస్‌పోర్టు


