బాబు, లోకేష్‌కు తెలియకుండా జీవోలు వచ్చాయా?: డీఎస్సీపై కాకాణి ఫైర్‌ | YSRCP Kakani Sensaional Comments On CBN And Lokesh In DSC Scam | Sakshi
Sakshi News home page

బాబు, లోకేష్‌కు తెలియకుండా జీవోలు వచ్చాయా?: డీఎస్సీపై కాకాణి ఫైర్‌

Sep 9 2026 12:31 PM | Updated on Sep 9 2026 12:49 PM

YSRCP Kakani Sensaional Comments On CBN And Lokesh In DSC Scam

సాక్షి, నెల్లూరు: ఏపీలో డీఎస్సీ నియామకాల వ్యవహారంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మొదటి నుంచీ తాము సీబీఐ విచారణ కోరుతున్నామని.. అక్రమాలు లేవని చెప్పిన ప్రభుత్వం, ఆధారాలు బయటకు వచ్చి ప్రజల్లో చర్చ మొదలయ్యాక విచారణకు సిద్ధమంటూ మాట మార్చడం సరికాదని విమర్శించారు. డీఎస్సీ వ్యవహారంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ పాత్ర ఉందని ఆరోపించిన ఆయన.. చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్‌ చేశారు.

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘డీఎస్సీ అక్రమాల్లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాత్ర ప్రత్యక్షంగా ఉంది. కర్నూలుకి చెందిన ప్రభాకర్ ఉదంతంపై కమిటీ వేశారు.. ఉద్యోగం ఇచ్చాక కమిటీ వేసి విచారణ చేయడం ఏంటి? వ్యక్తిగత అర్హత గురించి విద్యార్హత గురించి పట్టించుకోకుండా నియామకాలు జరిపి మేము అక్రమాలు బయటకు వచ్చాక సంబంధం లేని వాదనలు వినిపిస్తున్నారు. స్పోర్ట్స్ కోటా విషయంలో అక్రమాలు జరిగినట్టు తేటతెల్లం కాగా అసోసియేషన్లపై నెపం నెడుతున్నారు.  

స్పోర్ట్స్ పత్రాల్లో అసలైన సంతకాలు ఉన్నాయా లేదా చెప్పాలి? క్లీన్ చిట్ ఇవ్వలేకపోతున్నారు అంటే మీకు తెలిసే ఇదంతా జరిగింది. కాబట్టి తప్పించుకోవడానికి ఏదో ఒక విధంగా కాలయాపన చేస్తున్నారు. అందుకే క్లీన్ చిట్ ఇవ్వలేకపోతున్నారు. అసలు టోర్నమెంట్లు నిర్వహించకుండానే  క్రీడాకారులకు సర్టిఫికెట్ ఇచ్చారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాద్ధాంతం అయ్యాక ఇప్పుడు అసోసియేషన్లను అడుగుతామంటున్నారు. ఇది ముమ్మాటికీ మీరు చేసిన పాపం.. ఫలితంగా నిరుద్యోగులు బాధపడే స్థాయికి తెచ్చారు. తప్పు జరగలేదు అంటే ఇన్ని రకాల ఎంక్వయిరీలు ఎందుకు చేస్తున్నారు?.

డీఎస్సీపై ఆశలు పెట్టుకున్న వారిపై నీళ్లు చల్లారు.. బాధిత కుటుంబాలకు జరిగిన అన్యాయానికి బాధ్యులు ఎవరు?. సీఎంకు తెలియకుండానే జీవోలు వచ్చాయా? ఆయన సంతకం చేయకుండానే ఫైల్స్ కదిలాయా? కాబట్టి ఇందులో ప్రత్యక్ష నిందితులు చంద్రబాబు, లోకేష్ అని ఖచ్చితంగా చెప్తున్నాం. న్యాయం అడుగుతుంటే మా గొంతు నొక్కుతున్నారు.. దమ్ముంటే రాజకీయంగా మాట్లాడండి.. వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం పనికిరాదు. చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా లోపాలను ఒప్పుకోండి. స్పష్టమైన ప్రకటన చేయండి. విచారణ చేసి నిజాలపై వివరణ ఇవ్వండి. ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా డీఎస్సీ అక్రమాలపై పోరాటం ఆపేది లేదు. శాఖాపరంగా, ప్రభుత్వం పరంగా అనేక రకాలుగా పొరపాట్లు జరిగాయి. ఇవన్నీ ప్రజలకు తెలియాలి అంటే సీబీఐ విచారణ జరిపించాలి. అంతులేని అక్రమాలకు కారకుడైన మంత్రి లోకేష్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి’ అని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి: మెగా డీఎస్సీల్లో అక్రమాలు ‘ఖోఖో’ల్లలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement