అమితాబ్‌ బచ్చన్‌ (బాలీవుడ్‌ దిగ్గజం) రాయని డైరీ | Amitabh Bachchan Rayani Diary | Sakshi
Sakshi News home page

అమితాబ్‌ బచ్చన్‌ (బాలీవుడ్‌ దిగ్గజం) రాయని డైరీ

Sep 13 2026 12:54 AM | Updated on Sep 13 2026 12:54 AM

Amitabh Bachchan Rayani Diary

మాధవ్‌ శింగరాజు

రాత్రి 2.34. ఎంతకూ మెలకువ రావటం లేదు! మెలకువ రావటం లేదంటే నిద్రలో ఉన్నట్లనేనా?! నేను కోరుకుంటున్న మెలకువ...  నిద్రాణంగా ఉన్న నా జీవితపు మలుపుల్లోంచి నిస్త్రాణగా పడి ఉన్న నా నిరాలోచనల ఏకాంతంలోకి. పాతవన్నీ ప్రవాహంలా మనసులోకి వచ్చి చేరుతున్నాయంటే... బిందెడు తులసి నీళ్లను మంచం పక్కన సిద్ధంగా ఉంచుకోవటమేనా? గొంతెండి ఉన్న దారులను తీర్థపు గుక్కిళ్లతో ఆరారగా తడుపుకుంటూ జీవనావస్థలోకి మళ్లీ మళ్లీ ప్రయాణించి వస్తుండటమేనా? ప్రయాసగా పక్కకు ఒత్తిగిలాను. నీలం రంగు మసక వెలుతురు... తీరని అలసటలా మనసును పూర్తిగా కమ్మేసి ఉంది. వలదనుకోలేని జ్ఞాపకాలు. అంతమూ పొంతనా లేని తలపులు. ఏ జాము అయిందో తెలియదు, మనిషి జీవితకాల జాముల గురించి ఆలోచిస్తున్నాను! అరవై ఏళ్లు రాగానే మనిషిని మనుషులు ఎందుకు ఆనవాలు పట్టటం మానేస్తారు! డెబ్బై దాటగానే ఎందుకు చూపులు చిట్లిస్తారు! ఎనభైల్లో ఎదురుపడితే ఎదురైంది మనిషే కానట్లు ఎందుకు దాటుకుని పోతారు! మనుషులిలా తప్పుకుని పోతున్నప్పుడే తొంభై ఏళ్లు, నూట తొంభై ఏళ్లు బతికి, మనుషులతో మాట కలపాలనిపిస్తుంది నాకు. కోవిడ్‌తో నేను ముంబై నానావతి ఆసుపత్రి ఐసోలేషన్‌  వార్డులో ఉన్నప్పుడు ఒక అజ్ఞాత వ్యక్తి నా మరణాన్ని తీవ్రంగా కాంక్షిస్తూ, ‘‘కనీసం ఈ కోవిడ్‌తోనైనా నువ్వు చనిపోవాలని కోరుకుంటున్నాను’’ అని సోషల్‌ మీడియాలో ఒక సంక్షిప్త సందేశం పోస్ట్‌ చేశాడు! పట్టలేనంత కోపం వచ్చింది నాకు.

ఆ వెంటనే ఆలోచిస్తే... కోపం వచ్చినందుకు నవ్వొచ్చింది. నేను చనిపోవాలని కోరుకుంటు న్నాడంటే... నేను బతికున్నానని అతడు అనుకుంటున్నట్లే! అది కదా దీర్ఘాయుష్షు... మనిషి మనసులో మనిషి ఉండటం! ‘కౌన్‌  బనేగా కరోడ్‌పతి’ సెట్స్‌లో ఒకసారి ప్రీతి జింతాను అడిగేశాను... ‘‘నేను ప్రతి సంవత్సరం జనవరి 31న మీకు బర్త్‌డే విషెస్‌ చెప్తాను, కానీ మీరు ఒక్కసారి కూడా నాకు రిప్లయ్‌ ఇవ్వలేదు’’ అని. ‘‘సారీ బచ్చన్‌  జీ. నంబర్‌ మారిపోయింది’’ అన్నారు ప్రీతి జింతా! ఒక ఏడాది మే 1న అనుష్క శర్మను ట్విట్టర్‌లో బహిరంగంగానే అడిగాను, ‘‘మీకు ఎస్‌ఎంఎస్‌లో శుభాకాంక్షలు పంపాను. కానీ ఎలాంటి స్పందనా లేదు’’ అని. ‘‘సారీ సర్‌... చూసుకోలేదు’’ అన్నారు అనుష్క! ‘‘ పర్వాలేదు. నిన్న రాత్రి ఐపీఎల్‌ గేమ్‌లో మీరు చాలా కాంతిమంతంగా కనిపించారు’’ అని మళ్లీ శుభాకాంక్షలు పంపాను. సోనమ్‌ కపూర్‌ కూడా నన్ను పట్టించు కోలేదు! ‘‘సారూ... నేను అమితాబ్‌ బచ్చన్‌ ని. జూన్‌  9న నీ పుట్టినరోజుకు విష్‌ చేశాను. రిప్లయ్‌ లేదు, కాల్‌ కూడా చేయలేదు... వెరీ బ్యాడ్‌!’’ అని మెసేజ్‌ పెట్టాను. ‘‘సారీ అంకుల్, మీ ఎస్‌ఎంఎస్‌ నాకు రీచ్‌ అయినట్లు లేదు’’ అన్నారు సోనమ్‌!

రణ్‌వీర్‌ సింగ్‌ని, ‘‘హేయ్‌... అందరికీ థ్యాంక్స్‌ చెబుతున్నావ్‌. మరి నేను పంపిన విషెస్‌ సంగతి ఏంటి? రిప్లయ్‌ ఎందుకు ఇవ్వలేదు?’’ అని అడిగాను. ‘‘సారీ అమితాబ్‌ జీ, మీక్కూడా థ్యాంక్యూ చెప్పానే!! మీకు ఆ థ్యాంక్యూ చేరలేదంటే... ఏదో టెక్నికల్‌ గ్లిచ్‌ అయుంటుంది’’ అన్నారు రణ్‌వీర్‌! సమాధానం సంతృప్తికరంగా ఉండక పోవచ్చు. అసలు ప్రశ్నే సరైనది కాకపోవచ్చు. కానీ, ప్రశ్నలు సమాధానాలు ఉండటమే జీవితం. అడగాల్సిన ప్రశ్నలు, చెప్పాల్సిన సమాధానాలు లేకుండా... నిండు నూరేళ్ల జీవితం కూడా సంపూర్ణం కాలేదు. ప్రశ్న, సమాధానం నిశ్శేషం కానంత వరకు జీవితకాలం అసలు పూరై్తనట్లే కాదు. ‘‘మేల్కొన్నారా?’’ – తెల్లవారు జామునెప్పుడో జయ అడుగుతోంది. ‘‘ఇది కోటి రూపాయల ప్రశ్న దేవీజీ... ఆలోచించాల్సిందే’’ అన్నాను, నిట్టూర్పుగా. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement