UFO: 50 ఏళ్ల తర్వాత.. టెహ్రాన్ ఆకాశంలో మరో వింత వస్తువు | 50 Years After 1976 UFO Sighting Another Mystery Object Over Tehran | Sakshi
Sakshi News home page

UFO: 50 ఏళ్ల తర్వాత.. టెహ్రాన్ ఆకాశంలో మరో వింత వస్తువు

Sep 22 2026 10:44 AM | Updated on Sep 22 2026 10:55 AM

50 Years After 1976 UFO Sighting Another Mystery Object Over Tehran

1976లో ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ ఆకాశంలో కనిపించిన వింత వస్తువు(యూఎఫ్‌వో) ఘటనకు సరిగ్గా 50 ఏళ్ల తర్వాత.. అదే నగరంలో మరోసారి ఓ మిస్టరీ వస్తువు కలకలం రేపుతోంది. ఆకాశంలో ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగుల లైట్లతో తక్కువ ఎత్తులో ఎగురుతున్నట్లు కనిపిస్తున్న ఈ వస్తువుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అసలు అది డ్రోనా? ఒకటి కంటే ఎక్కువ డ్రోన్లా? లేక దూరం నుంచి కనిపించిన మరో సాధారణ వస్తువా? ఇప్పటివరకు మాత్రం దీనిపై అధికారిక స్పష్టత లేదు. దీంతో ఆ వస్తువు ఏమై ఉండొచ్చనే దానిపై అనేక రకాల ఊహాగానాలు మొదలయ్యాయి.

ఈ వీడియోలు సెప్టెంబర్ 20న చిత్రీకరించినవిగా చెబుతున్నారు. వాటిలో రాత్రి ఆకాశంలో తక్కువ ఎత్తులో ఎగురుతున్నట్లు కనిపించే ఒక వస్తువు కనిపిస్తోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఒక పోస్టు ప్రకారం, ఈ ఘటన టెహ్రాన్‌లోని అజాదెగాన్ ఎక్స్‌ప్రెస్‌వే సమీపంలో జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఆ వస్తువు కచ్చితంగా ఎక్కడ కనిపించింది. ఎంత ఎత్తులో ఉంది? దాని వేగం ఎంత? దాని పరిమాణం ఎంత? అనే విషయాలపై ఇప్పటివరకు అధికారిక సమాచారం లేదు. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో ఈ వీడియోలు వెలుగులోకి వచ్చాయి.

ఈ దృశ్యాలపై సోషల్ మీడియాలో కొందరు ఇది సైనిక డ్రోన్ అయి ఉండవచ్చని.. ఒకేసారి అనేక డ్రోన్లు ఎగురుతూ ఉండవచ్చని చెబుతున్నారు. మరికొందరు, దూరం నుంచి చూస్తున్నప్పుడు ఆ లైట్లు గాలిపటం లేదా మరేదైనా వస్తువుకు సంబంధించినవిగా కనిపించి ఉండవచ్చంటున్నారు. సెప్టెంబర్ 20న ఇరాన్, అమెరికా మధ్య మరోసారి తీవ్ర హెచ్చరికలు వెలువడ్డాయి. తమపై మరోసారి దాడి జరిగితే.. ఈ ప్రాంతంలోని అమెరికా స్థావరాలపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందని ఇరాన్ సైన్యం హెచ్చరించింది.

అదే సమయంలో ఈ ప్రాంతంలో విమానాల రద్దు, గగనతల మూసివేతలు, ఇతర అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందని అమెరికా విదేశాంగ శాఖ ప్రయాణికులను హెచ్చరించిన సంగతి తెలిసిందే. 1976 సెప్టెంబర్ 19న ఆకాశంలో ఒక ప్రకాశవంతమైన వస్తువు కనిపించినట్లు ఇరాన్ అధికారులు తెలిపారు. దానిని పరిశీలించేందుకు ఇరాన్‌కు చెందిన F-4 యుద్ధ విమానాలను పంపినట్లు సమాచారం.

తర్వాత యూఎఫ్‌వో పరిశోధకులు ఈ ఘటనపై విస్తృతంగా అధ్యయనం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన నివేదికలు అమెరికా ప్రభుత్వం డీక్లాసిఫై చేసిన పత్రాల్లో కూడా ఉన్నాయి. అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (NSA) ఆర్కైవ్‌లో జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్, డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (DIA) అమెరికా రక్షణ శాఖ రిపోర్టులు ఉన్నాయి. అయితే, 1976లో కనిపించిన వస్తువుకు, తాజాగా టెహ్రాన్‌లో కనిపించిన లైట్లకు సంబంధం ఉందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement