ప్రపంచ దేశాల అధినేతలు కొలువుదీరిన ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్ షరా తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టర్కీ అధ్యక్షుడు రెసిప్ తయ్యప్ ఎర్డోగాన్ ఆవేశపూరితంగా ప్రసంగిస్తున్న సమయంలో.. అల్ షరా కూల్‌గా స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేస్తూ కెమెరాకు చిక్కారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతోంది.
యూఎన్ సాధారణ సభ 81వ సెషన్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ వేదికగా ప్రపంచ నేతలు యుద్ధాలు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, సంక్షోభాలు, దౌత్యపరమైన అంశాలపై ప్రసంగిస్తున్నారు. ఇలాంటి కీలక సమావేశం సాగుతున్న సమయంలో సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్ షరా మాత్రం ఫోన్‌లో నిమగ్నమై కనిపించడం చర్చకు దారితీసింది. ఓవైపు ప్రపంచ నేతలు అత్యంత సీరియస్ అంశాలపై మాట్లాడుతుంటే.. ఆయన మాత్రం ఏం పట్టనట్లు ఫోన్‌లో రిలాక్స్ అవుతున్నారంటూ కొందరు సోషల్ మీడియాలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా..
టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ప్రసంగిస్తున్న సమయంలోనే షరా ఫోన్ చూస్తున్న దృశ్యాలు కెమెరాకు చిక్కడంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. అయితే షరా ఏం చూస్తున్నారో, ఆ సమయంలో ఆయన ఉద్దేశం ఏమిటో స్పష్టంగా తెలియదు. ఇదే సమయంలో మరికొందరు మాత్రం కేవలం కొన్ని సెకన్ల దృశ్యాలను ఆధారంగా చేసుకుని ఆయనపై విమర్శలు చేయడం సరికాదంటూ మద్దతుగా స్పందిస్తున్నారు.
UNGA gets an unexpected Instagram moment
Syrian President Ahmed al-Sharaa appeared busy scrolling Instagram reels as world leaders addressed the UN General Assembly.#UNGA #AhmedAlSharaa #Syria #UnitedNations #Viral #WorldNews pic.twitter.com/gihsZZaNNO— Diganta Guha (@diganta_guha) September 23, 2026
రెండోసారి యూఎన్‌జీఏకు..
అల్ షరాకు ఇది యూఎన్‌జీఏలో రెండోసారి పాల్గొనడం. 2025లో బషర్ అల్ అసద్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఆయన సిరియా తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అదే ఏడాది దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత యూఎన్‌జీఏలో ప్రపంచ నేతలను ఉద్దేశించి ప్రసంగించిన తొలి సిరియా నాయకుడిగా నిలిచారు. అయితే టర్కీ–సిరియా మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ.. యూఎన్ వేదికపై కనిపించిన ఈ దృశ్యం ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఎర్డోగాన్ కశ్మీర్‌పై ఉచిత సలహా..
ఇదే సమయంలో ఎర్డోగాన్ తన ప్రసంగంలో మరోసారి కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. దక్షిణాసియాలోని అన్ని వివాదాలను, కశ్మీర్ సమస్యతో సహా, యూఎన్ చార్టర్, సంబంధిత తీర్మానాల పరిధిలో చర్చల ద్వారా పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కశ్మీర్‌పై ఎర్డోగాన్ యూఎన్ వేదికగా మాట్లాడటం ఇదే తొలిసారి కాదు. 2025లోనూ ఆయన ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఎర్డోగాన్ వ్యాఖ్యలపై భారత్ గతంలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. జమ్మూకశ్మీర్ అంశం భారత్–పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక విషయమని, మూడోపక్ష మధ్యవర్తిత్వం అవసరం లేదని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: ట్రంప్ ఇలా పొగిడాడో లేదో.. పాక్ ప్రధానికి తిట్లు!


