తన జీవితంలో తొలిసారి మంచంపై నిద్రపోతున్నానంటూ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ విశాల్ స్వామి పంచుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సొంతంగా సంపాదించిన డబ్బుతో మంచం కొనుక్కున్న అనంతరం ఆయన ఈ ప్రత్యేక అనుభూతిని వీడియోలో షేర్ చేసుకున్నారు.
విశాల్ స్వామి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేస్తూ.. “ఈ అనుభూతిని నేను మాటల్లో వివరించలేను” అని పేర్కొన్నారు. వీడియోలో కొత్తగా కొనుగోలు చేసిన మంచాన్ని చూపించిన ఆయన.. దానిపై కూర్చొని ఆ క్షణాన్ని ఆస్వాదిస్తున్నట్లు కనిపించారు.
వీడియోలో “నా జీవితంలో తొలిసారి ఈ రాత్రి మంచంపై నిద్రపోతున్నాను. జీవితంలో ఇది ఎంతో అందమైన అనుభూతి” అనే సందేశం కనిపించింది. సాధారణంగా కనిపించే మంచం తనకు మాత్రం ఎంతో ప్రత్యేకమైనదిగా మారిందని ఈ వీడియో ద్వారా ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు భారతరత్న ఇవ్వాలి
ఈ పోస్టుపై పలువురు సామాజిక మాధ్యమ యూజర్లు స్పందించారు. “దేవుడు ఇచ్చిన సౌకర్యాల విలువను అవి కోల్పోయే వరకు మనం గుర్తించం” అని ఓ వ్యక్తి కామెంట్ చేశారు. మరో వ్యక్తి “ఏదో ఒక రోజు మీరు ఒక భవనంలో నిద్రపోవాలని కోరుకుంటున్నాను” అని ఆకాంక్షించారు. ఇంకొకరు “అభినందనలు. పార్టీ ఎప్పుడు?” అని సరదాగా స్పందించారు. “ఏదో ఒక రోజు మీరు చాలా ధనవంతులు అవుతారని నమ్ముతున్నాను”, ‘‘సంతోషంగా ఉంది”, “మీకు అభినందనలు” అంటూ మరికొందరు కామెంట్లు చేశారు.


