తాడేపల్లి : కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం, పమిడిముక్కల మండలం లంకపల్లి గ్రామానికి చెందిన రైతులు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. తమ గ్రామ పరిధిలోని సుమారు 600 ఎకరాల లంక భూములకు సంబంధించి తీవ్ర అవకతవకలు చోటు చేసుకున్నాయని వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు రైతులు.
1952 నుంచి ఆ భూములను సాగు చేసుకుంటున్న రైతులమైన తమను పక్కనపెట్టి, స్థానిక టీడీపీ నాయకులు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై టీడీపీ నాయకులు, వారి బినామీల పేర్లతో అనధికారికంగా పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఏళ్ల తరబడి భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమ హక్కులను కాదని, రాజకీయ ప్రాబల్యంతో భూములను ఇతరుల పేర్లకు మార్చి వారి పేరుతో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ చేశారని వైఎస్ జగన్‌కు ఫిర్యాదు చేశారు సదురు రైతులు.
లంక భూముల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. తమకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ అండగా నిలవాలని వైఎస్ జగన్‌ను కోరారు రైతులు.
రైతుల సమస్యలను, వారి ఆవేదనను విన్న వైఎస్ జగన్.. వారికి అవసరమైన న్యాయం సహాయం పార్టీ తరఫున అందిస్తామని భరోసా ఇచ్చారు. బాధిత రైతులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: ‘కోర్టు తీర్పు.. చంద్రబాబు సర్కార్‌కు చెంపపెట్టు’


