ప్రపంచ సాంకేతిక దిగ్గజం అమెజాన్ చేపట్టిన బూమరాంగ్ హైరింగ్ (మాజీ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవడం) కార్పొరేట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇటీవల వ్యయ నియంత్రణ, ఆర్గనైజేషన్ రీస్ట్రక్చరింగ్ పేరుతో సుమారు 30,000 మంది కార్పొరేట్ సిబ్బందిపై లేఆఫ్స్ వేటు వేసిన సంస్థ ఇప్పుడు ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ (ఏడబ్ల్యూఎస్), మెషిన్ లెర్నింగ్ విభాగాల కోసం మాజీ ఉద్యోగుల వైపే మొగ్గు చూపుతోంది.
లేఆఫ్స్ తర్వాత మారిన సమీకరణాలు
గత కొన్ని త్రైమాసికాలుగా లేఆఫ్స్‌ను ఫ్రేమ్ చేసిన విధానం, ఇప్పుడు కొత్త నియామకాల ప్రాధాన్యతలు వేర్వేరుగా ఉన్నాయి. సంస్థ పునర్నిర్మాణంలో భాగమే ఇదని, సాధారణ రిక్రూట్‌మెంట్ విధానంలో పూర్వ ఉద్యోగులను సంప్రదించడం సాధారణమేనని అమెజాన్ ప్రతినిధి హెలీ సిల్వా స్పష్టం చేశారు. అయితే, అంతర్గతంగా లేఆఫ్స్ బాధితులతో పాటు నైపుణ్యం కలిగిన నిపుణుల కోసం రిక్రూటర్లు ప్రత్యక్ష ఈ-మెయిళ్లు ద్వారా ఇంటర్వ్యూ ఆఫర్లను అందిస్తున్నట్లు కథనాలు చెబుతున్నాయి.
కార్పొరేట్ సంస్కృతిపై ప్రశ్నలు
బూమరాంగ్ ఉద్యోగులను నియమించుకోవడం వల్ల శిక్షణ సమయం (ఆన్‌బోర్డింగ్ టైమ్) తగ్గడమే కాకుండా సంస్థ శైలిపై వారికి ముందే అవగాహన ఉండడం ప్లస్ పాయింట్. కానీ, నిపుణులు ఈ ధోరణిని భిన్నంగా విశ్లేషిస్తున్నారు. ఒక్కసారి లేఆఫ్స్‌కు గురైన లేదా వర్క్ ఫ్రమ్ హోమ్/ఆఫీస్ నిబంధనల వల్ల సంస్థను వీడిన అనుభవజ్ఞులు మళ్లీ ఉద్యోగ భద్రతపై నమ్మకంతో తిరిగి వస్తారా అనేది ప్రధాన ప్రశ్న. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో గ్లోబల్ పోటీ పెరిగిన వేళ నైపుణ్యం ఉన్న ప్రతిభావంతులు వేగంగా దొరక్కపోవడమే ఈ పునరాలోచనకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: సోషల్ మీడియా ఫిర్యాదులకు మోక్షమెప్పుడు?


