మాట జాగ్రత్త.. నా గురించి తెలుసు కదా?.. బిందు మాధవికి నటరాజ్‌ వార్నింగ్‌ | Bigg Boss 10: Nataraj Master Strong Warning To Agnipariksha 2 Host Bindhu Madhavi | Sakshi
Sakshi News home page

‘అలాంటోళ్లు అంటే ఏంటి? మాట జాగ్రత్త!’.. బిందు మాధవికి నటరాజ్ మాస్టర్ వార్నింగ్

Aug 18 2026 10:31 AM | Updated on Aug 18 2026 10:43 AM

Bigg Boss 10: Nataraj Master Strong Warning To Agnipariksha 2 Host Bindhu Madhavi

బిగ్‌బాస్‌ అభిమానులకు పరిచయం అవసరం లేని పేరు నటరాజ్‌ మాస్టర్‌. బిగ్‌బాస్‌ ఓటీటీ సీజన్‌లో బిందు మాధవితో ఆయనకు జరిగిన గొడవ అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఓ నామినేషన్‌ టాస్క్‌లో బిందు మాధవిని ‘శూర్పణఖ’ అంటూ నటరాజ్‌ మాస్టర్‌ బాణాలు విసరడం.. అందుకు ఆమె కూడా తనదైన శైలిలో కౌంటర్‌ ఇవ్వడం అప్పట్లో హైలైట్‌గా నిలిచింది. తాజాగా అదే అంశం మరోసారి తెరపైకి రావడంతో నటరాజ్‌ మాస్టర్‌ తీవ్రంగా స్పందించారు.

ప్రస్తుతం బిగ్‌బాస్‌ సీజన్‌ 10లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా కామనర్స్‌కు అవకాశం కల్పిస్తూ భారీ స్థాయిలో ఆడిషన్స్‌ నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా టాప్‌ 15 ఫైనలిస్టులను ఎంపిక చేసి.. వారిలో కొందరిని బిగ్‌బాస్‌ సీజన్‌ 10లోకి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఎంపిక బాధ్యతలను బిగ్‌బాస్‌ ఓటీటీ సీజన్‌ 1 విజేత బిందు మాధవి, బిగ్‌బాస్‌ సీజన్‌ 4 విజేత అభిజిత్‌, బిగ్‌బాస్‌ సీజన్‌ 1 ఫైనలిస్ట్‌ నవదీప్‌లకు అప్పగించారు.

ఇదిలా ఉంటే.. అగ్నిపరీక్షకు వచ్చిన ఓ ఆర్జేకు జడ్జీలను ఇంటర్వ్యూ చేసే అవకాశం ఇచ్చారు. తాను బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌గా మాత్రమే కాకుండా.. షో తర్వాత బజ్‌ ఇంటర్వ్యూలు చేసే స్థాయికి ఎదగాలని ఉందని అతను చెప్పడంతో అతడితో బజ్‌ ఇంటర్వ్యూ కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా బిగ్‌బాస్‌ ఓటీటీ సమయంలో బిందు మాధవి, నటరాజ్‌ మాస్టర్‌ మధ్య జరిగిన వివాదాన్ని ప్రస్తావించాడు.

‘‘శూర్పణఖ.. ఇదిగో నా బాణం’ అంటూ అప్పట్లో నటరాజ్‌ మాస్టర్‌ బిందు మాధవిపై చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. ఆ సమయంలో మీకు ఎలా అనిపించిందని ఆర్జే ప్రశ్నించాడు. దీనికి బిందు మాధవి స్పందిస్తూ.. తాను చాలా ఇరిటేట్‌ అయ్యానని, అయితే అలాంటి వాళ్లు కూడా ఉండాలి కాబట్టి వారికి థాంక్స్‌ చెప్పాలని పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలే ఇప్పుడు నటరాజ్‌ మాస్టర్‌ ఆగ్రహానికి కారణమైనట్లు తెలుస్తోంది. బిందు మాధవి వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఓ వీడియోను విడుదల చేసిన ఆయన.. తనదైన శైలిలో తీవ్ర స్థాయిలో స్పందించారు. ‘అలాంటోళ్లు కూడా ఉండాలా? అలాంటోళ్లు అంటే ఏంటి? మాట జాగ్రత్త’ అంటూ బిందు మాధవిని ప్రశ్నించారు.

‘ఏమన్నావ్.. అలాంటోళ్లు కూడా ఉండాలా? అలాంటోళ్లంటే ఏంటి? మాట జాగ్రత్త.. అలాంటోళ్లేంటి? అసలు ఏమనుకుంటున్నావ్.. ఒక ఫ్లాట్ ఫామ్‌పై కూర్చుని మాట్లాడితే ఏమైనా మాట్లాడొచ్చని అనుకుంటున్నావా? గేమ్ అయిపోయింది. గేమ్ తరువాత నేను కూడా చాలా ఇంటర్వ్యూలలోమాట్లాడాను. అంతా అయిపోయింది. గేమ్ ఈజ్ గేమ్ అనుకుని అంతా మార్చిపోయి.. నా పాప బర్త్ డేకి కూడా నిన్ను పిలిచాను. కానీ ఇప్పుడు వాళ్లు ఏదో ఉత్సాహంతో అడిగారు. నువ్వు దానికి సమాధానం చెప్పాలి. నీ గురించి నువ్వు చెప్పుకోవాలి.. అవన్నీ తట్టుకున్నాను కాబట్టే గెలిచాను అని అనాలి. నిన్ను నువ్వు హైలైట్ చేసుకుని బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వేయించుకో.. హడావిడి చేసుకో. నీ అలాంటోళ్లు అని అంటున్నావ్ ఏంటి? అక్కడ అన్నది నేనే కదా? 

వాళ్లు వీళ్లైతే ఏమీ అనకుండా ఉంటారేమో. కానీ అక్కడన్నది నేను కదా. నన్ను ఆ ప్లాట్‌ఫామ్‌పై ‘అలాంటోళ్లు’ అని అన్నావ్ కదా.. ఆ మాట వెనక్కి తీసుకో. నువ్వు ఎవరితోనైనా పెట్టుకో.. నాతో పెట్టుకోకు. నేను ఒక్కటే చెప్తున్నా.. అగ్నిపరీక్షకి వచ్చిన వాళ్లకి అవన్నీ అవసరం. అందుకే వాళ్లు భరిస్తున్నారు. మీరు ఎన్ని అన్నా పడుతున్నారు. కానీ నాకు అవసరం లేదు. నువ్వు అలాంటి వాళ్లు అంటూ నా గురించి మాట్లాడాల్సినంత సీన్ లేదు. నిన్ను నువ్వు హైలైట్ చేసుకో. గెలిచాను అని గొప్పగా చెప్పుకో. పొడిచేశాను అని చెప్పుకో. కానీ అలాంటోళ్లు ఇలాంటోళ్లు అని మాత్రం అనకు. మాట జాగ్రత్త. నేను అందరిలా కాదు ఊరుకోవడానికి. తెలుసు కదా మన గురించి’ అంటూ వీడియో ద్వారా బిందు మాధవికి వార్నింగ్ ఇచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement