హంపి, హారిక తొలి గెలుపు | Indian star grandmasters Koneru Hampi and Dronavalli Harika showed their strength | Sakshi
Sakshi News home page

హంపి, హారిక తొలి గెలుపు

Apr 17 2025 1:47 AM | Updated on Apr 17 2025 1:47 AM

Indian star grandmasters Koneru Hampi and Dronavalli Harika showed their strength

పుణే: అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (ఫిడే) మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌ ఐదో అంచె చెస్‌ టోర్నమెంట్‌లో మూడో రోజు భారత స్టార్‌ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక సత్తా చాటుకున్నారు. వీరిద్దరు ఈ టోర్నీలో తొలి విజయాన్ని అందుకున్నారు. బుధవారం జరిగిన మూడో రౌండ్‌ గేముల్లో ప్రపంచ ర్యాపిడ్‌ చాంపియన్, ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి హంపి తెల్ల పావులతో ఆడుతూ 53 ఎత్తుల్లో ప్రపంచ జూనియర్‌ చాంపియన్, భారత్‌కే చెందిన రైజింగ్‌ స్టార్‌ దివ్య దేశ్‌ముఖ్‌ను ఓడించింది.

తొలి రెండు రౌండ్‌ గేముల్లో నెగ్గిన దివ్యకిది తొలి ఓటమి కావడం గమనార్హం. మరో గేమ్‌లో హైదరాబాద్‌కు చెందిన హారిక 68 ఎత్తుల్లో నుర్గుల్‌ సలీమోవా (బల్గేరియా)పై గెలిచి ఈ టోర్నీలో తొలి గెలుపు రుచి చూసింది. భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్‌ వైశాలి రమేశ్‌బాబు రెండో ‘డ్రా’ నమోదు చేసుకుంది. 

పొలీనా షువలోవా (రష్యా)తో జరిగిన మూడో రౌండ్‌ గేమ్‌ను వైశాలి 63 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. మరోవైపు బత్కుయాగ్‌ మున్‌గున్‌తుల్‌ (మంగోలియా) 34 ఎత్తుల్లో అలీనా కష్‌లిన్‌స్కాయా (పోలాండ్‌)పై గెలుపొందగా... జు జినెర్‌ (చైనా)–మెలియా సలోమి (జార్జియా) మధ్య గేమ్‌ 76 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది.   

Advertisement
 
Advertisement
Advertisement