రన్నరప్‌ హంపి | Sakshi
Sakshi News home page

రన్నరప్‌ హంపి

Published Fri, Dec 29 2023 4:56 AM

Silver Medal in Koneru Humpy World Rapid Chess Championship - Sakshi

సమర్‌కండ్‌ (ఉజ్బెకిస్తాన్‌): అద్భుతమైన ఎత్తులతో ప్రత్యర్థుల ఆట కట్టిస్తూ... భారత చెస్‌ స్టార్‌ ప్లేయర్, ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచింది. గురువారం ముగిసిన మహిళల ర్యాపిడ్‌ ఈవెంట్‌లో కోనేరు హంపి విజేతను నిర్ణయించిన ‘ప్లే ఆఫ్‌’ టైబ్రేక్స్‌లో 1.5–2.5 పాయింట్ల తేడాతో అనస్తాసియా బొద్నారుక్‌ (రష్యా) చేతిలో ఓడిపోయి రజత పతకం సొంతం చేసుకుంది.

ఒత్తిడిలో సంయమనంతో ఆడిన అనస్తాసియా తొలిసారి ప్రపంచ ర్యాపిడ్‌ చాంపియన్‌గా అవతరించింది. ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నీ చరిత్రలో హంపికిది మూడో పతకం కావడం విశేషం. 2019లో విశ్వవిజేతగా నిలిచిన హంపి 2012లో కాంస్య పతకం సాధించింది. నిర్ణీత 11 రౌండ్ల తర్వాత బొద్నారుక్, హంపి, టింగ్‌జె లె (చైనా) 8.5 పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా బొద్నారుక్, హంపి తొలి రెండు స్థానాల్లో నిలవడంతో వీరిద్దరి మధ్య విజేతను నిర్ణయించేందుకు టైబ్రేక్‌ నిర్వహించారు.

బ్లిట్జ్‌ పద్ధతిలో జరిగిన తొలి గేమ్‌లో నల్లపావులతో ఆడిన హంపి 56 ఎత్తుల్లో నెగ్గగా... రెండో గేమ్‌లో హంపి 38 ఎత్తుల్లో ఓడిపోయింది. దాంతో స్కోరు 1–1తో సమమైంది. దాంతో తదుపరి గేమ్‌లో గెలిచిన ప్లేయర్‌కు టైటిల్‌ ఖరారు చేసే ‘సడన్‌డెత్‌’ గేమ్‌ను నిర్వహించారు. అయితే ఈ గేమ్‌ 52 ఎత్తుల్లో ‘డ్రా’ అయింది. అయితే నాలుగో గేమ్‌లో బొద్నారుక్‌ 39 ఎత్తుల్లో హంపిపై గెలిచి టైటిల్‌ను ఖరారు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయిలు నూతక్కి ప్రియాంక, సాహితి వర్షిణి 7 పాయింట్లతో వరుసగా 22వ, 23వ స్థానాల్లో నిలిచారు.  

13 రౌండ్లపాటు జరిగిన ఓపెన్‌ విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్‌ విదిత్‌ 9 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. భారత్‌కే చెందిన ప్రజ్ఞానంద 9 పాయింట్లతో 8వ స్థానంలో, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ ఇరిగేశి అర్జున్‌ 8.5 పాయింట్లతో 15వ స్థానంలో నిలిచారు. నార్వే దిగ్గజం మాగ్నస్‌ కార్ల్‌సన్‌ 10 పాయింట్లతో మరోసారి ప్రపంచ చాంపియన్‌ అయ్యాడు.   

Advertisement
 
Advertisement
 
Advertisement