తొలిసారి ఇండియన్ వెల్స్ ఓపెన్ సింగిల్స్ టైటిల్స్ సొంతం
కాలిఫోర్నియా: మ్యాచ్ పాయింట్ కాపాడుకొని బెలారస్ స్టార్ సబలెంకా... ఒక్క సెట్ కూడా కోల్పోకుండా ఇటలీ స్టార్ యానిక్ సినెర్... ఇండియన్ వెల్స్ ఓపెన్ మాస్టర్స్–1000 టెన్నిస్ టోర్నీలో తొలిసారి విజేతలుగా అవతరించారు. మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, 2023, 2025 రన్నరప్ సబలెంకా 3–6, 6–3, 7–6 (8/6)తో ఆ్రస్టేలియన్ ఓపెన్ చాంపియన్ రిబాకినా (కజకిస్తాన్)పై గెలిచింది. ఈ విజయంతో ఆ్రస్టేలియన్ ఓపెన్ ఫైనల్లో రిబాకినా చేతిలో ఎదురైన ఓటమికి సబలెంకా బదులు తీర్చుకుంది.
నిర్ణాయక మూడో సెట్ టైబ్రేక్‌లో సబలెంకా 5–6తో వెనుకబడి ఓటమికి పాయింట్ దూరంలో నిలిచింది. ఈ దశలో సంయమనం కోల్పోకుండా ఆడిన ఈ బెలారస్ స్టార్ స్కోరును సమం చేయడంతోపాటు వరుసగా మూడు పాయింట్లు గెలిచి 8–6తో సెట్‌తోపాటు, మ్యాచ్‌ను హస్తగతం చేసుకుంది. విజేత సబలెంకాకు 15,11,380 డాలర్ల (రూ. 13 కోట్ల 94 లక్షలు) ప్రైజ్‌మనీ, 1000 ర్యాంకింగ్ పాయింట్లు దక్కాయి. రన్నరప్ రిబాకినా ఖాతాలో 6,12,340 డాలర్ల (రూ. 5 కోట్ల 54 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 650 ర్యాంకింగ్ పాయింట్లు చేరాయి.
జొకోవిచ్, ఫెడరర్ సరసన సినెర్...
మూడో ప్రయత్నంలోనైనా ఇండియన్ వెల్స్ టోర్నీ టైటిల్ సాధించాలని ఆశించిన రష్యా స్టార్ మెద్వెదెవ్‌కు నిరాశ ఎదురైంది. ప్రపంచ రెండో ర్యాంకర్ యానిక్ సినెర్ 7–6 (8/6), 7–6 (7/4)తో 11వ ర్యాంకర్ మెద్వెదెవ్‌ను ఓడించి తొలిసారి ఇండియన్ వెల్స్ టోర్నీ టైటిల్ గెలిచాడు. ఓవరాల్‌గా సినెర్ కెరీర్‌లో ఇది ఆరో మాస్టర్స్ టైటిల్. 2023, 2024లలో ఈ టోర్నీ ఫైనల్లో అల్‌కరాజ్ చేతిలో ఓడిమెద్వెదెవ్ రన్నరప్‌గా నిలిచాడు.
1990లో మాస్టర్స్ సిరీస్ మొదలయ్యాక ఒక్క సెట్ కూడా కోల్పోకుండా రెండు మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ (ఏటీపీ ఫైనల్స్ టోర్నీ, ఇండియన్ వెల్స్ టోర్నీ) నెగ్గిన తొలి ప్లేయర్‌గా సినెర్ రికార్డు నెలకొల్పాడు. దిగ్గజాలు జొకోవిచ్ (సెర్బియా), ఫెడరర్ (స్విట్జర్లాండ్) తర్వాత హార్డ్‌కోర్టులపై జరిగే ఆరు మాస్టర్స్ టైటిల్స్‌ను గెలిచిన మూడో ప్లేయర్‌గా ఈ ఇటలీ స్టార్ గుర్తింపు పొందాడు.
చాంపియన్ సినెర్‌కు 15,11,380 డాలర్ల (రూ. 13 కోట్ల 94 లక్షలు) ప్రైజ్‌మనీ, 1000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ మెద్వెదెవ్‌కు 6,12,340 డాలర్ల (రూ. 5 కోట్ల 54 లక్షలు) ప్రైజ్‌మనీ, 650 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.


