చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్‌ మ్యాచ్‌లకు ‘సై’ | 7 matches including the final at Chinnaswamy Stadium | Sakshi
Sakshi News home page

చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్‌ మ్యాచ్‌లకు ‘సై’

Mar 17 2026 4:07 AM | Updated on Mar 17 2026 4:07 AM

7 matches including the final at Chinnaswamy Stadium

అనుమతించిన కర్ణాటక ప్రభుత్వం 

భద్రతా ఏర్పాట్లపై నిపుణుల కమిటీ సంతృప్తి

చిన్నస్వామి స్టేడియంలో ఫైనల్‌తో కలిపి 7 మ్యాచ్‌లు

ఈనెల 28న ఆర్‌సీబీ, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌తో ఐపీఎల్‌ షురూ

బెంగళూరు: సందిగ్ధత వీడింది. బెంగళూరు క్రికెట్‌ అభిమానులకు కర్ణాటక ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఈ ఏడాది యధావిధిగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) టి20 క్రికెట్‌ టోర్నీ మ్యాచ్‌లను బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించుకునేందుకు కర్ణాటక ప్రభుత్వం అనుమతించింది. చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ), మాజీ విజేత సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్ల మధ్య మార్చి 28న జరిగే తొలి మ్యాచ్‌తో ఐపీఎల్‌ 19వ సీజన్‌కు తెర లేవనుంది. 

కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర్‌తో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ, కర్ణాటక రాష్ట్ర క్రికెట్‌ సంఘం (కేఎస్‌సీఏ), ఆర్‌సీబీ ప్రతినిధులు, ఆర్‌సీబీ ఈవెంట్‌ మెనేజ్‌మెంట్‌ సంస్థ డీఎన్‌ఏ ప్రతినిధులు సోమవారం సమావేశమయ్యారు. చిన్నస్వామి స్టేడియంలో అభిమానులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, మ్యాచ్‌లు సాఫీగా జరిగేలా తాము తీసుకున్న భద్రతా చర్యలను ఈ సమావేశంలో వివరించారు. కేఎస్‌సీఏ, ఆర్‌సీబీ తీసుకున్న చర్యలపట్ల నిపుణుల కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. దాంతో చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్‌ మ్యాచ్‌ల నిర్వహణకు అడ్డంకులు తొలగిపోయాయి. 

ఈ సీజన్‌లో చిన్నస్వామి స్టేడియంలో మొత్తం ఏడు ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందులో ఆర్‌సీబీ ఐదు హోం మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ ఐదు కాకుండా ఒక ప్లే ఆఫ్‌ మ్యాచ్, ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతాయి. డిఫెండింగ్‌ చాంపియన్‌ జట్టు మైదానంలో తదుపరి సీజన్‌ ఫైనల్‌ జరగడం ఐపీఎల్‌లో ఆనవాయితీగా వస్తోంది. ఆర్‌సీబీ మరో రెండు హోం మ్యాచ్‌లు రాయ్‌పూర్‌లోని షహీద్‌ వీర్‌ నారాయణ్‌ సింగ్‌ అంతర్జాతీయ స్టేడియంలో ఆడుతుంది. గత ఏడాది రజత్‌ పాటీదార్‌ సారథ్యంలోని ఆర్‌సీబీ జట్టు సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ తొలిసారి ఐపీఎల్‌ చాంపియన్‌గా అవతరించింది. 

అనంతరం విజయోత్సవ వేడుకలను చిన్నస్వామి స్టేడియంలో ఏర్పాటు చేశారు. అయితే ముందు జాగ్రత్తగా పకడ్బందీ ఏర్పాటు చేయకపోవడం, వేలాది సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో పరిస్థితి అదుపు తప్పి చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 11 మంది అభిమానులు మృతి చెందారు. ఈ ఉదంతంపై తీవ్రంగా స్పందించిన కర్ణాటక ప్రభుత్వం ఆర్‌సీబీ ఫ్రాంచైజీ నిర్వాహకులపై కేసులు నమోదు చేసింది. చిన్నస్వామి స్టేడియంలో ఎలాంటి మ్యాచ్‌లు జరగకుండా తాత్కాలిక నిషేధం విధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement