కోల్‌కతా పరిసర ప్రాంతంలోని మోమో ఆహార పదార్థాల గోదాంలో జనవరి 26న జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పటివరకూ 16 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మరో 13 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది.
జనవరి 26 గణతంత్ర దినోత్సవం వేళ పశ్చిమ బెంగాల్ కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం ఘోర విషాదాన్ని మిగిల్చింది. ఆ రోజు ఉదయం 3 గంటల ప్రాంతంలో కోల్‌కతా సమీపంలోని ఆనంద్‌పూర్‌లోని రెండు ఆహార గిడ్డంగుల్లో మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆర్పే యత్నం చేశాయి. అయితే గోదాంలోపల పోడి ఆహర పదార్థాలతో పాటు మండే ఆహర పదార్థాలు అధికంగా ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ఎంతకూ అదుపులోకి రాలేదు.
దీంతో అందులో ఉన్న కార్మికులు అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నారు. ఈ ప్రమాదం నుంచి నలుగురు కార్మికులు చాకచక్యంగా తప్పించుకోగలిగారు. దీంతో ఫైరింజన్ సిబ్బంది అందులో చిక్కుకున్న వారి కోసం గాలింపులు చేపట్టగా 16 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగతా వారి కోసం గాలింపులు చేపడుతున్నారు. అయితే మృతదేహాలను గుర్తించడం కష్టంగా ఉన్నందున అధికారులు మంటల్లో చిక్కుకున్న వారి బంధువుల రక్త నమూనా ఆధారంగా వాటి డెడ్ బాడీల గుర్తింపు చేపడుతున్నారు.
ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు మోమో కంపెనీ రూ. 10 లక్షల పరిహారం ప్రకటించింది. అంతేకాకుండా వారి కుటుంబాలకు ప్రతినెల ఆర్థిక సహాయం వారి పిల్లల చదువు బాధ్యతలు భరిస్తామని తెలిపింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రమాదం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.


