న్యూఢిల్లీ/పట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు చేదు అనుభవం ఎదురుకానున్నదని ఎగ్టిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇప్పటివరకు ప్రధానంగా తొమ్మిది ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. వాటిలోని దైనిక్ భాస్కర్, మాట్రిజ్, పీపుల్స్ ఇన్‌సైట్, పీపుల్స్ పల్స్, జేవీసీ, పీ-మార్క్, చాణక్య స్ట్రాటజీస్, డీవి రీసెర్చ్, టీఐఎఫ్ రీసెర్చ్‌లు.. పాలక ఎన్డీఏకి స్పష్టమైన విజయాన్ని, ప్రతిపక్ష మహాకూటమికి ఓటమిని చూపాయి. రాష్ట్రంలో మూడవ ప్రత్యామ్నాయం అయిన ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ‘జన్ సురాజ్’కు షాక్‌నకు గురిచేసే ఫలితాలను అంచనావేశాయి.
బీహార్‌లోని 243 నియోజకవర్గాలలో ‘జన్ సురాజ్’పోటీ చేసినప్పటికీ, ఆ పార్టీ ఖాతా తెరవడంలో విఫలం కావచ్చని అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. పీపుల్స్ పల్స్ 0-5 పరిధిని అంచనా వేయగా, దైనిక్ భాస్కర్ 0-3, పీపుల్స్ ఇన్‌సైట్ 0-2, మ్యాట్రిజ్ 0-2, జేవీసీ 0-1 మధ్య ‘జన్ సురాజ్’కు సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశాయి. కాగా బీహార్‌లో రెండు దశల పోలింగ్‌లో రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతాలు నమోదయ్యాయి. ఇది అధికార వ్యతిరేకతకు సూచన అంటూ మహాకూటమి, జన్ సూరాజ్‌లు ఆశాభావం వ్యక్తం చేశాయి. అయితే ఎగ్జిట్ పోల్స్, నిపుణుల అంచనా అందుకు భిన్నంగా ఉంది.
జన్ సురాజ్ పార్టీ స్వల్ప ఓట్ల శాతాన్ని గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. ఈ ఓట్ల వాటాలో ఎక్కువ శాతం మహాకూటమి నుంచి వచ్చే అవకాశం ఉందని తెలిపాయి. ఎన్‌డీఏ వ్యతిరేక ఓట్లు ‘జన్ సురాజ్’కు పడే అవకాశాలు చాలా తక్కువేనని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. బీహార్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు తక్కువగానే ఉందని, అది మహాకూటమి, ప్రశాంత్ కిషోర్ పార్టీ మధ్య చీలిపోయి, ప్రతిపక్షాలను దెబ్బతీసిందని నిపుణులు అంటున్నారు. అలాగే ప్రశాంత్ కిశోర్ పార్టీ సంవత్సరం క్రితమే వచ్చిందని, అది నిలదొక్కుకునేందుకు చాలా కాలం పడుతుందని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: ఢిల్లీ పేలుడు: ‘భయంతో పేల్చేశారా?’.. నిఘా వర్గాలు


