న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు యావత్ ప్రపంచాన్ని కలవరానికి గురిచేసింది. ఈ కేసు దర్యాప్తులో పలు విషయాలు వెల్లడవుతున్నాయి. అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం అనుమానితులు పేలుడు పదార్థాలను తీసుకెళ్తున్నప్పుడు భయపడి పొరపాటు చేసి ఉండవచ్చని ఉన్నత నిఘా వర్గాలు ‘ఎన్‌డీటీవీ’కి తెలిపాయి.
దేశంలో కొంతకాలంగా ఉగ్రవాద అనుమానితులపై దాడులు, హర్యానాలోని ఫరీదాబాద్‌లో బాంబుల తయారీకి ఉపయోగించే 2,900 కిలోల రసాయనాన్ని స్వాధీనం చేసుకోవడం అనుమానితులను భయాందోళనకు గురిచేసివుంటుందని, దీంతో వారు ఆ పదార్థాలను వేరే చోటకు తరలించాల్సి రావడంతో, ఈ నేపధ్యంలోనే పొరపాటు జరిగివుండవచ్చిన నిఘా వర్గాలు అంచనావేశాయి.
రవాణా సమయంలో ప్రమాదవశాత్తూ ఆ పదార్థం పేలిపోయివుండవచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. కాగా నిందితుడు ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరాన్ని (ఐఈడీ) సరిగ్గా అమర్చలేదని నిఘా వర్గాలు గుర్తించాయి. ఫలితంగా ఐఈడీ పరిమిత ప్రభావాన్ని చూపిందని వారు తెలిపారు. హ్యుందాయ్ ఐ20 కారులో జరిగిన పేలుడులో తొమ్మిది మంది మృతిచెందగా, 24 మంది గాయపడ్డారు. ఈ పేలుడు కారణంగా ఎర్రకోట సమీపంలోని కొన్ని భవనాలు కంపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఐఈడీని కారులో మోసుకెళ్తున్న అనుమానితులు వాహనం నడుపుతున్నప్పుడు ప్రమాదవశాత్తూ పేలుడు సంభవించిందని సూచించే మరిన్ని ప్రాథమిక ఆధారాలు అధికారులకు లభించాయి. వారు భయాందోళనకు గురై, ఐఈడీని గరిష్ట నష్టం కోసం ఉపయోగించలేకపోయారని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. వాహనం కదులుతున్నందున ఐఈడీ పేలిపోయివుండవచ్చని, ఈ భావన కూడా ప్రమాదవశాత్తూ పేలుడు జరిగిందనే అంచనాకు మద్దతు ఇస్తుందని నిఘా వర్గాలు తెలిపాయి.

అనుమానితులు పేలుడు పదార్థాలను తరలించడానికి లేదా వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో పేలుడు జరిగిందనే అభిప్రాయాన్ని ఉన్నత నిఘా వర్గాలు తోసిపుచ్చలేదు. అయితే దేశవ్యాప్తంగా స్లీపర్ టెర్రర్ యూనిట్లపై పోలీసులు, ఇతర ఏజెన్సీలు చేసిన దాడులు విస్తృత ముప్పును అరికట్టడంలో సహాయపడిందని అధికార వర్గాలు తెలిపాయి. తెల్లని హ్యుందాయ్ ఐ20 కారును నడిపిన కీలక నిందితుడిని జమ్ముకశ్మీర్‌కు చెందిన వైద్యుడు ఉమర్ నబీగా గుర్తించారు. పేలుడు జరిగిన రోజుకు మూడు రోజుల ముందు నుంచే అతను తన ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసి, అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అతని కుటుంబ సభ్యులతోనూ కమ్యూనికేషన్‌లను నిలిపివేశాడు.
ఇది కూడా చదవండి: ఢిల్లీ పేలుడు.. పాక్ వణుకు?


