న్యూఢిల్లీ: ఢిల్లీలో జరిగిన పేలుడు దరిమిలా భారత్ నుంచి ప్రతీకార దాడులుంటాయనే అనుమానం, భయంతో పాకిస్తాన్ వణికిపోతోంది. ఈ నేపధ్యంలో పాక్ వైమానిక దళం రాజస్థాన్ సరిహద్దులో వైమానిక దళ గస్తీని ప్రారంభించిందని‘దైనిక్ భాస్కర్’ తన కథనంలో తెలిపింది. పాక్‌లోని త్రివిధ దళా అధిపతులు అత్యవసర సమావేశం నిర్వహించారని పేర్కొంది. ప్రధాని షాబాజ్ షరీఫ్ కూడా సోమవారం రాత్రి పొద్దుపోయే వరకు ఎన్‌ఎస్‌ఏ, ఐఎస్‌ఐతో సమావేశాలు నిర్వహించారని సమాచారం.
ఢిల్లీ ఎర్రకోట వెలుపల జరిగిన కారు బాంబు పేలుడు తరువాత పాకిస్తాన్ తన అన్ని వైమానిక స్థావరాలు, వైమానిక స్థావరాల వద్ద రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారతదేశం నుండి ప్రతీకారం ఎదురయ్యే అవకాశం లేదా సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలు పెరిగే చాన్స్ ఉందని నిఘా సంస్థల నుండి పాకిస్తాన్‌కు హెచ్చరికలు అందాయి. ఫలితంగా పాకిస్తాన్ తన సైన్యం, నేవీ, వైమానిక దళాలను హై అలర్ట్‌లో ఉంచింది. అలాగే పాకిస్తాన్ సెంట్రల్ కమాండ్.. పరిస్థితిని నిశితంగా పరిశీలించాలని, ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే దానిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సైన్యంలోని అన్ని శాఖలను ఆదేశించింది.
అంతేకాకుండా భారతదేశం నుండి ఏదైనా దాడి జరిగితే తక్షణం ప్రతీకారం తీర్చుకునేందుకు వాయు రక్షణ వ్యవస్థలను పాకిస్తాన్ యాక్టివ్ చేసింది. భారతదేశం నుంచి ముందస్తు దాడి లేదా ఇతర సైనిక చర్యను ఊహించి పాక్ ఈ తరహా నిఘా కొనసాగిస్తోంది. వైమానిక రక్షణ రాడార్లు ఇప్పుడు పాకిస్తాన్ వైమానిక సరిహద్దులను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. అలాగే పాకిస్తాన్ నవంబర్ 11 నుండి 12 వరకు నోటమ్ (ఎయిర్‌మెన్‌కు నోటీసు) జారీ చేసింది. అంటే ఈ రెండు రోజుల్లో, సరిహద్దు ఆకాశంలో విమానాలు తిరిగేందుకు పరిమితులు, భద్రతా నిబంధనలు అమలులో ఉంటాయి.
కాగా ఢిల్లీలో పేలుడు దరిమిలా భారతదేశంలోని కొన్ని ప్రాంతాలకు వెళ్లవద్దని యూకే విదేశాంగ కార్యాలయం (ఎఫ్‌సీడీఓ) ప్రయాణ సలహా జారీ చేసింది. భారత్-పాక్ సరిహద్దుకు 10 కిలోమీటర్ల పరిధిలో, జమ్ముకశ్మీర్, మణిపూర్ రాష్ట్రాలలో ప్రయాణించవద్దని బ్రిటిష్ పౌరులకు యూకే ప్రభుత్వం సూచించింది. ఇదే విధంగా ఎర్రకోట తదితర పర్యాటకులతో రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లవద్దని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అమెరికా రాయబార కార్యాలయం తమ పౌరులకు హెచ్చరిక జారీ చేసింది. ఢిల్లీలోని తమ దేశ పౌరులు అప్రమత్తంగా ఉండాలని ఫ్రెంచ్ రాయబార కార్యాలయం సూచించింది.
ఇది కూడా చదవండి: ఢిల్లీ పేలుడు: ఈ కష్టం పగవాడికి కూడా.. కండక్టర్ విషాదాంతం


