భద్రతా హామీలపై చర్చ
కీవ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఆదివారం ఫ్లోరిడాలో సమావేశమయ్యే అవకాశముందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ శుక్రవారం తెలిపారు. ‘మేం ఒక్క రోజు కూడా వృథాగా పోనివ్వడం లేదు. అధ్యక్షుడు ట్రంప్‌తో అతి త్వరలోనే ఉన్నత స్థాయి సమావేశం జరిపేందుకు సిద్ధంగా ఉన్నాం. నూతన సంవత్సరం ప్రవేశించే లోగానే కీలక పరిణామాలు సంభవించొచ్చు’అని ఆయన మీడియాకు తెలిపారు. ట్రంప్ ప్రతిపాదిత 20–సూత్రాల ప్రణాళికలో 90 శాతం మేర ఏకాభిప్రాయం కుదిరిందన్నారు.
ఆదివారం జరిగే సమావేశం సందర్భంగా ఉక్రెయిన్‌కు అమెరికా ఇచ్చే భద్రతా హామీలపై చర్చించనున్నామన్నారు. జెలెన్‌స్కీ వ్యాఖ్యలతో చర్చలు పురోగతిలో ఉన్నట్లు భావించవచ్చని పరిశీలకులు అంటున్నారు. అమెరికా ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జేర్డ్ కుషె్నర్‌తో ఫలవంతమైన చర్చలు జరిగినట్లు జెలెన్‌స్కీ అంతకుముందు గురువారం ప్రకటించారు. పారిశ్రామికంగా కీలకమైన తూ ర్పు ప్రాంతం తమ బలగాలను ఉపసంహరించుకునేందుకు సిద్ధమని జెలెన్‌స్కీ తెలిపారు. అయితే, రష్యా కూడా ఆ ప్రాంతం నుంచి బలగాలను ఉపసంహరించుకుని, నిస్సైనిక ప్రాంతంగా ప్రకటించేందుకు సిద్ధం కావాలన్నారు.


