బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి ఎన్డీయే కూటమి దూసుకుపోతోంది. ప్రస్తుతం 190 ఫ్లస్ లీడ్‌తో హిస్టారికల్ విక్టరీ అందుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ ట్రెండ్స్ ప్రకారం.. మహాఘట్ బంధన్ ఘోర పరాజయం దిశగా పయనిస్తోంది. మరోవైపు.. అయితే ఘనవిజయం లేదంటే ఘోర పరాజయం అంచనా వేసిన ఎన్నికల మాజీ వ్యూహకర్త, జన్ సురాజ్ అధినేత ప్రశాంత్ కిషోర్ జోస్యం మాత్రం నిజం కాబోతోంది.
ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్‌కు ఇది తొలి ఎన్నికలు. అయితే ఆశించిన విజయాన్ని అందుకోకున్నా.. ఈ పార్టీ ఎక్స్‌ఫ్యాక్టర్‌గా పని చేయొచ్చని విశ్లేషకులు భావించారు. ఎగ్జిట్‌పోల్స్ మాత్రం జేఎస్‌పీ ఘోరంగా విఫలమవుతుందని, ఒక్క సీటు మాత్రమే గెలిచే అవకాశం అంతంత మాత్రంగా ఉందని అంచనా వేశాయి. కానీ, ఆ అంచనా కూడా తప్పేలా కనిపిస్తోంది.
ఇవాళ్టి బిహార్ ఎన్నికల ఫలితాల్లో పోస్టల్ బ్యాలెట్, ఆపై ఈవీఎం కౌంటింగ్‌లోనూ రెండు నుంచి 4 స్థానాల్లో ఆధిక్యం కనబర్చింది. ఆ తర్వాత నెమ్మదిగా సున్నాకే పరిమితమైంది. ఇప్పుడు ఒక్క స్థానం దక్కించుకోవడం కూడా అనుమానంగానే కనిపిస్తోంది. చివర్లో ఎలాంటి ఫలితం దక్కించుకుంటోందో చూడాలి. ఎన్నికల వ్యూహకర్తగా నితీశ్ కుమార్ సహా పలువురి విజయాల్లో పీకే కీలక పాత్ర పోషించారు. అయితే.. సొంత పార్టీతో మూడేళ్లుగా చేస్తున్న ప్రచారం మాత్రం వర్కవుట్ కాలేదనే స్పష్టం చేస్తోంది.
ఈసీ ట్రెండ్స్ ప్రకారం.. బీహార్ ఎన్నికల్లో జేడీయూ లార్జెస్ట్ పార్టీగా అవతరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తద్వారా నితీశ్ పని అయిపోయిందని విపక్షాలు చేస్తున్న ప్రచారానికి ఈ ఫలితం పుల్‌స్టాప్ వేసిందని భావించొచ్చు. ఇక అధికార మిత్రపక్షం బీజేపీ ఆ తర్వాతి స్థానంలో కొనసాగుతోంది. తుది ఫలితాలు వెల్లడయ్యేలోపు ఈ లెక్క కొంచెం మారే అవకాశం లేకపోలేదు.
గత ఎన్నికల్లో ఆర్జేడీ(75), బీజేపీ(74), జేడీయూ(43), కాంగ్రెస్(19).. ఇలా ప్రధాన పార్టీలు సీట్లు దక్కించుకున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ఎన్డీయే హవా చూస్తుంటే ఆర్జేడీ+కాంగ్రెస్+ఇతర పార్టీల కూటమి సగానికి పైగా స్థానాలను కోల్పోయే అవకాశం కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్‌కు ఘోర పరాభవం ఎదురయ్యేలా కనిపిస్తోంది. ఇక్కడో విచిత్రం ఏంటంటే..
200 స్థానాల్లో పీకే జేఎస్‌పీ డిపాజిట్లు కొల్పోయింది. విపక్ష కాంగ్రెస్ కంటే.. పీకే జేఎస్‌పీ ఓటు శాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు(అంచనా మాత్రమే). మొత్తంగా ప్రశాంత్ కిషోర్ పార్టీ ఈ ఎన్నికల్లో పూర్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ.. మహాఘట్ బంధన్ ఓట్లను చీల్చడం ద్వారా NDAకి లాభం చేకూర్చిందనే చర్చ మొదలైందక్కడ.


