పట్నా: బిహార్ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన రోజునే జన్ సురాజ్ పార్టీ (జేఎస్‌పీ)కి చెందిన అభ్యర్థి చంద్ర శేఖర్ సింగ్ గుండెపోటుతో మృతి చెందడం ఆ పార్టీకి తీరని లోటుగా మారింది.. తరారి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసిన సింగ్ ఎన్నికల ఫలితాలు వచ్చిన శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో పట్నాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
కుర్మురి గ్రామానికి చెందిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడైన చంద్ర శేఖర్ సింగ్, రాజకీయ నేపథ్యం లేకపోయినా సమాజంలో పేరు ప్రఖ్యాతులున్నాయి. దీంతో ఆయన ప్రశాంత్ కిషోర్ స్ఫూర్తితో జన్ సురాజ్ పార్టీలో చేరి, ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కించుకున్నారు. అయితే ప్రచారంలో ఉన్నప్పుడే ఆయనకు మొదటిసారి అక్టోబర్ 31న గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. ఎన్నికల ఫలితాల రోజున ఆయనకు రెండవసారి వచ్చిన గుండెపోటు ప్రాణాంతకమైంది. ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం ఆయన తరారి నియోజకవర్గంలో 2,271 ఓట్లను సాధించారు. ఈ స్థానంలో బీజేపీకి చెందిన విశాల్ ప్రశాంత్ విజయం సాధించారు. సింగ్ మరణ వార్తతో ఆయన స్వగ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది.
ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జన్ సూరజ్ పార్టీ బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 'గేమ్-ఛేంజర్'గా ప్రవేశించినప్పటికీ, 243 స్థానాల్లో ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది. ఈ పార్టీ ఇతర పార్టీల కంటే అత్యధికంగా 238 నియోజకవర్గాల్లో పోటీ చేసింది. రాష్ట్రంలోని నిరుద్యోగం, వలసలు, పారిశ్రామిక అభివృద్ధి లేమి తదితర కీలక అంశాలపై ప్రచారం నిర్వహించినా, అది ఓటర్లలో ప్రభావం చూపలేకపోయింది. పలువురు జేఎస్‌పీ అభ్యర్థులు తమ సెక్యూరిటీ డిపాజిట్లను కూడా దక్కించుకోలేకపోయారు.
ఇది కూడా చదవండి: ‘పొత్తు వద్దంటే చిత్తే’.. ‘ఇండియా కూటమికి’ మజ్లిస్ షాక్


