ఛాతీ నొప్పి అని మొత్తుకున్నా పట్టించుకోని వైనం
8 గంటల పాటు వెయిటింగ్ రూమ్ లోనే
వాంకోవర్: ప్రశాంత్ శ్రీకుమార్ అనే 44 ఏళ్ల భారత సంతతి వ్యక్తి కెనడాలో ఆస్పత్రి నిర్లక్ష్యానికి బలైపోయాడు. ఛాతీలో భరించలేనంత నొప్పి అని మొత్తుకుంటున్నా అతనికి వైద్యమే అందించలేదు. ఈసీజీలో అంతా నార్మల్ గానే వచ్చిందని చెప్పి ఎమర్జెన్సీ గదిలో ఏకంగా 8 గంటల పాటు వేచిఉండేలా చేశారు. ఎట్టకేలకు చికిత్స కోసం తీసుకెళ్తుండగానే అతను తీవ్ర గుండెపోటుకు గురయ్యాడు.
కూర్చున్న కుర్చీలోనే ఛాతీ పట్టుకుంటూ ఎగిరెగిరి పడి చివరికి నిస్సహాయంగా మరణించాడు. ‘‘నాన్నా!. ఈ నొప్పి భరించలేకపోతున్నా’ అంటూ చివరి క్షణాల్లో తన కొడుకు అల్లాడిపోయాడని తండ్రి కుమార్ రోదిస్తూ చెప్పారు. అవే తన చివరి మాటలు అయ్యాయంటూ కన్నీరు మున్నీరయ్యారు. డిసెంబర్ 22వ తేదీన జరిగిన ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది.
కెనడాలోని ఎడ్మాంటన్‌లో ఉండే ప్రశాంత్ తన ఆఫీసులో పని చేస్తున్న సమయంలోనే విపరీతమైన ఛాతీ నొప్పితో అలసిపోయాడు. దాంతో సహోద్యోగి ఒకరు అతడిని వెంటనే గ్రే నన్స్ కమ్యూనిటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చాలాసేపు వెయిటింగ్ రూమ్‌లో కూచోబెట్టాక ఈసీజీ చేశారు. అందులో అంతా నార్మల్‌గానే ఉందంటూ నొప్పికి ‘టైలీనల్’ అనే మందు ఇచ్చి సరిపెట్టారు. అంతలో ఆస్పత్రికి చేరిన నాన్నతో నొప్పి భరించరానిదిగా ఉందంటూ ప్రశాంత్ వాపోయాడు.
‘తన రక్తపోటు(బీపీ) క్షణక్షణానికి పెరుగుతూనే పోయింది. కానీ ఎంత చెప్పినా నర్సులు పట్టించుకోలేదు’’ అని తండ్రి ఆక్షేపించారు. ‘‘ఎట్టకేలకు తనను చికిత్సకు తీసుకెళ్లేందుకు వచ్చారు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది. ప్రశాంత్ నావైపు చూస్తూనే కూర్చున్న కుర్చీలో కుప్పకూలాడు’’ అని చెప్పుకొచ్చారు. ఈ ఘటన పట్ల ఆస్పత్రి దిగ్భ్రాంతి వెలిబుచ్చింది. దీనిపై సమీక్ష జరుపుతున్నట్టు తెలిపింది. ప్రశాంత్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. ప్రశాంత్‌కు భార్య, ముగ్గురు పిల్లలున్నారు.


