breaking news
person daied
-
కెనడాలో ఆస్పత్రి నిర్లక్ష్యానికి భారతీయుని బలి
వాంకోవర్: ప్రశాంత్ శ్రీకుమార్ అనే 44 ఏళ్ల భారత సంతతి వ్యక్తి కెనడాలో ఆస్పత్రి నిర్లక్ష్యానికి బలైపోయాడు. ఛాతీలో భరించలేనంత నొప్పి అని మొత్తుకుంటున్నా అతనికి వైద్యమే అందించలేదు. ఈసీజీలో అంతా నార్మల్ గానే వచ్చిందని చెప్పి ఎమర్జెన్సీ గదిలో ఏకంగా 8 గంటల పాటు వేచిఉండేలా చేశారు. ఎట్టకేలకు చికిత్స కోసం తీసుకెళ్తుండగానే అతను తీవ్ర గుండెపోటుకు గురయ్యాడు. కూర్చున్న కుర్చీలోనే ఛాతీ పట్టుకుంటూ ఎగిరెగిరి పడి చివరికి నిస్సహాయంగా మరణించాడు. ‘‘నాన్నా!. ఈ నొప్పి భరించలేకపోతున్నా’ అంటూ చివరి క్షణాల్లో తన కొడుకు అల్లాడిపోయాడని తండ్రి కుమార్ రోదిస్తూ చెప్పారు. అవే తన చివరి మాటలు అయ్యాయంటూ కన్నీరు మున్నీరయ్యారు. డిసెంబర్ 22వ తేదీన జరిగిన ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. కెనడాలోని ఎడ్మాంటన్‌లో ఉండే ప్రశాంత్ తన ఆఫీసులో పని చేస్తున్న సమయంలోనే విపరీతమైన ఛాతీ నొప్పితో అలసిపోయాడు. దాంతో సహోద్యోగి ఒకరు అతడిని వెంటనే గ్రే నన్స్ కమ్యూనిటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చాలాసేపు వెయిటింగ్ రూమ్‌లో కూచోబెట్టాక ఈసీజీ చేశారు. అందులో అంతా నార్మల్‌గానే ఉందంటూ నొప్పికి ‘టైలీనల్’ అనే మందు ఇచ్చి సరిపెట్టారు. అంతలో ఆస్పత్రికి చేరిన నాన్నతో నొప్పి భరించరానిదిగా ఉందంటూ ప్రశాంత్ వాపోయాడు. ‘తన రక్తపోటు(బీపీ) క్షణక్షణానికి పెరుగుతూనే పోయింది. కానీ ఎంత చెప్పినా నర్సులు పట్టించుకోలేదు’’ అని తండ్రి ఆక్షేపించారు. ‘‘ఎట్టకేలకు తనను చికిత్సకు తీసుకెళ్లేందుకు వచ్చారు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది. ప్రశాంత్ నావైపు చూస్తూనే కూర్చున్న కుర్చీలో కుప్పకూలాడు’’ అని చెప్పుకొచ్చారు. ఈ ఘటన పట్ల ఆస్పత్రి దిగ్భ్రాంతి వెలిబుచ్చింది. దీనిపై సమీక్ష జరుపుతున్నట్టు తెలిపింది. ప్రశాంత్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. ప్రశాంత్‌కు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. -
ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
ఒకరు మృతి కామేపల్లి: ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. మండలంలోని తాళ్లగూడెం పెద్దమ్మతల్లి గుడి సమీపంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సంధ్య (19) తీవ్రంగా గాయపడటంతో ఆమెను హైదరాబాద్ తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందింది. ఆటో డ్రైవర్ ఎస్కే దస్తగిరితో పాటు ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కామేపల్లికి చెందిన ఆటో ఖమ్మం వెళ్తోంది. ఆ ఆటోలో వచ్చవాయి వీరయ్య, దొడ్డిగొర్ల కోటయ్య, కొప్పుల సంధ్య వెళ్తున్నారు. తాళ్ళగూడెం స్టేజీ వద్ద ఆ గ్రామానికి చెందిన పుచ్చకాయల కనకదుర్గ, బస్వమ్మ, మండ గోపి, ఎల్లబోయిన మల్లమ్మ ఖమ్మం వెళ్ళేందుకు ఎక్కారు. ఆటో పెద్దమ్మ తల్లి గుడి సమీపంలోకి రాగానే ఇల్లెందు నుంచి ఖమ్మం వెళ్తున్న బస్సు వేగంగా దూసుకొచ్చింది. ఆటోను క్రాస్ చేసే సమయంలో బస్సు వెనుక భాగం ఆటోకు తగిలింది. వెంటనే ఆటో పల్టీలు కొట్టింది. కొప్పుల సంధ్యకు తీవ్రగాయాలై స్పృహ కోల్పోయింది. ఆటో డ్రైవర్‌తో పాటు 7 గురికి తీవ్రగాయాలయ్యాయి. బస్సు ఆగకుండానే వెళ్ళిపోయింది. తీవ్రగాయాలపాలైన క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా ఖమ్మం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సంధ్య పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కామేపల్లి ఎస్సై జి.రంజిత్‌కుమార్ ఘటనాస్థలికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఆటోను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆగకుండా వెళ్ళిన బస్సును పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. బస్సు డ్రైవర్ చాగంటి సురేష్‌పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.


