పట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు మోకామా నియోజకవర్గంలో కలకలం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) పార్టీ తరఫున పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే, బాహుబలి నేతగా పేరొందిన అనంత్ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. జన్ సురాజ్ పార్టీ కార్యకర్త, ఆర్జేడీ మాజీ నేత దులార్ చంద్ యాదవ్ హత్య కేసులో అనంత్ సింగ్‌ను బార్హ్‌లోని అతని నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ అరెస్టును పట్నా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ) కార్తికేయ శర్మ, పట్నా జిల్లా మేజిస్ట్రేట్ త్యాగరాజన్ ఎస్ఎమ్ మీడియా ముందు ధృవీకరించారు. అనంత్ సింగ్‌తో పాటు ఈ కేసులో ప్రమేయం ఉన్న మణికాంత్ ఠాకూర్, రంజీత్ రాహలను కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అసలేం జరిగింది?
గ్యాంగ్‌స్టర్ నుండి రాజకీయ నేతగా మారిన దులార్ చంద్ యాదవ్, గురువారం నాడు మోకామాలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా హత్యకు గురయ్యారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ టికెట్‌పై పోటీ చేస్తున్న తన మేనల్లుడు ప్రియదర్శి పియూష్ తరపున యాదవ్ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల వేడి తారాస్థాయిలో ఉన్న సమయంలో ప్రత్యర్థి పార్టీకి చెందిన నేత హత్యకు గురికావడం మోకామాలో ఉద్రిక్తతకు దారితీసింది.
పోస్ట్‌మార్టం నివేదిక
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దులార్ చంద్ యాదవ్ మృతదేహానికి నిర్వహించిన పోస్ట్‌మార్టం నివేదికలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. యాదవ్ మరణానికి కారణం అతని గుండె, ఊపిరితిత్తులకు గట్టి గాయాలు కావడం. ఫలితంగా కార్డియో-శ్వాసకోశ వైఫల్యం ఏర్పడింది. పోస్ట్‌మార్టం నివేదిక, ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా ఇది హత్య అని స్పష్టంగా తెలుస్తున్నదని ఎస్ఎస్పీ కార్తికేయ శర్మ తెలిపారు.
అనంత్ సింగ్.. రాజకీయ వివాదాలు
అనంత్ సింగ్ బీహార్ రాజకీయాల్లో ‘బాహుబలి’నేతగా పేరొందారు. గతంలో ఆర్జేడీతో సంబంధాలు ఉన్న సింగ్, అనేక నేరారోపణలను ఎదుర్కొంటున్నారు. 2020 ఎన్నికల్లో ఆర్జేడీ తరపున మోకామా నుండి గెలిచినప్పటికీ, ఆయుధాల అక్రమ నిల్వ కేసులో దోషిగా తేలడంతో 2022లో ఆయన శాసనసభ్యత్వాన్ని కోల్పోయారు. ప్రస్తుతం ఆయన భార్య నీలం దేవి మోకామా అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అనంత్ సింగ్ అరెస్టు రాబోయే బీహార్ ఎన్నికల పైన, ముఖ్యంగా మోకామాలో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు.
ఇది కూడా చదవండి: ‘అది అసాధ్యం’.. ఖర్గేకు అమిత్‌షా కౌంటర్


