మృత్యువు ఎలా ముంచుకొస్తుందో తెలియదు. హాయిగా నవ్వుతూ మన కళ్లముందు తిరిగిన మనుషులే క్షణాల్లో మాయమై పోతున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా, గ్రేటర్ నోయిడాలోని 'మహాగున్ మైవుడ్స్ సొసైటీ'లో శుక్రవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. పూజ కోసం పూలు కోస్తుండగా, 23వ అంతస్తు నుంచి పడి 40 ఏళ్ల రందీప్ పత్రా అతని 11 ఏళ్ల కుమారుడు ఆరవ్ మరణించిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
మృతుడి భార్య పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం ఉదయం రందీప్ భార్య ఖాటూ శ్యామ్ ఆలయానికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా అమల్ కుమార్ పాత్ర కుమారుడు రణదీప్ పాత్ర, అతని కుమారుడు ఆరవ్, ఉదయపు పూజ కోసం పూలు కోయడానికి బాల్కనీలోకి వెళ్లారు. ఆ సమయంలో బాలుడు అదుపు తప్పి బాల్కనీ నుంచి కిందకు జారి వేలాడాడు. దీంతో అతడిని కాపాడేందుకు తండ్రి ప్రయత్నిస్తున్న క్రమంలో ఆయన కూడా బాలెన్స్ కోల్పోయి కింద పడి పోయారు. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దీంతో అపార్ట్‌మెంట్ వాసులు ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.

ఇదీ చదవండి: మితిమీరిన వేగం : కార్ షోరూం యజమాని దుర్మరణం
సమాచారం అందుకున్న బిస్రఖ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, తీవ్రంగా గాయపడిన తండ్రీకొడుకులను ఆసుపత్రికి తరలించారు. అయితే వారు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పంపి, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర విచారణ జరుపుతున్నారు.


