గ్రేటర్ నోయిడా: బ్యాంకులో దాచుకున్న సొమ్ముకే భద్రత లేకుండా పోయిందా? పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) శాఖలో ఖాతాదారుల ఫిక్స్‌డ్ డిపాజిట్ల (ఎఫ్‌డీలు) నుంచి కోట్ల రూపాయలు మాయమైనట్లు ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా సెక్టార్ పీఐ-1 శాఖలో పలువురి ఖాతాల నుంచి అనుమతి లేకుండా నగదు బదిలీ చేసినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై స్పందించిన బ్యాంకు ఉన్నతాధికారులు బ్రాంచ్ మేనేజర్ సహా ఐదుగురు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. పోలీసులతోపాటు బ్యాంకు విజిలెన్స్ విభాగం దర్యాప్తు చేపట్టింది.
రూ.94 లక్షల ఖాతాలో రూ.16 వేలే!
బిరౌండి గ్రామానికి చెందిన గౌతమ్ తండ్రికి ఈ శాఖలో ఖాతా ఉంది. కుటుంబ అవసరాల కోసం రూ.50 వేలు తీసుకునేందుకు బ్యాంకుకు వెళ్లగా.. ఖాతాలో సరిపడా డబ్బు లేదని సిబ్బంది తెలిపారు. విచారించగా, గతంలో సుమారు రూ.94 లక్షలున్న ఖాతాలో కేవలం రూ.16 వేలు మాత్రమే మిగిలినట్లు తెలిసిందని గౌతమ్ పేర్కొన్నాడు. దీంతో పోలీసులను ఆశ్రయించాడు. ఈ వ్యవహారంపై బ్యాంకు అధికారులు స్పందించి, డబ్బు తిరిగి ఇప్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపాడు.
విమానాశ్రయ భూ పరిహారం సొమ్మూ మాయం?
నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం కోసం భూములు కోల్పోయిన రైతుల ఖాతాల్లో జమ అయిన పరిహారం సొమ్ముపైనా ఆరోపణలు వచ్చాయి. ఓ ఖాతాదారుడి తల్లి ఖాతాలో సుమారు రూ.1.29 కోట్లు జమయ్యాయని, అవసరాలకు కొంత మొత్తం ఉపసంహరించుకున్న తర్వాత కూడా పెద్ద మొత్తంలో సొమ్ము ఉండాల్సిందని బాధితుడు తెలిపాడు. అయితే, ఖాతాలో డబ్బు కనిపించకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశాడు. మరో 10 నుంచి 15 రోజుల్లో సొమ్ము తిరిగి ఇస్తామని బ్యాంకు హామీ ఇచ్చినట్లు పేర్కొన్నాడు. అయినప్పటికీ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపాడు.
ఎఫ్‌డీలను ముందుగానే రద్దు చేశారనే ఆరోపణలు
బాధితుల ఆరోపణల ప్రకారం.. ఖాతాదారులకు తెలియకుండా ఎఫ్‌డీలను గడువుకు ముందే రద్దు చేసి, ఆ మొత్తాలను ఇతర ఖాతాలకు బదిలీ చేసినట్లు అనుమానిస్తున్నారు. పలువురు తమ పొదుపు ఖాతాల్లోనూ నగదు తగ్గిపోయిందని ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు 16 మంది పోలీసులను ఆశ్రయించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే, వాస్తవంగా ఎంత మొత్తం మాయమైంది? ఎన్ని ఖాతాలు ప్రభావితమయ్యాయి? నిధులు ఎక్కడికి బదిలీ అయ్యాయి? అనే వివరాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.
ఐదుగురు ఉద్యోగుల సస్పెన్షన్.. దర్యాప్తు ముమ్మరం
ఈ ఘటన నేపథ్యంలో బ్రాంచ్ మేనేజర్ సహా ఐదుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసి, శాఖలో కొత్త సిబ్బందిని నియమించారు. నోయిడా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బీటా-2 పోలీస్ స్టేషన్ అధికారులు ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేపట్టారు. బాధ్యుల పాత్రను గుర్తించి, ఆధారాల మేరకు చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. మరోవైపు, బ్యాంకు అవినీతి నిరోధక, విజిలెన్స్ బృందాలు కూడా దర్యాప్తు చేస్తున్నాయి. ఈ వ్యవహారంపై పీఎన్‌బీ నుంచి సమగ్ర అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఖాతాదారుల సొమ్ము భద్రతపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో దర్యాప్తులో వెల్లడయ్యే వివరాలపై ఆసక్తి నెలకొంది.
ఇదీ చదవండి: Israel: హంగ్ దిశగా ‘ఫలితాలు’.. నెతన్యాహుకు షాక్!


