ప్రజాధనం ఖర్చు చేస్తున్నా.. లెక్కలు సున్నా! | Missing Utilisation Certificates How Delayed Tracking Govt Funds CAG report | Sakshi
Sakshi News home page

ప్రజాధనం ఖర్చు చేస్తున్నా.. లెక్కలు సున్నా!

Oct 7 2026 2:19 PM | Updated on Oct 7 2026 2:28 PM

Missing Utilisation Certificates How Delayed Tracking Govt Funds CAG report

ఖాతాల్లో పారదర్శకతకు గండం!

ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలకు విడుదలయ్యే నిధుల వినియోగాన్ని నిర్ధారించే యుటిలైజేషన్‌ సర్టిఫికెట్లు (యూసీ) సకాలంలో సమర్పించకపోవడం దేశ ఆర్థిక నిర్వహణలో కొనసాగుతున్న కీలక సమస్యగా లోగడ కాగ్‌ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. నిధులు అందుకున్న రాష్ట్ర ప్రభుత్వాలు, శాఖలు, విధానాలు అమలు చేసే సంస్థలు వాటి వినియోగానికి సంబంధించిన ఆధారాలను సమయానికి సమర్పించకపోవడమే ప్రధాన సమస్యగా మారింది. అయితే దీన్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మొత్తం నిధులే లెక్కలేనివిగా మారాయనేలా అర్థం చేసుకోకూడదు.

ఆడిట్‌ రిస్క్‌

కేంద్ర ఆర్థిక నిబంధనల ప్రకారం గ్రాంట్‌-ఇన్‌-ఎయిడ్‌ అందుకున్న సంస్థలు నిర్దేశిత కాలంలో యూసీలు సమర్పించాలి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్‌ నివేదికలు, యూసీలు అందని మేరకు ఖాతాల్లో చూపిన మొత్తాలు నిజంగా లబ్ధిదారులకు చేరాయా లేదా అన్నదానిపై ఆడిట్‌ రిస్క్‌ ఉంటుందని స్పష్టంగా పేర్కొంటున్నాయి.

లెక్కల్లోకి రాని రూ.వేల కోట్లు

రాష్ట్రాల పరిస్థితి సమస్య తీవ్రతను మరింత స్పష్టం చేస్తోంది. మధ్యప్రదేశ్‌లో 2024-25 ముగిసే నాటికి 27 రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించి 19,622 యూసీలు, రూ.17,808.28 కోట్ల విలువైన నిధులకు సంబంధించిన ధ్రువీకరణలు పెండింగ్‌లో ఉన్నాయని కాగ్‌ నమోదు చేసింది. ఒడిశాలోనూ 2023-24 వరకు 12,050 యూసీలకు సంబంధించి రూ.16,585.45 కోట్లు పెండింగ్‌లో ఉండగా వాటిలో 2003-04 నుంచి 2019-20 మధ్యకాలానికి చెందిన 6,363 యూసీలు ఉండటం వ్యవస్థాగత జాప్యాన్ని ఎత్తిచూపుతోంది.

జవాబుదారీతనంపై ప్రశ్నలు

ఇక్కడే జవాబుదారీతనంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. యూసీ లేకపోవడం నిధులు దుర్వినియోగమయ్యాయని నిరూపణ కాదు. కానీ నిధులు నిర్దేశిత ప్రయోజనానికే ఖర్చయ్యాయా, ఖర్చు కాకుండా ఖాతాల్లోనే ఉన్నాయా లేదా ఇతర అవసరాలకు మళ్లాయా అన్నది ధ్రువీకరించే ఆడిట్‌ చెయిన్‌లో కీలకమైన ఆధారాలు మాత్రం కనుమరుగవుతున్నాయనేది వాస్తవం. ఇది ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరంగా పరిణమిస్తోంది.

ఈ సమస్యను తగ్గించేందుకు కేంద్రం పీఎఫ్‌ఎంఎస్‌, సింగల్‌ నోడల్‌ ఏజెన్సీ(ఎస్‌ఎన్‌ఏ), ఎస్‌ఎన్‌ఏ-SPARSH.. వంటి వ్యవస్థలను ప్రవేశపెట్టింది. ఒక పథకానికి కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు వచ్చినప్పుడు అవి వివిధ శాఖలు, బ్యాంకు ఖాతాలు, అమలు సంస్థల వద్ద అనేక చోట్ల మూలుగకుండా రాష్ట్రం గుర్తించిన ఒకే ప్రధాన ఖాతా/ఏజెన్సీ ద్వారా ఆ డబ్బును నిర్వహించేడమే ఎస్‌ఎన్‌ఏ విధానం. అయినప్పటికీ తాజా కాగ్‌ పరిశీలనల్లో కొన్ని రాష్ట్రాల్లో ఎస్‌ఎన్‌ఏ ఖాతాల్లో భారీగా నిధులు ఖర్చుకాకుండా ఉండటం, కేంద్ర-రాష్ట్ర వాటాల బదిలీల్లో డేటా వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి.

ఎలాంటి ప్రభావం ఉంటుంది?

యూసీలు ఆలస్యమైతే విడుదలైన నిధులు నిర్దేశిత ప్రయోజనానికే ఖర్చయ్యాయా లేదా అన్నది వెంటనే నిర్ధారించడం కష్టమవుతుంది. దీంతో ప్రభుత్వ ఖర్చుల నాణ్యతపై ఆడిట్‌ పర్యవేక్షణ బలహీనపడుతుంది. ఖర్చు వివరాలు అందుబాటులో లేకపోతే నిధులు ఖర్చుకాకుండా పడి ఉన్నాయా, ఇతర అవసరాలకు మళ్లాయా, లేక నిజంగా పథకానికే వినియోగించారా అన్నది నిర్ధారించడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఒక పథకానికి కేటాయించిన నిధుల వినియోగం స్పష్టంగా కనిపించకపోతే తదుపరి విడత నిధుల విడుదలలో పరిపాలనా, ఆడిట్‌ సమస్యలు తలెత్తవచ్చు. ఫలితంగా మౌలిక వసతులు, సంక్షేమ పథకాలు, స్థానిక సంస్థల అభివృద్ధి వంటి కార్యక్రమాల అమలు మందగించే అవకాశం ఉంటుంది.

ఇ‍ప్పుడేం చేయాలి?

సరైన ఖర్చుల ధ్రువీకరణ లేకపోవడం వల్ల ప్రజాధనం ఎలా వినియోగించారో తెలియదు. అందుకే పీఎఫ్‌ఎంఎస్‌, ఎస్‌ఎన్‌ఏ వంటి డిజిటల్‌ నిధుల పర్యవేక్షణ వ్యవస్థలు కీలకం. వీటి ఉద్దేశం నిధుల విడుదల నుంచి తుది వినియోగం వరకు ఆర్థిక ప్రవాహాన్ని ట్రాక్‌ చేయడం. అయితే డిజిటల్‌ ట్రాకింగ్‌తో పాటు క్షేత్రస్థాయి లెక్కలు, ఆడిట్‌, యూసీలను కూడా సకాలంలో పూర్తి చేసేలా పటిష్ఠ యంత్రాంగం ఉండాలి. ప్రజాధనాన్ని పైసాతో సహా లెక్క తేల్చాలి.

ఇదీ చదవండి: దిగొచ్చిన బంగారం ధరలు.. ఇదే మంచి సమయం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement