ప్రశాంత్ కిషోర్ పార్టీ ఖాతాలో మరో విజయం.. కాంగ్రెస్‌కు షాక్! | Prashant Kishors Jan Suraaj Wins Darbhanga Seat Deals Blow to Congress in Bihar MLC Polls | Sakshi
Sakshi News home page

ప్రశాంత్ కిషోర్ పార్టీ ఖాతాలో మరో విజయం.. కాంగ్రెస్‌కు షాక్!

Oct 28 2026 7:44 AM | Updated on Oct 28 2026 7:44 AM

Prashant Kishors Jan Suraaj Wins Darbhanga Seat Deals Blow to Congress in Bihar MLC Polls

పట్నా: బీహార్ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్‌ సురాజ్ పార్టీ మరో కీలక విజయాన్ని నమోదు చేసింది. బీహార్ శాసనమండలిలోని దర్భంగా ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థి సురేశ్ ప్రసాద్ రాయ్ విజయం సాధించారు. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్సీ మదన్ మోహన్ ఝాపై 324 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. దీంతో రాష్ట్ర అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఒక స్థానం గెలుచుకున్న జన సురాజ్.. శాసనమండలిలోనూ ప్రాతినిధ్యం సంపాదించింది. మొత్తం ఎనిమిది ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార ఎన్డీఏ కూటమి ఐదు స్థానాలను గెలుచుకునే దిశగా ఉండగా, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. మరో స్థానాన్ని జన సురాజ్ కైవసం చేసుకుంది.

దర్భంగా ఉపాధ్యాయ నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచే సురేశ్ ప్రసాద్ రాయ్ ఆధిక్యంలో కొనసాగారు. తొలి ప్రాధాన్య ఓట్లలోనే ముందంజ సాధించి చివరి వరకు దానిని నిలబెట్టుకున్నారు. జన సురాజ్ అభ్యర్థికి 2,574 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ ఝాకు 2,187 ఓట్లు లభించాయి. సీపీఎం అభ్యర్థి రామ్‌దేవ్ రాయ్‌కు 1,498 ఓట్లు, ఆర్జేడీ అభ్యర్థి కుమార్ రౌత్‌కు 126 ఓట్లు వచ్చాయి. గతంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సురేశ్ ప్రసాద్ రాయ్ రెండో స్థానంలో నిలిచారు. మరోవైపు, ఓట్ల లెక్కింపు పూర్తికాకముందే మదన్ మోహన్ ఝా కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. గత రెండు ఎన్నికల్లో ఈ స్థానంలో విజయం సాధించిన ఝా.. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా, మహాకూటమి ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), సీపీఎం వేర్వేరుగా అభ్యర్థులను నిలబెట్టడం జన్‌ సురాజ్‌కు అనుకూలంగా మారింది. తొలుత ఈ స్థానానికి ఆర్జేడీ అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే, కాంగ్రెస్ ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్న తర్వాత కుమార్ రౌత్‌ను బరిలోకి దించింది. సీపీఎం కూడా రామ్‌దేవ్ రాయ్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో విపక్షాల ఓట్లు చీలిపోయాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ మహాకూటమిలోని పార్టీలు దాదాపు డజను స్థానాల్లో ఒకదానిపై మరొకటి పోటీ చేశాయి.

ఇదీ చదవండి: సిరియా-జోర్డాన్ ఉద్రిక్తతల్లో కీలక మలుపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement