భార్యాభర్తలిద్దరూ ఒకే చితిపైకి.. కన్నీళ్లు పెట్టిస్తున్న విషాద ఘటన! | Dengue Deaths Husband And Wife Mainpuri Uttara Pradesh Incident | Sakshi
Sakshi News home page

భార్యాభర్తలిద్దరూ ఒకే చితిపైకి.. కన్నీళ్లు పెట్టిస్తున్న విషాద ఘటన!

Oct 23 2026 1:25 PM | Updated on Oct 23 2026 1:36 PM

Dengue Deaths Husband And Wife Mainpuri Uttara Pradesh Incident

ఉత్తరప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. డెంగ్యూ బారినపడి భర్త మృతి చెందగా.. ఆయన మరణించిన నాలుగు గంటలకే భార్య కూడా కన్నుమూసింది. దీంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన నలుగురు పిల్లలు అనాథలుగా మిగిలారు. భార్యాభర్తలిద్దరి అంత్యక్రియలను ఒకే చితిపై నిర్వహించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

స్థానికుల వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌, మైన్‌పురి జిల్లా ఎలావ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కసద్‌ గ్రామానికి చెందిన ముకేశ్‌ కుమార్‌ (48) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇతనకి భార్య దీప, ఒక కూతురు, ముగ్గురు కుమారులున్నారు. అయితే కొన్నిరోజుల క్రితం ఆయనకు తీవ్రంగా జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా మారడంతో వైద్యుల సూచన మేరకు ఆగ్రాకు తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు డెంగ్యూ సోకినట్లు గుర్తించి తగిన చికిత్స అందించారు. అదేవిధంగా మరోవైపు ఆయన భార్య దీప (42) కూడా జ్వరంతో బాధపడుతూ ఆగ్రాలోని మరో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

అయితే బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో చికిత్స పొందుతూ ముకేశ్‌ మృతి చెందాడు. దీంతో భర్త మరణవార్త తెలిసిన భార్య దీప మనోవేదనకు గురై, నాలుగు గంటల తరువాత ఆమె కూడా మృతిచెందింది. గడిచిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆ కుటుంబం ఇద్దరినీ కోల్పోవడం, ఒకే రాత్రి తల్లిదండ్రులిద్దరూ దూరం కావడం కుటుంబంలో తీరని శోకం మిగిల్చింది. ఈ ఘటన అక్కడి గ్రామస్థులను కలచివేసింది. అయితే దీప మరణానికి గల స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదు.

గురువారం ముకేశ్‌, దీప మృతదేహాలు గ్రామానికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామస్థులు సైతం పెద్ద సంఖ్యలో తరలివచ్చి నివాళులర్పించారు. అనంతరం సాయంత్రం భార్యాభర్తల అంతిమయాత్రను ఒకేసారి నిర్వహించి, ఒకే చితిపై అంత్యక్రియలు పూర్తి చేశారు. కుటుంబానికి అండగా నిలిచిన తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన ఆ పిల్లలను చూసి గ్రామస్థులు మోయలేని కన్నీటి భారంగా చలించిపోయారు.

ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదంలో ఆంధ్ర యువ అథ్లెట్‌ దుర్మరణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement