పుట్టినరోజున నీతా అంబానీ భారీ కానుక.. 5 వేల మందికి ఆశ్రయం | Nita Ambani foundation stone ceremony for 5000 person care facility | Sakshi
Sakshi News home page

పుట్టినరోజున నీతా అంబానీ భారీ కానుక.. 5 వేల మందికి ఆశ్రయం

Nov 1 2026 8:57 PM | Updated on Nov 1 2026 8:57 PM

Nita Ambani foundation stone ceremony for 5000 person care facility

న్యూఢిల్లీ: రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ తన పుట్టినరోజు సందర్భంగా మహారాష్ట్రలోని కర్జాత్‌లో 100 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ప్రత్యేక సంరక్షణ కేంద్రానికి ఆదివారం శంకుస్థాపన చేశారు. అనాథ పిల్లలు, వృద్ధులు, వైకల్యం ఉన్నవారు సహా 5,000 మందికి పైగా జీవితాంతం ఆశ్రయం కల్పించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. దీనికి 'నీతా ముకేశ్ అంబానీ అనంత్ ఆశ్రయ్' అని పేరు పెట్టారు.

ముంబై సమీపంలో జరిగిన భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమంలో ముకేశ్‌ అంబానీతో పాటు అంబానీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కేంద్రాన్ని దశలవారీగా అభివృద్ధి చేయనున్నారు. లాభాపేక్ష లేని శాశ్వత సంస్థగా దీన్ని తీర్చిదిద్దనున్నారు. నివాస గృహాలు, వైద్య సదుపాయాలు, పాఠశాలలు, పునరావాస కేంద్రాలతో పాటు విద్య, ఉపాధి, వినోదానికి అవసరమైన సదుపాయాలు ఇందులో ఉంటాయి.

ఈ ప్రాజెక్టు ద్వారా వైకల్యాలు ఉన్నవారు, సంరక్షణ అవసరమైన పిల్లలు, ఆదరణ కోరుకునే వృద్ధులకు ప్రేమతో కూడిన ఇల్లు అందించాలన్నది తన లక్ష్యమని నీతా అంబానీ తెలిపారు. వైద్య సహాయంతో పాటు కుటుంబ వాతావరణాన్ని కల్పిస్తామని చెప్పారు. నివాసితులు చదువుకోవడం, పనిచేయడం, స్నేహితులను సంపాదించుకోవడం, పండుగలు, వేడుకల్లో పాల్గొనే అవకాశాలు ఉంటాయని వివరించారు.

8 నివాస గ్రామాలను ఏర్పాటు 
రిలయన్స్ ఫౌండేషన్ వెల్లడించిన ప్రణాళికల ప్రకారం.. ఈ కేంద్రం ద్వారా నివాసితులు, సంరక్షకులు, వైద్య నిపుణులు, సహాయక సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు కలిపి సుమారు 15,000 మందికి ప్రయోజనం కలగనుంది. ఈ కేంద్రంలో భారతదేశంలోని పవిత్ర నదుల పేర్లతో 8 నివాస గ్రామాలను ఏర్పాటు చేస్తారు. ఒక్కో గ్రామంలో చిన్న కుటుంబాల తరహా ఇళ్లు ఉంటాయి. హౌస్ పేరెంట్స్, సంరక్షకులు నివాసితులకు తోడుగా ఉంటారు. వారి గదులను సొంత ఇంటి అనుభూతి కలిగించేలా రూపొందిస్తారు. తమకు నచ్చిన విధంగా గదులను అలంకరించుకునే స్వేచ్ఛ కూడా కల్పిస్తారు.

ప్రత్యేక ఆసుపత్రిలో అభివృద్ధి సంబంధిత వైద్యం, మూర్ఛ వ్యాధి చికిత్స, ప్రత్యేక అవసరాలు ఉన్నవారికి దంత వైద్యం, జీవితాంతపు ఉపశమన సంరక్షణ అందిస్తారు. ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ థెరపీ, హైడ్రోథెరపీ సేవల కోసం పునరావాస కేంద్రాలనూ నిర్మించనున్నారు. దేవాలయం, ఉద్యానవనాలు, వ్యవసాయ క్షేత్రాలు, ఆట స్థలాలు, శిక్షణా వర్క్‌షాప్‌లు, కేఫ్‌లు, క్రీడా, వినోద సదుపాయాలు కూడా ఉంటాయి. వంతారా నిపుణుల సహకారంతో జంతువులతో స్నేహం చేసే కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

బేకరీ, కేఫ్‌లు, హస్తకళల కేంద్రాల ద్వారా వృత్తి శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. వైకల్యాలు ఉన్నవారి సంరక్షణలో నిపుణులను తయారుచేసేందుకు ప్రత్యేక శిక్షణా అకాడమీ, హాస్పిస్ విభాగం, స్మారక ఉద్యానవనం కూడా ప్రణాళికలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టు ప్రభావం పరిసర ప్రాంతాలకూ విస్తరించనుంది. సమీప ప్రాంతాలకు చెందిన సుమారు 1,000 మందికి చికిత్స, విద్య, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని అంచనా. ఇతర జిల్లాల్లోని కుటుంబాలకు విశ్రాంతి సంరక్షణ కేంద్రాలు, మొబైల్ వైద్య క్లినిక్‌లు, ప్రత్యేక సేవల ద్వారా సహాయం అందించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement