న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసనలు కొనసాగుతున్న సమయంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నాలుగు రోజుల పాటు వియత్నాం పర్యటనకు వెళ్లడం రాజకీయ దుమారానికి దారితీసింది. కేరళ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌ను రాహుల్ గాంధీ విదేశీ పర్యటన గురించి విలేకరులు ప్రశ్నించగా ఆయన బదులిచ్చారు. తాను ఎవరికీ ట్రావెల్ ఏజెంట్‌ను కాదని, తనను ఆ ప్రశ్న అడగడంలో అర్థం లేదని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికీ కొన్ని బాధ్యతలు ఉంటాయని, తాను ఢిల్లీని విడిచి కేరళకు ఎందుకు వచ్చానో అలాగే రాహుల్ పర్యటన వెనుక కూడా కారణాలు ఉండవచ్చని చెబుతూ, దీనిపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేనని పేర్కొన్నారు.
మరోవైపు, రాహుల్ గాంధీ వియత్నాం పర్యటనపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్ర విమర్శలు గుప్పించింది. ఢిల్లీ నిరసనల్లో అబద్ధాలు ప్రచారం చేసి అలసిపోయిన తర్వాత ఆయన విహారయాత్రకు వెళ్లారని బీజేపీ ఆరోపించింది. రాహుల్ గాంధీ విమానంలో ప్రయాణిస్తున్నట్లు ఉన్న ఒక వీడియోను ఎక్స్‌లో పంచుకుంటూ, ఆయన విదేశీ పర్యటనల వెనుక ఉన్న అసలు అజెండా ఏమిటని బీజేపీ ప్రశ్నించింది. బీజేపీ నేత సంబిత్ పాత్ర మాట్లాడుతూ, రాహుల్ గాంధీ భారత్‌లో పాలన మార్పు తీసుకురావడానికి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.
జార్జ్ సోరోస్ వంటి వ్యక్తుల వద్ద శిక్షణ తరగతులు తీసుకోవడానికే ఆయన విదేశాలకు వెళ్లారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలు వారిని సమర్థించకపోవడంతో, దేశాన్ని అస్థిరపరచడానికి, ప్రభుత్వాన్ని కూల్చడానికి ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలనే దానిపై చర్చలు జరపడానికే ఈ పర్యటన అని విమర్శించారు. అలాగే బీజేపీ ప్రతినిధి ప్రదీప్ భండారీ మాట్లాడుతూ, రాహుల్ వెకేషన్‌ను ఎంజాయ్ చేయడానికి వెళ్లారా లేక దేశంలో గందరగోళం సృష్టించే వారితో సమావేశం కావడానికి వెళ్లారా అని ప్రశ్నించారు.
బీజేపీ విమర్శలను కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ ఖండించారు. ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీకి అనేక బాధ్యతలు ఉంటాయని గుర్తుచేశారు. ఈ సమయంలో ఇతరులు విదేశాలకు వెళ్లడం లేదా అని ఆయన ప్రశ్నించారు. రాహుల్ గాంధీ లండన్, యేల్ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులతో మాట్లాడటం, మేధావులతో చర్చలు జరపడం, పత్రికా సమావేశాలు నిర్వహించడం వంటి ముఖ్యమైన పనులు చేస్తారని, ప్రధాని నరేంద్ర మోదీ చేయని పనులను కూడా ఆయన చేస్తున్నారని అన్నారు. రాహుల్ విదేశీ పర్యటనలపై బీజేపీ అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని కాంగ్రెస్ కొట్టిపారేసింది.
ఇదీ చదవండి: ప్రియాంక కుమారుని ఫొటో ఎగ్జిబిషన్‌పై దుమారం


