హంపి జట్టుకు యూరోపియన్‌ చెస్‌ క్లబ్‌ కప్‌ టైటిల్‌ | Andhra Pradesh Grandmaster Koneru Humpy wins gold medal on Board 2 | Sakshi
Sakshi News home page

హంపి జట్టుకు యూరోపియన్‌ చెస్‌ క్లబ్‌ కప్‌ టైటిల్‌

Oct 26 2026 4:09 AM | Updated on Oct 26 2026 4:09 AM

Andhra Pradesh Grandmaster Koneru Humpy wins gold medal on Board 2

బోర్డు–2పై స్వర్ణ పతకం గెలిచిన ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌  

బుడ్వా (మాంటెనిగ్రో): ప్రతిష్టాత్మక యూరోపియన్‌ చెస్‌ క్లబ్‌ కప్‌ టోర్నమెంట్‌ మహిళల విభాగంలో భారత దిగ్గజ క్రీడాకారిణి, ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి సభ్యురాలిగా ఉన్న సర్కిల్‌ డిషెక్‌ మోంటెకార్లో జట్టు టైటిల్‌ సాధించింది. 22 జట్ల మధ్య ఏడు రౌండ్లపాటు జరిగిన ఈ టీమ్‌ ఈవెంట్‌లో మోంటెకార్లో, సీఈ గ్యాంబిట్‌ బోనెవోయి (లక్సెంబర్గ్‌) క్లబ్‌ జట్లు 12 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాయి. అయితే మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా మోంటెకార్లో జట్టు చాంపియన్‌గా అవతరించగా... బోనెవోయి క్లబ్‌ జట్టుకు రెండో స్థానం దక్కింది.

మోంటెకార్లో జట్టులో కోనేరు హంపితోపాటు అలెగ్జాండ్రా గొర్యాక్‌చినా (రష్యా), స్టావ్‌రూలా సొలాకిడూ (గ్రీస్‌), ఎలిజబెత్‌ పాట్జ్‌ (జర్మనీ), పియా క్రామ్లింగ్‌ (స్వీడన్‌) సభ్యులుగా ఉన్నారు. మోంటెకార్లో జట్టు ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించి, బోనెవోయి క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయింది. మోంటెకార్లో జట్టు తొలి మ్యాచ్‌లో 3.5–0.5తో షీ ప్లేస్‌ టు విన్‌ లయనెస్‌ ‘ఎ’ (ఇంగ్లండ్‌) క్లబ్‌ను ఓడించింది. ఆ తర్వాత రెండో మ్యాచ్‌లో 3–1తో ఒడ్లార్‌ యుర్డు (అజర్‌బైజాన్‌) క్లబ్‌పై, మూడో మ్యాచ్‌లో 2.5–1.5తో సిర్మియం స్రెమ్‌స్కా మిత్రోవికా (సెర్బియా) క్లబ్‌పై నెగ్గింది. 

బోనెవోయి క్లబ్‌తో జరిగిన నాలుగో మ్యాచ్‌లో మోంటెకార్లో క్లబ్‌ 1.5–2.5తో  ఓడిపోయింది. అనంతరం మోంటెకార్లో క్లబ్‌ ఐదో మ్యాచ్‌లో 4–0తో వెలికోవా చెస్‌ క్లబ్‌ (బల్గేరియా)పై, ఆరో మ్యాచ్‌లో 2.5–1.5తో సూపర్‌ చెస్‌ రొమేనియా క్లబ్‌పై, చివరిదైన ఏడో మ్యాచ్‌లో 4–0తో దావిత్‌ జోజువా చెస్‌ క్లబ్‌ (జార్జియా)పై గెలుపొందింది. కోనేరు హంపి వ్యక్తిగత విభాగంలోనూ స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. రెండో బోర్డుపై ఆడిన హంపి 4.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.  

రన్నరప్‌ హరికృష్ణ జట్టు 
ఓపెన్‌ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్, ప్రస్తుతం చెక్‌ రిపబ్లిక్‌లో స్థిరపడ్డ పెంటేల హరికృష్ణ, నిహాల్‌ సరీన్‌ సభ్యులుగా ఉన్న నోవీబోర్‌ చెస్‌ క్లబ్‌ (చెక్‌ రిపబ్లిక్‌) జట్టు రన్నరప్‌గా నిలిచింది. నోవీబోర్‌ క్లబ్, బాయెగాన్‌ పెండిక్‌ చెస్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ (టర్కీ) 13 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాయి. 

అయితే మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా బాయెగాన్‌ క్లబ్‌కు టైటిల్‌ ఖరారుకాగా... నోవీబోర్‌ క్లబ్‌కు రెండో స్థానం దక్కింది. వ్యక్తిగత విభాగంలో బోర్డు–2పై ఆడిన నిహాల్‌ సరీన్‌ (కేరళ) స్వర్ణ పతకం నెగ్గగా.. బోర్డు–3పై ఆడిన హరికృష్ణ రజత పతకం సొంతం చేసుకున్నాడు. నిహాల్, హరికృష్ణ ఇద్దరూ చెరో ఐదు పాయింట్లు సాధించారు. నిహాల్, హరికృష్ణ నాలుగేసి  గేముల్లో గెలిచి, రెండేసి గేమ్‌లను డ్రా’గా ముగించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement