ఫండే
లీగలాటా
క్రమశిక్షణ ఉల్లంఘిస్తేనో లేదా పరీక్షల్లో కాపీలు రాస్తూ పట్టుబడితేనో విద్యార్థులపై నిషేధం విధిస్తారు. అయితే ఆ విద్యార్థి ఇవేమీ చేయలేదు. అయినా, తరగతులకు రావొద్దంటూ యూనివర్సిటీ నిషేధం విధించింది. లైబ్రరీకి సైతం రాకుండా నిరోధించింది. అతడికున్న శారీరక లోపాన్ని సాకుగా చూపి ఈ చర్యలకు పాల్పడింది.
అయినా ఆ విద్యార్థి కుంగిపోలేదు, చదువుకు దూరం కావాలని భావించలేదు. వైద్యపరమైన సమస్య తన చదువుకు అడ్డంకిగా మారకూడదనుకున్నాడు. వర్సిటీ నిర్ణయంపై కోర్టు కెక్కాడు. పదేళ్లు న్యాయపోరాటం చేశాడు. ఓ విద్యార్థి వల్ల వందలాది మంది విద్యార్థులు, అధ్యాపకులు ఇబ్బంది పడాలా? ఆ ఒక్క విద్యార్థిపై నిషేధం విధించాలా? అనారోగ్య సమస్య కారణంగా చదువుకునే హక్కును దూరం చేయాలా? ఈ ప్రశ్నలకు కోర్టు పరిష్కారం చూపింది. ఆ తీర్పుతో ప్రపంచవ్యాప్తంగా ఈ కేసు ప్రాచుర్యం పొందింది.
టూనిస్ టెన్బ్రుక్ నెదర్లాండ్స్లోని ఎరాస్మస్ యూనివర్సిటీలో తత్త్వశాస్త్ర విద్యార్థి. టెన్బ్రుక్కు ఓ అనారోగ్య సమస్య ఉంది. అతని పాదాల నుంచి విపరీతమైన దుర్వాసన వస్తుంది. అతను క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు తాము పాఠాలను సరిగా బోధించలేక పోతున్నామని ప్రొఫెసర్లు, వినలేకపోతున్నా మని విద్యార్థులు వర్సిటీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. లైబ్రరీలోనూ అదే సమస్య. నిశ్శబ్దం కంటే చెమట వాసన భయంకరంగా ఉందని తోటి విద్యార్థుల గగ్గోలు... ఫిర్యాదులు రెండూ పెరిగాయి. సమస్య జటిలంగా మారింది. దీంతో ట్యూనిస్ బ్రుక్పై వర్సిటీ నిషేధం విధించింది. తరగతులకు రావద్దని హుకుం జారీ చేసింది. లైబ్రరీకి సైతం వెళ్లడానికి అనుమతి నిరాకరించింది.
కోర్టు మెట్లెక్కిన టెన్బ్రుక్
‘వర్సిటీ నిబంధనల ప్రకారం ఫీజు చెల్లించి అడ్మిషన్ పొందాను. నా అనారోగ్య సమస్యను అడ్డంపెట్టుకుని నిషేధం విధించడం సరికాదు..చదువుకునే హక్కును అడ్డుకోవడం తగదు’ అంటూ కోర్టులో కేసు దాఖలు చేశాడు.
ఇది వివక్ష కిందకే వస్తుందని, చెమట వాసన వస్తే అడ్మిషన్ రద్దవుతుందని వర్సిటీ నిబంధనల్లో లేదని అతని తరపు న్యాయవాది వాదించాడు. ఓ విద్యార్థి కారణంగా వందల మంది ఇబ్బంది పడుతున్నారు. అది క్రమశిక్షణ చర్య కిందకే వస్తుందని వర్సిటీ తరపు న్యాయవాది తన వాదనలు వినిపించాడు.
ముక్కు మూసుకోవాల్సిందే
ఇది సాధారణ కేసు కాదు. ఒక వైపు విద్యార్థి చదువుకునే హక్కు. మరోవైపు తోటి విద్యార్థులు, అధ్యాపకుల వ్యక్తిగత సౌకర్యం. ఇరు పక్షాల వాదనలు విన్న డచ్ కోర్టు తీర్పు ప్రకటించింది. బ్రుక్ పాదాల నుంచి వస్తున్న వాసన అత్యంత దుర్వాసన కలిగించొచ్చు. అయితే ఆ కారణంగా అతడ్ని చదువుకు దూరం చేయలేమని, అతడి విద్యాహక్కును కాలరాయలేమని చెప్పింది. ‘ఇబ్బందికరంగా ఉంటే ముక్కులు మూసుకుని భరించాల్సిందే’ అంటూ న్యాయమూర్తి వ్యాఖ్యానించడం సంచలనం రేపింది. నిషేధం ఎత్తివేసి వర్సిటీలోకి ప్రవేశించేందుకు అనుమతి ఇవ్వాలని ఆదేశించింది.
పదేళ్ల అతని న్యాయ పోరాటం ఫలించింది. చదువుకునే హక్కును బ్రుక్ తిరిగి పొందాడు. ఈ ఉదంతం నేపథ్యంలో వర్సిటీ ఓ కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఇలాంటి సమస్య ఉన్న విద్యార్థులపై నిషేధం కాకుండా వారి నుంచి పెనాల్టీలు వసూలు చేయాలని నిర్ణయించింది.
గతంలోనూ బ్రుక్ ఈ తరహా అవమానాలు ఎదుర్కొన్నట్టు వార్త కథనాలు పేర్కొన్నాయి. డెల్ఫ్ట్ యూనివర్సిటీ లైబ్రరీలో బూట్లు విప్పి కూర్చున్నప్పుడు దుర్వాసన వచ్చింది. దీంతో లైబ్రరీ సెక్యూరిటీ ఉద్యోగులు అతడ్ని బలవంతంగా బయటకు పంపారు. ప్రాంగణంలోకి రాకూడని హెచ్చరించారు. దాన్ని ఉల్లంఘించి అతడు మళ్లీ వర్సిటీలోకి వెళ్లడానికి ప్రయత్నించాడు. బ్రుక్ ఆ వర్సిటీ విద్యార్థి కాకపోవడంతో లోపలికి అక్రమంగా ప్రవేశించాడని పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు జరిమానా విధించింది. తర్వాత ఎరాస్మస్ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందాడు. అక్కడా ఇదే తరహా సమస్యను ఎదుర్కొన్నాడు.
ఈ కేసు విద్యార్థులకు ఓ పాఠాన్ని నేర్పుతోంది. సమస్య ఎదురైతే కుంగిపోకుండా, మానసిక ధైర్యంతో ముందడుగు వేయాలి. సమస్యకు పరిష్కారం వెతకాలి... అని ఈ ఉదంతం విద్యార్ధులకు మార్గం చూపుతోంది.
- దిలీప్ మాదిరెడ్డి
ఇదీ చదవండి: నోబెల్ నుంచి జ్ఞానపీఠం వరకు.. రచయితలకు దక్కే అరుదైన గౌరవాలు!


