బతుకమ్మ తెలంగాణ ఆత్మగౌరవానికి, మహిళల ఐక్యతకు, ప్రకృతితో మనకున్న అనుబంధానికి ప్రతీక అని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. స్విట్జర్లాండ్‌లోని బెర్న్‌లో స్విట్జర్లాండ్ తెలుగు అసోసియేషన్ - భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. విదేశీ గడ్డపై తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ భావితరాలకు అందిస్తున్న ప్రవాస తెలంగాణ బిడ్డలను అభినందించారు.
తెలంగాణ చరిత్ర, సాంస్కృతిక వైభవం, ప్రకృతి అందాలు, చారిత్రక కట్టడాలను అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. పర్యాటకం, ఫిల్మ్ టూరిజం, ఆతిథ్య రంగాల్లో తెలంగాణ–స్విట్జర్లాండ్ మధ్య పరస్పర సహకారానికి విస్తృత అవకాశాలున్నాయని పేర్కొన్నారు.
తెలంగాణలో పెట్టుబడులకు స్విస్ కంపెనీలు ముందుకు రావాలి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణను పెట్టుబడులు, పరిశ్రమలు, ఆవిష్కరణలకు ప్రధాన గమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నామని జూపల్లి తెలిపారు. లైఫ్ సైన్సెస్, కృత్రిమ మేధస్సు, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో స్విట్జర్లాండ్‌తో భాగస్వామ్యాలకు మంచి అవకాశాలున్నాయని చెప్పారు. స్విస్ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే భాగస్వామ్యాలను అభివృద్ధి చేయాలని ఆహ్వానించారు.
ప్రవాస తెలంగాణ ప్రజలు మన సంస్కృతికి రాయబారులు
విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు తెలంగాణ సంస్కృతికి నిజమైన రాయబారులని మంత్రి అన్నారు. మన భాష, సంప్రదాయాలను భావితరాలకు అందిస్తూనే తెలంగాణ అభివృద్ధిలోనూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సాంస్కృతిక బంధాలు దేశాల మధ్య స్నేహాన్ని బలోపేతం చేయడంతో పాటు పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులకు కొత్త అవకాశాలను సృష్టిస్తాయని పేర్కొన్నారు. బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించిన స్విట్జర్లాండ్ తెలుగు అసోసియేషన్‌కు, పాల్గొన్న తెలుగు కుటుంబాలకు మంత్రి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.


