ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ (ETCA) ఆధ్వర్యంలో అక్టోబర్ 11, 2026న దుబాయ్‌లోని షబాబ్ అల్ అహ్లీ స్పోర్ట్స్ క్లబ్‌లో 16వ బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి . ఈ వేడుకల్లో సుమారు ఆరువేల మందికి పైగా తెలంగాణ ప్రవాసులు పాల్గొని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని ఘనంగా చాటారు.
ఈ కార్యక్రమానికి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ముఖ్య అతిథులుగా, దుబాయ్ కాన్సుల్ జనరల్ డాక్టర్ ఇమ్మడి విష్ణు వర్ధన్ రెడ్డి గౌరవ అతిథిగా హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, ఆశన్నగారి జీవన్ రెడ్డి, గణేష్ బిగాల, షకీల్ అమీర్, సురేందర్ జాజల, బీఆర్‌ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల తదితర ప్రముఖులు ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు.
మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, గౌరీదేవికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. సంప్రదాయ బతుకమ్మ పాటలు, కోలాటాలు, నృత్యాలతో వేడుకల ప్రాంగణం సందడిగా మారింది. “బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో..” అంటూ మహిళలు ఆలపించిన పాటలు వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకొచ్చాయి.
ప్రముఖ సినీ, జానపద గాయని మధుప్రియ తన ప్రత్యేక ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించారు. మాట్ల తిరుపతి, డాక్టర్ కోకిల నాగరాజు, అంజలి పులింతి తదితరుల ఆటపాటలు వేడుకలకు మరింత వైభవాన్ని తీసుకువచ్చాయి, చిన్నారుల సాంస్కృతిక నృత్యాలు విశేషంగా ఆకట్టుకోగా, బీఆర్‌ఎస్ నాయకుల ఆటపాటలు వచ్చిన జనాలను ఉర్రూత ఊగించాయి, హాజరైన వారందరికీ నిర్వాహకులు ఉచిత భోజనం అందించారు.
ఈ యుఏఈ లో నివసిస్తున్న తెలంగాణ ప్రజల ఐక్యత, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడంతో పాటు, ఇక్కడ పుట్టి పెరుగుతున్న పిల్లలకు తెలంగాణ వారసత్వాన్ని పరిచయం చేయడంతో పాటు ఆపదలో ఉన్న ప్రవాస తెలంగాణ ప్రజలకు అండగా నిలవడం మా ప్రధాన లక్ష్యం అని అన్నారు ETCA వ్యవస్థాపకులు పీచర కిరణ్ కుమార్, అధ్యక్షుడు చీటీ జగదీశ్ రావులు.
ప్రత్యేక ఆకర్షణగా చేనేత కళాఖండం..
తెలంగాణ చేనేత కళా వైభవాన్ని అంతర్జాతీయ స్థాయిలో చాటిచెప్పే ప్రత్యేక కళాఖండం ఈ వేడుకల్లో మరో విశేషంగా నిలిచింది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ వెండి పట్టు దారాలతో ముగ్గురు పాలకుల ముఖచిత్రాలను చేనేత వస్త్రంపై అద్భుతంగా రూపొందించారు.
సుమారు రెండు మీటర్ల పొడవున్న ఈ కళాఖండం తయారీలో 26 గ్రాముల వెండిని వినియోగించారు. ఈ ప్రత్యేక డిజైన్ రూపకల్పనకు సుమారు 15 రోజులు పట్టగా, మగ్గంపై నేయడానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టిందని కళాకారుడు తెలిపారుఈ కళాఖండాన్ని ETCA ప్రతినిధులు దుబాయ్ కన్సుల్ జనరల్ విష్ణు వర్ధన్ రెడ్డి ద్వారా దుబాయ్ పాలక కుటుంబానికి అందించనున్నారు.
కాగా, ఈ కార్యక్రమంలో ETCA కార్యవర్గ సభ్యులు పీచర కిరణ్ కుమార్, చీటీ జగదీశ్ రావు, రాణి కోట్ల, అలిగేటి శ్రీనివాస్, గుండవేని శేఖర్, తిరుమల రావు బీరెల్లి, రాధారపు సత్యం, మామిడి శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్వర్ రావు, సాయి చందర్, సురేష్ రెడ్డి, రఘు అలిగేటి, వినోద్ ఆచార్యులు, ఎస్.పీ. కస్తూరి, సంతోష్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, సారిక, మమత, సరోజ, రణీశ, మౌనిక, రాజేష్, కార్తీక్ రెడ్డి, రమణ, మధు కుమార్, రణధీర్, రవి చంద్ర కొక్కొండ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: డాలస్‌లో ఘనంగా శంకర నేత్రాలయం సాంస్కృతిక కార్యక్రమం..


