ఫ్యాషనే ఆయుధంగా.. స్టైల్‌గా నిరసన! | Fashion: The protest story behind Neha Boras One Piece T-shirt | Sakshi
Sakshi News home page

ఫ్యాషనే ఆయుధంగా.. స్టైల్‌గా నిరసన! నేహా బోరా వన్‌ పీస్‌ టీ షర్టు దుమారం..

Oct 13 2026 1:29 PM | Updated on Oct 13 2026 1:34 PM

Fashion: The protest story behind Neha Boras One Piece T-shirt

ఢిల్లీలో ఎన్నికల సంఘం వైపుగా జరిగిన మార్చ్‌లో ఐసా (AISA) అధ్యక్షురాలు నేహా బోరా వన్ పీస్ జాలీ రోజర్ టీ-షర్టు నెట్టింట వైరల్‌గా మరి రకరకాల చర్చలకు దారితీసింది. సరిగ్గా అదే రోజున(అక్టోబర్‌ 12) లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాందీ ఒక వినతీపత్రాన్ని సుప్రీంకోర్టులో సమర్పించేందుకు ఢిల్లీ వీధుల్లో నడుస్తూ వెళ్తున్నారు. 

ఆ సమయంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్ (సిపిఐ-ఎంఎల్)కు అనుబంధంగా ఉన్న ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఐసా) జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా పెద్దగా నినాదాలు చేస్తూ తన గళాన్ని వినిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమె సీజేపీ పిలుపు నేపథ్యంలో వన్‌పీస్‌ లోగో ఉన్న ఎర్ర టీ షర్టుతో కనిపించారు. అసలేంటి ఈ లోగో, దాని వెనుకున్న కథ గురించి సవివరంగా తెలుసుకుందామా..!

ముఖ్యంగా ఆ వన్‌ పీస్‌ టీ సర్టుపై ఉన్న ఆంగ్ల అక్షరం "O" ఆకారంలో గుంట కళ్ల పుర్రె పైన పసుపు నారింజ రంగు టోపి ఉంటాయి. ఇది అచ్చం సముద్రపు దొంగల జెండాలతో ముడిపడి ఉన్న పుర్రె ఎముకల చిహ్నమైన జాలీ రోజర్‌ని తలపిస్తుంది. కానీ ఈ జెండా కేవలం దోపిడీలకు చిహ్నం కాదు. ఇది స్వేచ్ఛ (Freedom), ఆశయాలు, స్నేహం, మరియు అణచివేతకు వ్యతిరేకంగా పోరాడే తత్వానికి నిదర్శనం

అదీగాక నేహా అంతకుమునుపే సోషల్‌ మీడియా ఎక్స్‌ వేదికగా అదే టీ షర్టుని ధరించి ఒక ప్రత్యేకమైన భంగిమతో ఉన్న ఫోటోని పంచుకుంటూ ఢిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద కలుద్దాం అని రాశారు పోస్ట్‌లో. నిజానికి ఆమె గళం కంటే..ఆమె దుస్తులు ఎక్కువ మాట్లాడాయ్‌.  1997లో ప్రారంభమై, ఆ తర్వాత ప్రపంచవ్యాప్త ప్రజాదరణ పొందిన జపనీస్ మాంగా 'వన్ పీస్'లోని స్ట్రా హాట్ పైరేట్స్ జాలీ రోజర్ చిహ్నం అందర్నీ ఆలోచనలో పడేసింది. 

అందుకు కారణం..నేపాల్‌ జెన్‌జెడ్‌ నిరసనల సమయంలో ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌, యూకేలలో జరిగిన నిరసనకారుల ప్రదర్శనలలో వేలాది మంది విద్యార్థులు తమకు మెరుగైన విద్యా సౌకర్యాలు కావాలని డిమాండ్‌ చేస్తూ వీధుల్లోకి వచ్చినప్పుడు ఇలాంటి జెండా కనపించింది. ఆ నేపథ్యంలోనే ఆ లోగోతో కూడిన టీ షర్టు రకరకాల ఊహాగానాలకు తెరతీసేలా చర్చలకు దారితీసింది. అలాగే అనేక దేశాల్లో జరిగిన ప్రదర్శనల్లో ఈ చిహ్నం కనిపించింది. 

విచిత్రం ఏంటంటే ఆ రోజు బోరాతో పాటు, రాజకీయవిశ్లేషకుడు, సామాజిక కార్యకర్త యోగేంద్ర యాదవ్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కూడా ఈ ప్రదర్శనలో చేరి, నిరసనకారులకు తమ మద్దతును తెలిపారు. ఆ నిరసనల వేళ​ పోలీసులు నేహాను అదుపులోకి తీసుకున్నారు, అలాగే నెట్టింట ఆ నిరసనల సంఘటనలకు సంబంధించిన ఫోటోలు, పోలీసులు నిరసనల గుంపును చెదరగొట్టిన తీరు తెగ వైరల్‌ అయ్యాయి.

ఆ చిహ్నం వెనుకున్న కథ..
'వన్ పీస్'లో, జాలీ రోజర్ జెండా 'స్ట్రా హాట్ పైరేట్స్'కు చెందినది. దీనికి నాయకత్వం వహించేది మంకీ డి లూఫీ. అతను అవినీతిపరులైన, నిరంకుశ పాలకులను సవాలు చేసే ఒక కల్పిత కెప్టెన్. ఆ గడ్డి టోపీ అతని సిబ్బంది చిహ్నాన్ని ఒక సాధారణ పైరేట్ జెండా నుంచి వేరు చేస్తుంది. పొరుగును ఉన్న నేపాల్‌లో జరిగిన నిరసనల్లో ఈ జెండా కనిపించింది. 

అలాగే ఇండోనేషియాలో పౌరులు ప్రభుత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ..కార్లు, ట్రక్కులు, మోటార్ సైకిళ్లు, నివాసాలపై ఈ చిహ్నంతో కూడిన జెండాను ఎగరువేశారు. అలాగే ఫిలిప్పీన్స్‌లో కూడా తమ ప్రభుత్వంపై ఆగ్రహంతో నిరసనకారులు ఇలాంటి గుర్తులతో కూడిన జెండానే ఎగురవేశారు. ఆ నేపథ్యంలోనే నేహా వన్‌పీస్‌ ఎరుపు రంగు టీ షర్ట్‌ హాట్‌టాపిక్‌గా మారి సర్వత్రా చర్చనీయాంశమైంది. 

ఆమె ట్రైండీ ఫ్యాషన్‌తో..నిరసన వ్యక్తం చేసిందా లేక దుస్తులు కూడా తమ గళం వినిపిస్తాయి అని చెప్పకనే చెబుతుందా అంటూ ఊహగానాలు మొదలయ్యాయి. అంతేగాదు ఒక కల్పిత కథనం నుంచి పుట్టిన ఒక చిహ్నం నిరసనకు ఉమ్మడి భాషగా  మారుతోందా లేక అశాంతి నెలకొన్న వేళల్లో తమ బాధను ఈ చిహ్నం గొంతెత్తి నినదిస్తుందా అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.

ఇదీ చదవండి: అమెరికా రాయబారి మెచ్చిన దుర్గా పూజ..! ఆ కారణంగానే స్పెషల్‌..

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement