దూరం నుంచి చూస్తే గ్లోవ్స్ ధరించిన చెయ్యి మణికట్టు వరకు తెగిపడినట్లుగా కనిపిస్తుంది. మసక చీకట్లో ఈ చెయ్యి మునివేళ్లపై నడుస్తుండగా చూస్తే, గుండెలో చిన్నగా దడ మొదలవుతుంది. హాలీవుడ్ సినిమా ‘ది థింగ్’లో మాదిరిగా కనిపించే ఈ దృశ్యం ఒంట్లో గగుర్పాటును కలిగిస్తుంది. నిజానికి ఇది తెగిపడిన చెయ్యి కాదు, రోబో హస్తం. జూరిక్‌లోని స్విస్ జాతీయ సాంకేతిక సంస్థ (ఈటీహెచ్) శాస్త్రవేత్తలు మునివేళ్లపై నడిచే ఈ రోబో హస్తాన్ని రూపొందించారు.
మానవ హస్తంలో ఉన్నట్లే దీనికి కూడా ఐదువేళ్లు, చేతి కదలికలను పోలిన కదలికల కోసం ఇరవై కీళ్లతో జూరిక్ శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ రోబో హస్తం బరువు 818 గ్రాములు. ఎలాంటి ఉపరితలంపైన అయినా ఇది తనను తాను పడిపోకుండా నియంత్రించుకుంటూ మునివేళ్లపై సునాయాసంగా నడవగలదు. కీబోర్డ్ బటన్స్ నొక్కడం, పజిల్ గేమ్స్ ఆడటం, వస్తువులను నెట్టడం వంటి పనులు చేయగలదు. పెద్ద రోబోలు ప్రవేశించలేని ఇరుకైన ప్రదేశాల్లోకి ఇది సులువుగా ప్రవేశించగలదు. విపత్తుల సమయంలో సహాయక చర్యల కోసం, యుద్ధ సమయంలో భద్రతాపరమైన తనిఖీల కోసం ఇది బాగా ఉపయోగపడగలదని చెబుతున్నారు.


