దారి ఎంత ప్రమాదకరమైనా, షార్ట్‌కట్ అయితే చాలు అనుకునేవాళ్లుంటారు కదా! అలాంటివారిలో కొంతమంది ఏకంగా కూలిపోయిన వంతెనపైనే కార్లను నడుపుతున్నారు. అది కూడా కింద నది ప్రవహిస్తుండగా! ఈ దుస్సాహస ప్రయాణాలను గ్రీస్‌లోని, థెస్సాలీ ప్రాంతంలోని పాలయోపైర్గోస్ వంతెనపై చూడొచ్చు. 2023లో వచ్చిన ‘స్టార్మ్ డేనియల్’ భారీ వరదలకు ఈ వంతెన మధ్యలో కూలిపోయింది.
అప్పటి నుంచి అధికారికంగా ఈ వంతెన మీదుగా రాకపోకలు నిషేధించారు. అయినా అడ్డంకులు లేకపోవడంతో స్థానికులు ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాలంటే ఎక్కువ దూరం చుట్టి వెళ్లాల్సి ఉండటమే ఇందుకు కారణం. ఇటీవల డ్రోన్ కెమెరాలో ఓ ఫోర్డ్ రేంజర్ కూలిన వంతెనను నెమ్మదిగా దాటి వెళ్లిన దృశ్యాలు నమోదయ్యాయి. పర్యాటకులు కూడా పొరపాటున ఈ దారిలోకి వచ్చి వెనక్కి తిరగాల్సి వస్తోందని అదే వంతెనపై ప్రయాణం చేస్తున్నారు. మొత్తానికి వంతెన కూలినా ప్రయాణం మాత్రం ఆగటం లేదు.


