పోలీసుల చుట్టుముట్టడం.. పరుగులు.. అరెస్టులు.. నిర్బంధం.. అయినా ఆ ముఖంలో చిరునవ్వు చెదరదు! ఓ చోట పోలీసులు అడ్డుకుంటే మరోచోట ప్రత్యక్షం.. నిర్బంధంలో ఉన్నా సోషల్ మీడియా ద్వారా ఉద్యమకారులకు సందేశం.. విడుదల కాగానే మళ్లీ నిరసన బాట! ఢిల్లీలో ఈసీ వ్యతిరేక ఆందోళనల్లో ఇప్పుడీమె పేరు మార్మోగుతోంది. ఆమె అఖిల భారత విద్యార్థి సంఘం (ఏఐఎస్‌ఏ) జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా.
ఆర్మీ కుటుంబంలో పుట్టి పెరిగి.. ఇవేం పనులు పిల్లా? అంటే.. 29 ఏళ్ల నేహా బోరా (Neha Bora) చెప్పే సమాధానం ఒక్కటే.. ‘భయం త్వరగా వ్యాపిస్తుంది. కానీ ఆశ కూడా అంతే వేగంగా వ్యాపిస్తుంది! హక్కుల కోసం నిలబడితేనే మార్పు సాధ్యమవుతుంది. అందుకు.. అడ్డంకులెదురైనా.. అరెస్టులైనా వెనక్కి తగ్గకుండా యువత తమ గొంతు వినిపించాలి’ అని. దేశవ్యాప్తంగా జరుగుతున్న వరుస నిరసనల్లో కనిపిస్తున్న నేహా.. ఆ పార్టీకి చెందిన నాయకురాలు కాదు. కాంగ్రెస్ సహా ఏ రాజకీయ పార్టీకీ ఆమెకు సంస్థాగత సంబంధం లేదు. ఆమె అఖిల భారత విద్యార్థి సంఘం (AISA) జాతీయ అధ్యక్షురాలు. విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చిన ఆమె.. తనదైన రాజకీయ అభిప్రాయాలతో నిరసనల్లో పాల్గొంటున్నారు.

ఆర్మీ కుటుంబంలో పెరిగి..
ఉత్తరాఖండ్‌లో పుట్టిన నేహా.. తండ్రి భారత సైన్యంలో పనిచేయడంతో బాల్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో పెరిగారు. ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో నాటకరంగంపై ఆసక్తి పెంచుకున్నారు. ఆ తర్వాత జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లోని స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ ఎస్తెటిక్స్‌లో పీహెచ్‌డీ పరిశోధన ప్రారంభించారు. నాటకరంగం తనకు భిన్నమైన వ్యక్తుల ఆలోచనలను అర్థం చేసుకోవడంలో తోడ్పడిందని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 2019–20లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన విద్యార్థి నిరసనలు ఆమె రాజకీయ ప్రయాణంలో కీలక మలుపుగా మారాయి. అప్పటి నుంచి విద్యార్థుల సమస్యలు, ప్రభుత్వ విధానాలు, ప్రజా హక్కులకు సంబంధించిన అంశాలపై జరిగే ఆందోళనల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు.
పేపర్ లీకుల నుంచి..
పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ ఆరోపణలపై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జూలైలో జరిగిన నిరసనల్లో నేహా చురుగ్గా పాల్గొన్నారు. జంతర్ మంతర్ వద్ద విద్యార్థులతో కలిసి నిరాహార దీక్షకు దిగారు. నిరుద్యోగం, పరీక్షల్లో అక్రమాల ఆరోపణలు, యువత భవిష్యత్తుపై ఆందోళనలను తన ప్రసంగాల్లో ప్రస్తావించారు. దీంతో ఆమె ప్రసంగాలు, నిరసనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి.

పోలీసులనే పరిగెత్తించి..
తాజాగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న సీజేపీ నిరసనలకు నేహా మద్దతుగా నిలిచారు. జంతర్ మంతర్ వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో.. ఆందోళనకారులు దిల్లీ హాట్ వద్దకు చేరుకోవాలని పిలుపునిచ్చారు. ‘దిల్లీ హాట్‌నే నేడు జంతర్ మంతర్’ అంటూ సోషల్ మీడియాలో సందేశం పెట్టారు.
We have crossed the barricades and reached CP. https://t.co/uULrZgQaG6
— Neha (@neha_aisa) October 11, 2026
పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్న తర్వాత ‘నేను నిర్బంధంలో ఉన్నా.. ఉద్యమం ఆగదు’ అంటూ వీడియో విడుదల చేశారు. ఆదివారం కూడా నిరసనల సందర్భంగా ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల నుంచి తప్పించుకుంటూ పరుగెత్తడం, బారికేడ్లను దాటి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడం వంటి దృశ్యాలు వైరల్ అయ్యాయి. నిర్బంధ వాహనంలో ఊపిరి పీల్చుకోవడానికి కూడా స్థలం లేదని ఆమె ఓ వీడియోలో ఆరోపించారు.

ఇంట్లో బీజేపీ మద్దతు.. బయట తనదైన బాట!
నేహా కుటుంబ నేపథ్యం కూడా ఆసక్తికరంగా మారింది. సైన్యంలో పని చేసిన ఆమె తండ్రి బీజేపీ, మోదీ మద్దతుదారు. అలాగే తాత ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం ఉన్న వ్యక్తి అని తెలుస్తోంది. తన కుటుంబంలో బీజేపీకి బలమైన మద్దతుదారులు ఉన్నారని స్వయంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. రాజకీయ అభిప్రాయాల విషయంలో ఇంట్లో విభేదాలు కూడా ఉన్నాయని చెప్పారు. కుటుంబ సభ్యుల రాజకీయ వైఖరికి భిన్నంగా తన అభిప్రాయాలతో ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. తన ఆలోచనలకు అనుగుణంగా ప్రజా సమస్యలపై గళమెత్తుతున్నానన్నది ఆమె ప్రస్థానంలో కనిపించే అంశం.

అరెస్టుల మధ్యనూ నిరసనలకు పిలుపునివ్వడం, పోలీసుల అదుపులో ఉన్నప్పటికీ తన సందేశాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడం ఆమెను యువతలో గుర్తింపు పొందిన ముఖంగా నిలిపాయి. అయితే, నేహా అభిప్రాయాలే దేశంలోని యువత అందరి అభిప్రాయాలని చెప్పలేం కదా!. ఓటర్ల జాబితా సవరణపై వచ్చిన ఆరోపణలను ఎన్నికల సంఘం ఖండిస్తోంది. నిరసనలకు అనుమతి లేదని పోలీసులు చెబుతుండగా, ఉద్యమకారులు తమ ఆందోళనలను అడ్డుకుంటున్నారని విమర్శిస్తున్నారు. ఈ వివాదాల మధ్య నేహా బోరా పేరు మాత్రం దేశవ్యాప్తంగా చర్చకు వస్తోంది. ఆర్మీ కుటుంబ నేపథ్యం.. నాటకరంగ అనుభవం.. విద్యార్థి ఉద్యమాల ప్రయాణం.. అరెస్టుల మధ్యనూ చెదరని చిరునవ్వు.. ఇవన్నీ ఆమెను నిరసనలకు కనిపించే ముఖంగా మార్చాయి.
ఇదీ చదవండి: జెన్‌జీపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు


