తమిళగ వెట్రి కగళం అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ సి విజయ్ ఆస్తుల వ్యవహారంలో దాఖలైన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టులో విచారణ ఉత్కంఠ రేపుతోంది. ఎన్నికల అఫిడవిట్‌లో సుమారు రూ.30 కోట్ల విలువైన ఆస్తుల వివరాలు ఆయన వెల్లడించలేదని.. కాబట్టి ఎన్నిక రద్దు చేయాలన్నది పిటిషనర్ వాదన. దీనిపై కోర్టు కీలక ప్రశ్నలు సంధించింది.
విజయ్ పెరంబూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆయన ఎన్నికను సవాల్ చేస్తూ ఓటరు ఎస్.దినేశ్ హైకోర్టును ఆశ్రయించారు. అఫిడవిట్‌లో ఆస్తుల వివరాల విషయంలో పలు లోపాలు, తప్పుడు ప్రకటనలు ఉన్నాయని పిటిషనర్ ఆరోపించారు. ముఖ్యంగా పన్రూటిలోని సుమారు రూ.30 కోట్ల విలువైన ఆస్తిని అఫిడవిట్‌లో పేర్కొనలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. అయితే విజయ్ తన అఫిడవిట్‌లో సుమారు రూ.600 కోట్ల ఆస్తులు ప్రకటించిన నేపథ్యంలో.. మరో రూ.30 కోట్ల ఆస్తులను వెల్లడించకపోవడం ‘అవినీతి చర్య’గా పరిగణించవచ్చా? అని న్యాయస్థానం ప్రశ్నించింది.
పన్రూటి ఆస్తితో పాటు కొడైకెనాల్‌లోని విల్పట్టి గ్రామంలో 50 సెంట్ల భూమిని విజయ్ కొనుగోలు చేసిన ఆస్తిగా పేర్కొన్నప్పటికీ.. రెవెన్యూ రికార్డుల్లో అది ప్రభుత్వ పోరంబోకు భూమిగా ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు పోరూర్ ఆస్తికి సంబంధించిన విస్తీర్ణం, కొనుగోలు ధరపైనా అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
ఈ ఆరోపణలను విజయ్ ఖండించారు. అఫిడవిట్‌లోని చిన్నచిన్న లోపాలు, ఆస్తుల వివరాల్లో తేడాలు తన ఎన్నికను చెల్లుబాటు కాకుండా చేయడానికి కారణం కాదని ఆయన తరఫు సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ వాదించారు. పిటిషనర్ ఆరోపణలు ఎన్నికల ఫలితాన్ని ఎలా ప్రభావితం చేశాయో కూడా వివరించలేదని పేర్కొన్నారు.
ఇదే అంశంపై విచారణ సందర్భంగా జస్టిస్ వీ లక్ష్మీనారాయణన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆస్తుల వివరాలను సిద్ధం చేసేటప్పుడు విజయ్ తన చార్టర్డ్ అకౌంటెంట్‌పై ఆధారపడి ఉండొచ్చని, సీఏ కొన్ని ఆస్తులను పొరపాటున మిస్ చేసి ఉంటే అందుకు ఎన్నికను రద్దు చేయాలా? అని ప్రశ్నించారు. అలాగే రూ.600 కోట్ల ఆస్తులు ప్రకటించిన వ్యక్తి మరో రూ.30 కోట్ల ఆస్తులను వెల్లడించకపోవడం వల్ల ఓటర్ల నిర్ణయంపై నిజంగా ప్రభావం పడుతుందా? అని కూడా ప్రశ్నించారు.
2026 అసెంబ్లీ ఎన్నికల్లో పెరంబూరు నుంచి విజయ్ 1,20,365 ఓట్లు సాధించగా, ప్రత్యర్థి ఆర్.డి. శేఖర్‌కు 66,650 ఓట్లు వచ్చాయి. విజయ్ 53,715 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈ నేపథ్యంలో అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలపై వచ్చిన ఆరోపణలు ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేశాయా అన్న అంశం కూడా విచారణలో ప్రాధాన్యం సంతరించుకుంది.
విజయ్ తన ఎన్నికను సవాల్ చేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై తదుపరి వాదనలు ఇవాళ అక్టోబర్ 8న కొనసాగనున్నాయి. దీంతో కోర్టు తదుపరి విచారణపై ఆసక్తి నెలకొంది.
ఇదీ చదవండి: త్వరలో.. విజయ్ అన్నయ్యసారె!


