నేడు కిషోర్ కుమార్ వర్ధంతి
‘గాతా రహే మేరా దిల్’
‘మేరే దిల్ మే ఆజ్ క్యా హై’
‘ఓ మేరే దిల్... కే చౌన్’
వంటి మధుర గీతాలెన్నో పాడిన కిషోర్ కుమార్ దివంగతులై దశాబ్దాలు గడచినా ఆయన స్వరం మాత్రం ప్రతి రోజు వినబడుతూ రసానుభూతి అందిస్తుంది. ఆయన ప్రేమ మొదలు వేదాంతం వరకు ఎన్నో వైవిధ్యభరితమైన పాటలు పాడినప్పటికీ దిల్ (మనసు) మీద పాడిన పాటలు మనసు లేని వారి మనసుల్ని కూడా కదిలిస్తాయన్నది అక్షర సత్యం.
హిందీ సినీ సాహిత్యంలో దిల్ అంటే కేవలం హృదయమనే కాదు, అది ప్రేమ, విరహం,ఆశ, నిరాశ, వేదాంతం వంటి అనేక భావాలకు కేంద్రం!
→ ‘ముఖద్దర్’ (1950) లో ‘బల్మా హై దియా తుఝ్ కో’ అనే పాట ద్వారా కిషోర్ దా దిల్ పాటల శకం మొదలైందని చెప్పవచ్చు. తరువాత ‘దిల్ దిల్ పె మిలాకార్ దేఖో’, (‘మేమ్ సాబ్’ 1956) అనే పాటను పాడి యవతను ఆకట్టుకొన్నారు. ‘గాతా రహే మేరా దిల్‘ (‘గైడ్’ 1965) కిషోర్ దాకు సింగర్‌గా హీరో వర్షిప్ తెచ్చింది. ఇందులో ‘జల్నే వాలే చాహే జల్–జల్ మరేంగే’ అన్నపుడు ధిక్కార స్వరం ‘ఓ మేరే హమ్రాహీ’ అని పాడినపుడు ప్రేమికుడి ఆర్ద్రతను వ్యక్తం చేశారు.
→ ‘యే దిల్ నా హోతా బేచారా’ (‘జువెల్ థీఫ్’ 1967) పాటను దేవ్ ఆనంద్ నటనకు తగ్గట్లు పాడినట్లే, కిషోర్ దా తెరపై హీరోగా ‘బడా బద్మాష్ హై యే దిల్’ (‘దో దూని చార్’ 1968) అని హషారుగా పాడారు.
→ 1970 దశకంలో దిల్ గీతాలకు కిషోర్ దా కేరాఫ్ చిరునామా అయ్యారు... ఆయన పాడిన ‘ఓ మేరే దిల్ కే చైన్’ (‘మేరే జీవన్ సాథీ’ 1972) పాట ప్రేమికుడి హృదయ వేదనకు అద్దం పడుతుంది.
→ కిషోర్ దా దిల్ గీతాలలో ప్రేమే కాదు తాత్వికత కూడా ఉంటుంది. ‘సచ్చా ఝూటా’ (1970)లో రాజేశ్ ఖన్నాకు పాడిన ‘దిల్ కో దేఖో చెహరా న దేఖో’ అందుకు ఓ ఉదాహరణ. ‘బ్లాక్‌మెయిల్’ (1973) లోని ‘పల్ పల్ దిల్ కే పాస్’ ఒక ఆపాత మధురం... యాక్షన్ హీరోగా పేరున్న ధర్మేంద్రకు ఈ పాటను లలితంగా పాడటం విశేషం. ‘మేరే దిల్ మే ఆజ్ క్యా హై (‘దాగ్’ 1973) పాటలో ‘ముఝే దేవతా బనాకర్, తేరీ చాహతో నే పూజా..’ అని ప్రేమను దేవతతో ΄ోల్చి, ఎవర్ గ్రీన్ మెలోడీగా మార్చారు.
→ ‘జూలీ’ (1975)లో ‘దిల్ క్యా కరే జబ్ కిసీకో’ పాటను ప్రేమికుల మధ్య సహజంగా సాగే గుస గుసలాడే రీతిలో పాడారు. మనసుకు గాయం అయినపుడు ప్రేమికుని వేదనను ‘దిల్ ఐసా కిసీ నే మేరా తోడా’ (‘అమానుష్’ 1975) అనే పాటలో పాడారు. ఈ చిత్రం రీమేక్ ‘ఎదురీత’లో ‘ఎదురీతకు అంతం లేదా’ అని ఎస్పీ బాలూతో పాడించారు.
→ ‘దూర్ కా రాహి’ (1971) చిత్రంలో కిషోర్ దా, సులక్షణ పండిట్‌లు ‘బే ఖరార్ దిల్ తూ గాయేగా’ అని మనసును ఉద్దేశించి పాడిన పాట మన హృదయాలను కదిలిస్తుంది. ఈ చిత్రానికి కిషోర్ దా రచన, సంగీతం దర్శకత్వంతో పాటు హీరోగా నటించడం ఆయన బహు ముఖీన ప్రతిభకు నిదర్శనం!!
ఇవన్నీ కేవలం ఉదాహరణలు మాత్రమే... నిజానికి కిషోర్ దా దిల్ గీతాలు ఒక పరిశోధనాంశం... రఫీ సాబ్ కూడా దిల్ పాటలను అద్భుతంగా పాడారు. కానీ కిషోర్ దా హీరోలను బట్టి గాత్రాన్ని మలచారు. రాజేశ్ ఖన్నాకు సున్నితంగా, దేవ్ ఆనంద్‌కు లలిత గంభీరంగా ధర్మేంద్ర, అమితాబ్‌లకు బేస్ వాయిస్‌తో పాడటం వలన తెరపై నిజంగా ఆయా హీరోలే పాడుతున్నారనే భావన ప్రేక్షకులకు కలిగేది. రఫి దిల్ పాటల్లో క్లాసిజం ఎక్కువ... కిషోర్ దా పాటల్లో మాగ్నెటిజం ఎక్కువ. అందుకే ఎన్ని తరాలు మారినా ఆయన స్వరం ఎల్లప్పుడూ ‘పల్ పల్ దిల్ కే పాస్ తుమ్ రహతీ హో’ అన్నట్లుగా అందరి హృదయాలకు దగ్గరగానే ఉంటుంది.
– డా. వి.వి. రామారావు రచయిత, గాయకుడు, వ్యాఖ్యాత


