నాన్న కుట్టి మూవీ రివ్యూ అండ్ రేటింగ్ | Nanna Kutty Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

నాన్న కుట్టి మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Nov 27 2026 6:25 AM | Updated on Nov 27 2026 6:40 AM

Nanna Kutty Movie Review And Rating In Telugu

టైటిల్ : నాన్న కుట్టి
నటీనటులు: విజయ్ ఆంటోని- ప్రీతీ అస్రానీ- భగవతి పెరుమాళ్ - హరిప్రియ ఇసై - అరువి మధన్ - బేబీ లితన్య తదితరులు
సినిమాటోగ్రఫీ : రాజీవ్ రాజేంద్రన్
సంగీతం : విజయ్ ఆంటోనీ
నిర్మాతలు : విజయ్ ఆంటోనీ, మీరా విజయ్ ఆంటోనీ, రామంజనేయులు జవ్వాజీ
రచన -దర్శకత్వం : ము. మారన్
విడుదల తేదీ: 27 నవంబర్ 2026

తమిళ హీరో విజయ్ ఆంటోనీకి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. అందుకే తన ప్రతి సినిమాని తెలుగులో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేయడమే కాకుండా ఇక్కడ కూడా ప్రమోషన్స్ చేస్తాడు. తాజాగా తండ్రీకూతురు ఎమోషన్ సినిమా అంటూ ఈ నాన్న కుట్టితో వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.. 



కథేంటంటే.. 

వైజాగ్ లో ఉండే సూర్య(విజయ్ ఆంటోనీ) తన కూతురు దియా(బేబీ లితన్య)ని పసిపాపగా ఉన్నప్పుడే తీసుకొని ఊరొదిలేసి ఊటీకి వచ్చి బతుకుతూ ఉంటాడు. కూతురు అంటే సూర్యకు ప్రాణం. కూతురు దియాని తల్లి రేవతి చనిపోయింది అని చెప్పి పెంచుతాడు. దియా స్కూల్ ఉండే టీచర్ అనిత(ప్రీతీ అస్రాని) సూర్యని ఇష్టపడుతుంది. దియాకు దగ్గరయి ఈ విషయం సూర్యకి చెప్తే నో అంటాడు. ఒకరోజు ఊటీలో చనిపోయింది అని చెప్పిన రేవతి అనితకి కనిపిస్తుంది. దాంతో ఆమె సూర్యని నిలదీస్తుంది. అదే సమయంలో దియా కళ్ళు తిరిగి పడిపోవడంతో హాస్పిటల్ కి తీసుకెళ్తే ఓ వ్యాధితో బాధపడుతుందని, అది క్యూర్ అవ్వాలంటే తన తల్లితండ్రుల ద్వారా పుట్టిన ఇంకో సంతానం స్టెమ్ సెల్స్ కావాలని చెప్తారు. దీంతో అనిత రేవతి దగ్గరికి వెళ్దాం అంటే అసలు దియా తన కూతురే కాదు అని చెప్తాడు. మరి అసలు దియా ఎవరి కూతురు? సూర్య ఎందుకు పెంచుతున్నాడు? దియా తల్లితండ్రులను సూర్య కలుస్తాడా? దియాకి వచ్చిన వ్యాధి ఏంటి? దియా బతుకుతుందా? కూతురుని బతికించుకోడానికి సూర్య ఏం చేస్తాడు.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.



ఎలా ఉందంటే.. 
విజయ్ ఆంటోనీ ఏదో ఒక ఎమోషన్ తో సినిమా తీస్తాడని తెలిసిందే. ఇప్పుడు తండ్రి కూతురు ఎమోషన్ అనడంతో ఈ సినిమాతో ప్రేక్షకులను ఏడిపిస్తాడేమో అని భావించారు. తండ్రి కూతురు ఎమోషన్ కథే కానీ ఆ కూతురు ఎవరు, ఆమెని బతికించడానికి హీరో ఏం చేసాడు అనేదే ఈ సినిమా. 

ఓపెనింగ్ ఓ ఫైట్ సీన్ తో సూర్య, పాపని తీసుకొని పారిపోయి ఊటీ వచ్చేయడం చూపిస్తారు. దీంతో అసలు ఏం జరిగింది అనే క్యూరియాసిటీ ఉంటుంది. కానీ ఊటీకి వచ్చాక పాప పెద్దగా అవడం, స్కూల్ కి వెళ్లడం, తండ్రీకూతుళ్ల ఆటలు.. ఇలా కథ అంతా స్కూల్, వీళ్లిద్దరి మధ్య తిరుగుతూ ఎంతకీ ముందుకెళ్లట్లేదు అని బోరింగ్ వచ్చేస్తుంది. ఈ మధ్యలో అనిత టీచర్ సూర్య మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటుంది. అసలే బోరింగ్ ఉందంటే మధ్యమధ్యలో హీరో పక్కనే ఉండే ఫ్రెండ్ తో అక్కడక్కడా నవ్వు రాని జోకులు వేయించారు. ప్రీ ఇంటర్వెల్ కి సడెన్ గా రేవతి కనిపించి అనిత ప్రశ్నించడంతో కథ ఆసక్తిగా మారుతుంది. ఇంటర్వెల్ కి పాప హెల్త్ కండిషన్, అసలు తన పాపే కాదు అని చెప్పడంతో సెకండ్ హాఫ్ పై ఆసక్తి నెలకొంటుంది. 

ఇక సెకండ్ హాఫ్ లో సూర్య - రేవతి ఫ్లాష్ బ్యాక్ రొటీన్ లవ్ స్టోరీ. ఇలాంటివి చాలా సినిమాల్లో చూసేసాము. కానీ ఆ పాప తన దగ్గరికి ఎలా వచ్చింది అనేది బాగానే రాసుకున్నారు. ఇప్పుడు ఆ పాపని బతికించడానికి ఒరిజినల్ తల్లితండ్రుల కోసం వెతకడం, తిరగడం, వాళ్ళని బతిమాలాడటం.. ఇదంతా కుడా సాగదీశారు, ఎవరు అని వెతికే ప్రాసెస్ బాగున్నా తర్వాత అక్కడక్కడే కథ తిప్పుతూ ఎమోషన్ పండించే ప్రయత్నం చేసారు. క్లైమాక్స్ మాత్రం బాగా రాసుకున్నారు. కోర్ట్ సీన్, కూతురు దియా ఎమోషనల్ అయ్యే సీన్ బాగానే పండాయి. 

సినిమా ఫస్ట్ హాఫ్ అంతా సాగదీసి ఎమోషన్ పండక విసుగెత్తిన జనాలకు క్లైమాక్స్ కాస్త ఊరటనిస్తోంది. తండ్రి కూతురు ఎమోషన్ ని బలవంతంగా పండించే ప్రయత్నం చేసారు కానీ ఎక్కడా సహజంగా అనిపించలేదు. దాంతో ప్రేక్షకులు ఆ ఎమోషన్ కి క్లైమాక్స్ కి కానీ కనెక్ట్ కాలేరు. 



ఎవరెలా చేసారంటే..

విజయ్ ఆంటోనీ అదే రొటీన్ ఎమోషనల్ పాత్రలో, వైవిధ్యం ఏమి లేని పాత్రలో బాగానే నటించాడు. ప్రీతీ అస్రాణి క్యూట్ గా కనిపిస్తూనే సింపుల్ గా మెప్పించింది. చైల్డ్ ఆర్టిస్ట్ లితన్య మాత్రం తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసింది. క్లైమాక్స్ లో అయితే ప్రేక్షకులని ఏడిపించేస్తుంది. హరి ప్రియా ఇసై ఎమోషనల్ పాత్రలో బాగానే నటించింది. అరువి మధన్, భగవతి పెరుమాళ్, జెన్సన్ దివాకర్, రేవతి పాత్రలో నటించిన నటి.. మిగిలిన నటీనటులు వారి వారి పాత్రల్లో ఓకే అనిపించారు. 

సినిమాటోగ్రఫీ విజువల్స్ పర్వాలేదు. ఊటీ సీన్స్ వరకు లొకేషన్స్ బాగా చూపించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ యావరేజ్. పాటలు పాత విజయ్ ఆంటోనీ సినిమాల ట్యూన్స్ నుంచి కాపీ కొట్టారని అనిపిస్తుంది. ఫస్ట్ హాల్ లో కొన్ని ల్యాగ్ సీన్స్ ఎడిటింగ్ లో కట్ చేస్తే బెటర్. తండ్రి కూతురు ఎమోషన్ ని కొత్త పాయింట్ తో బాగానే రాసుకున్నా ఎమోషన్ ని తెరపై పండించడంలో తడబడ్డాడు దర్శకుడు. నిర్మాణ పరంగా మాత్రం కావాల్సినంత బాగానే ఖర్చుపెట్టారు.

- అంజి శెట్టె , సాక్షి వెబ్ డెస్క్ 

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement