నయనతార, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మూకుతి అమ్మన్ 2’. తెలుగులో ‘మహాశక్తి’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2020లో విడుదలైన ‘మూకుతి అమ్మన్’ సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సుందర్ సి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దునియా విజయ్, యోగిబాబు, ఊర్వశి, కుష్బూ సుందర్, స్నేహ తదితరులు కీలక పాత్రలు పోషించారు. హిప్‌హాప్ తమిజా సంగీతం అందించారు. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, అన్వి సినిమాక్స్, రౌడీ పిక్చర్స్ బ్యానర్లపై డాక్టర్ ఇషారి కే గణేశ్, కుష్బూ సుందర్, విఘ్నేశ్ శివన్ నిర్మించారు. ట్రైలర్, ప్రచార చిత్రాలతో సినిమాపై ఆసక్తి పెరిగింది. ఈ దీపావళికి విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించింది? అనేది రివ్యూలో చూద్దాం.

కథేంటి?
శక్తి (నయనతార) ఓ సాధారణ మహిళా కానిస్టేబుల్. బాలమ్మ (ఊర్వశి) ఆమెను దత్తత తీసుకుని పెంచుతుంది. అయితే శక్తిని మైలాచీ అనే గ్రామానికి సంబంధించిన ఓ పీడకల నిత్యం వెంటాడుతూ ఉంటుంది. ఆ కల గురించి ఎంతమందికి చెప్పినా పరిష్కారం దొరకదు. పైగా కొందరు ఆమెకు ఆ గ్రామంతో ఏదో ప్రత్యేకమైన సంబంధం ఉందన్నట్లుగా మాట్లాడుతుంటారు. దీంతో శక్తికి ఆ గ్రామం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది.
ఓ కారణంతో శక్తికి ప్రమోషన్ రావడంతో మైలాచీ గ్రామానికి విధులు నిర్వర్తించేందుకు వెళుతుంది. అక్కడికి చేరుకున్నాక ఆమెకు ఎదురయ్యే పరిస్థితులు, పరిచయమయ్యే వ్యక్తులు కథను మరో మలుపు తిప్పుతారు. స్నేహ, కుష్బూ పాత్రలు ఆమెకు స్వాగతం పలుకుతాయి. అయితే ఆ గ్రామానికి శక్తికి ఉన్న సంబంధం ఏమిటి? రెజీనా కసాండ్రా (భైరా) పాత్రకు అమ్మవారితో ఉన్న అనుబంధం ఏమిటి? గతంలో జరిగిన సంఘటనలు ప్రస్తుత కాలాన్ని ఎలా ప్రభావితం చేశాయి? అన్నదే మిగతా కథ.
( ఇదీ చదవండి: సూర్య ‘సీన్’మూవీ రివ్యూ)

ఎలా ఉందంటే?
అమ్మవారి నేపథ్యంలో వచ్చే కథలు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. గతంలో ధర్మం కోసం పోరాడే అమ్మవారి పాత్రలను, దుష్టశక్తులను అంతం చేసే కథలను ఎన్నో చూశాం. అయితే ఈ సినిమాలో మరో శక్తివంతమైన మహిళతో అమ్మవారు పోరాడటం ప్రత్యేకంగా నిలుస్తుంది. దాదాపు రెండు వేల ఏళ్ల క్రితం జరిగిన పగ, ప్రతీకారాల నేపథ్యంలో కథను తెరకెక్కించారు.
గత కాలానికి, ప్రస్తుతానికి మధ్య కథను అనుసంధానించే ప్రయత్నం చేశారు. కొన్ని సన్నివేశాలు చూస్తుంటే ‘మగధీర’ సినిమా గుర్తుకొస్తుంది. ముఖ్యంగా గత జన్మకు సంబంధించిన అంశాలు, ప్రస్తుత పాత్రల మధ్య సంబంధాన్ని చూపించే సన్నివేశాలు ఆసక్తిని కలిగిస్తాయి. ఎమ్మెల్యే కొడుకు పాత్రలో దునియా విజయ్ కనిపించే సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి. (ఇదీ చదవండి: 'సమ్మర్ హాలిడేస్' మూవీ రివ్యూ అండ్ రేటింగ్)
సినిమా మొదటి భాగంలో దర్శకుడు కథపై ఆసక్తి పెంచే ప్రయత్నం చేశారు. శక్తి మైలాచీ గ్రామానికి వెళ్లడం, అక్కడి పరిస్థితులు, ఆమెకు ఎదురయ్యే అనుభవాలతో కథ ముందుకు సాగించడంలో ఫర్వాలేదనిపించుకున్నాడు. కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతాయి. విజువల్స్, గ్రాఫిక్స్ కూడా కథకు అవసరమైన స్థాయిలో ఉపయోగించారు.
ద్వితీయార్థం..
మొదటి భాగం ఆసక్తిగా సాగడంతో ద్వితీయార్థంపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతాయి. అయితే రెండో భాగం ప్రారంభమైన తర్వాత కథనం నెమ్మదిస్తుంది. రెండు వేల ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలను పరిచయం చేసే విధానం అంతగా ఆకట్టుకోదు. కొన్ని సన్నివేశాలు చూస్తుంటే పాతకాలపు సినిమా చూస్తున్న అనుభూతి కలుగుతుంది. యోగిబాబు పాత్రలో ఆయన నటన బాగున్నప్పటికీ ఆ పాత్రను కథలోకి తీసుకొచ్చిన విధానం కొంత బలవంతంగా అనిపిస్తుంది. కథ సీరియస్‌గా సాగుతున్న సమయంలో కామెడీ ట్రాక్ రావడం కూడా అంతగా పండలేదు. దీంతో కొన్ని చోట్ల కథనం గాడి తప్పినట్లు అనిపిస్తుంది.
అయితే చివరి 15 నిమిషాలు మాత్రం ప్రేక్షకులకు కొంత ఊరటనిస్తాయి. చివర్లో రెండు కీలక పాత్రలను పరిచయం చేయడం, వాటి చుట్టూ కథను నడిపించడం ఆసక్తిని పెంచుతుంది. చివరి సన్నివేశాలు, నేపథ్య సంగీతం, చివరి పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ వరకు ప్రేక్షకులను కూర్చోబెట్టేందుకు దర్శకుడు చేసిన ప్రయత్నం కొంతవరకు ఫలించింది.
(ఇదీ చదవండి: ‘రామాయణం’ మూవీ రివ్యూ)
ఎవరెలా చేశారంటే?
నయనతార నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శక్తి పాత్రలో సాధారణ కానిస్టేబుల్‌గా.. అమ్మవారి పాత్రలో శక్తివంతంగా కనిపిస్తూ తనదైన నటనతో మెప్పించారు. రెండు పాత్రల్లోనూ ఆమె చూపించిన హావభావాలు ఆకట్టుకుంటాయి. సినిమాకు ప్రధాన బలంగా నిలిచారు. రెజీనా కసాండ్రా ప్రతినాయక పాత్రలో రాణించారు. భైరా పాత్రలో ఆమె చూపించిన నటన, తెరపై కనిపించే తీరు సినిమాకు మరో ఆకర్షణ. నయనతారతో ఆమెకు ఎదురయ్యే సన్నివేశాలు ఆసక్తిని కలిగిస్తాయి. ఈ ఇద్దరి మధ్య వచ్చే పోరాట సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
దునియా విజయ్ తన పాత్రకు న్యాయం చేశారు. కథలో కీలకమైన పాత్రలో కనిపిస్తూ మెప్పించారు. యోగిబాబు తనదైన శైలిలో నటించినప్పటికీ, ఆయన పాత్రను మరింత బలంగా తీర్చిదిద్దాల్సింది. సునీల్ కూడా కొన్ని సన్నివేశాల్లో కథ ముందుకు సాగేందుకు సహాయపడ్డారు. ఊర్వశి, కుష్బూ సుందర్, స్నేహ తదితరులు తమ పాత్రల పరిధిలో నటించారు. హిప్‌హాప్ తమిజా అందించిన సంగీతం సినిమాకు కొంత బలాన్ని ఇచ్చింది. ముఖ్యంగా నేపథ్య సంగీతం కీలక సన్నివేశాల్లో ఆకట్టుకుంటుంది. చివరి పాట కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది.
సినిమాటోగ్రఫీ బాగుంది. గత కాలానికి సంబంధించిన సన్నివేశాలను, ప్రస్తుత కథను తెరపై చూపించే ప్రయత్నం చేశారు. అయితే గ్రాఫిక్స్ విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవాల్సింది. కొన్ని సన్నివేశాల్లో విజువల్ ఎఫెక్ట్స్ లోపాలు స్పష్టంగా కనిపిస్తాయి. కథకు అవసరమైన భారీ స్థాయి విజువల్స్ ఉన్నప్పటికీ, వాటి నాణ్యత మరింత మెరుగ్గా ఉంటే సినిమా ప్రభావం పెరిగేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. భారీ స్థాయిలో తెరకెక్కించినప్పటికీ, కొన్ని సాంకేతిక అంశాలు సినిమాకు నిరాశ కలిగిస్తాయి.

చివరిగా..
‘మహాశక్తి’లో నయనతార, రెజీనా కసాండ్రా నటన ప్రధాన ఆకర్షణ. మొదటి భాగంలో ఆసక్తిని పెంచే కథనం, కొన్ని కీలక సన్నివేశాలు మెప్పిస్తాయి. అయితే ద్వితీయార్థంలో కథనం నెమ్మదించడం, కామెడీ ట్రాక్ అంతగా పండకపోవడం, గ్రాఫిక్స్ లోపాలు సినిమాకు నిరాశ కలిగిస్తాయి. అమ్మవారి కథలను ఇష్టపడే ప్రేక్షకులకు కొన్ని సన్నివేశాలు నచ్చవచ్చు. కానీ భారీ అంచనాలతో వెళ్లేవారిని సినిమా పూర్తిస్థాయిలో మెప్పించలేకపోవచ్చు.
రేటింగ్: 2.25/5
-ప్రశాంత్ కందా


