టైటిల్ : 'సమ్మర్ హాలిడేస్'
నటీనటులు : రోహన్, అరుణ్, జయసుధ, వాసుకి, రాజీవ్ కనకాల, హర్షవర్ధన్, ఖుషి, హర్షిని తదితరులు..
సంగీతం: శింజిత్ ఎర్రమిల్లి
ఛాయాగ్రహణం: సాయి ప్రకాష్
ఎడిటింగ్ : సంతోష్ నాయుడు
నిర్మాణ సంస్థ : ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్
నిర్మాత: ధీరజ్ మొగిలినేని, గిరి బాబు వల్లభనేని
కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: శ్రీకర్ నయన్
విడుదల తేదీ : 6 నవంబర్ 2026
ఇద్దరు పిల్లలతో చిల్డ్రన్ సినిమానేమో అని డౌట్ వచ్చేలా తెరకెక్కించిన సినిమా సమ్మర్ హాలిడేస్. సమ్మర్ లో రిలీజవాల్సింది ఇప్పుడు రిలీజయింది. టీజర్, ట్రైలర్స్ తో చిన్ననాటి సంగతులు ఉంటాయేమో అనేలా అంచనాలు పెంచిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది రివ్యూలో చూద్దాం.
కథ ఏంటంటే..
సిటీలో ఉండే రావూరి వెంకటేష్ అలియాస్ RV (అరుణ్ దేవ్) తండ్రి(హర్షవర్ధన్) చాలా స్ట్రిక్ట్. మార్క్స్, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొమ్మని కొడుకుని ఫోర్స్ చేస్తాడు, రాకపోతే తిడతాడు. సమ్మర్ హాలిడేస్ ముందు ఫస్ట్ ర్యాంక్ రాకపోవడం, తండ్రి బాగా తిట్టడంతో భయపడిన RV ని కూల్ చేయడానికి తల్లి (వాసుకి) మొదటిసారి సమ్మర్ హాలిడేస్ కి అమ్మమ్మ వాళ్ళ ఊరికి తీసుకువెళ్తుంది. అక్కడ RV కి కాశి వెంకటేశ్వర్లు అలియాస్ KV(రోహాన్ )పరిచయం అవుతాడు. KVకి చాలా కష్టాలు ఉన్నా చిన్న చిన్న పనులు చేసుకుంటూ స్కూల్ కి వెళ్తూ సరదాగా ఉంటాడు. తల్లికి సొంత డబ్బులతో ఒక్క చీర అయినా కొనివ్వాలి అనుకుంటాడు. వర్మ(రాజీవ్ కనకాల) దగ్గర కొన్ని మామిడి చెట్లు లీజుకి తీసుకొని సాగు చేస్తూ ఉంటాడు KV. మరి KV లైఫ్ లోకి RV ఎలా వచ్చాడు. ఈ ఇద్దరూ కలిసి ఎలా ఎంజాయ్ చేసారు? ఎవరి వల్ల ఎవరి లైఫ్ మారిపోయింది? ఎవరి కష్టాలు ఏంటి? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
ఇటీవల 90s కిడ్స్ కి అప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చేలా చాలా సినిమాలు వస్తున్నాయి. అలా సమ్మర్ హాలిడేస్ గుర్తు చేయడానికి ఈ సినిమా వచ్చింది. అయితే RV పాత్రతో ఎంతసేపు చదువొక్కటే లోకం అనే పేరెంట్స్ ని, పిల్లలు పడుతున్న ప్రెజర్ ని చూపించారు. KV పాత్రలో తండ్రి లేకపోతే చిన్నప్పట్నుంచి ఎన్ని కష్టాలు ఉన్నా ఎలా ఉండాలి అనేది చూపించారు. ఈ కథ మధ్యలో సమ్మర్ హాలిడేస్ ని ఇరికించి అక్కడక్కడా ఎంజాయ్ చేసిన కొన్ని మూమెంట్స్ పెట్టారు అంతే అనిపిస్తుంది. ఇక ఈ కథ అంతా గోదావరి బ్యాక్ డ్రాప్ లో 2001 లో జరుగుతుంది.
ఫస్టాఫ్ అంతా సరదాగా సాగిపోతుంది. అక్కడక్కడా నవ్వుకోవచ్చు. మధ్యలో కొన్ని చోట్ల ఎమోషన్ పండించారు. సెకండ్ హాఫ్ మాత్రం కొంత వరకు నెమ్మదిగా సాగుతుంది. ఓ పాట, అమ్మ ఎమోషన్ అంటూ కథను బాగా సాగదీశారు. అమ్మకు ఒక్క చీర కొనిపెట్టడం కోసం ఇంత సాగదీయాలా అనిపిస్తుంది. కొన్ని చోట్ల చిన్న చిన్న లాజిక్స్ వదిలేసారు. హాలిడేస్ కి ఎంజాయ్ చేద్దామని RV వస్తే అతనికి ఎంజాయ్ కంటే ఫ్రెండ్ కష్టాలే ఎక్కువ ఇచ్చారు అనిపిస్తుంది. కథ కూడా మొత్తం KV చుట్టే తిరిగింది.
అమ్మమ్మ గారిల్లు అని చూపించారు కానీ ఆ ఎమోషన్ పెద్దగా పండలేదు. సమ్మర్ హాలిడేస్ లో ఎంటర్టైన్మెంట్, కామెడీ సినిమా అని ఊహించి వెళ్తే మాత్రం కష్టమే. కానీ ఈ సినిమాలో చాలా సన్నివేశాలు చాలా మందికి కనెక్ట్ అవుతాయి. సమ్మర్ హాలిడేస్ లో పిల్లలు అంతా కలిసి ఎంజాయ్ చేయడం, చిన్నప్పటి నుంచే కష్టపడుతూనే చదవడం, స్కూల్ క్రష్.. ఇలా పలు సీన్స్ బాగానే కనెక్ట్ అయి మన జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటాం. అమ్మమ్మ ఒంటరి తనం, పిల్లలకు చదువు ఒక్కటే కాదు, చిన్నప్పట్నుంచే కష్టపడటం.. ఇలా పలు మెసేజ్ లను కూడా కథలో చూపించారు. ఇందులో గోదావరి యాస కోసం అందరూ బాగా కష్టపడినా ఒకరిద్దరికి కుదర్లేదు. హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాని చూడొచ్చు.
ఎవరెలా చేసారంటే..
35 సినిమాతో నేషనల్ అవార్డు సాధించిన అరుణ్ దేవ్ ఇందులో కూడా చక్కగా నటించాడు. ఇన్నాళ్లు కామెడీ పాత్రలో మెప్పించిన రోహన్ మొదటి సారి ఎమోషనల్ గా అదరగొట్టేసాడు. స్ట్రిక్ట్ ఫాదర్ పాత్రలో హర్షవర్ధన్, అతని భార్య పాత్రలో వాసుకి బాగానే నటించారు. అమ్మమ్మగా జయసుధ మెప్పిస్తుంది. మామిడి చెట్ల ఓనర్ పాత్రలో రాజీవ్ కనకాల బాగానే నటించారు. రోహన్ తల్లి పాత్రలో హర్షిని కోడూరి ఊహించని కొత్త పాత్రలో కనిపించి బాగానే నటించింది. మహేష్ ఆచంట, చైల్డ్ ఆర్టిస్ట్ ఖుషి, రమణ భార్గవ్.. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. పాటలు యావరేజ్. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. కొంత ఎంటర్టైన్మెంట్, చాలా ఎమోషన్ తో మంచి డైలాగ్స్ రాసుకొని దర్శకుడు మొదటి సినిమా అయినా సాంకేతికంగా బాగానే తెరకెక్కించాడు. ఎడిటింగ్ లో మాత్రం సెకండ్ హాఫ్ లో కొంత కట్ చేయాల్సింది. మామిడి తోట, ఊరు, స్కూల్ లొకేషన్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.


