రామాయణ– పార్ట్ 1
ముందు మాట రామాయణం... భారతదేశ సంస్కృతికి నిలువుటద్దం. తరతరాలుగా విరాజిల్లుతున్న ఓ మహా ఇతిహాసం. ప్రతి భారతీయుడికి పరిచయమున్న కథ ఈ రామాయణం. రామాయణ కథను ఓ వాక్యంలో చెప్పవచ్చు అని మన పెద్దవాళ్ళు అనేవాళ్ళు. అదే కట్టె... కొట్టె... తెచ్చె. అలాగే అదే కథను ఎన్నో భాగాలతో సీరియల్‌గా కూడా చూశాం. అదే విధంగా ఈ మహాకావ్యం ఇప్పటికే వెండితెరపై ఎన్నో సార్లు ఎన్నో రకాలుగా వచ్చి ప్రేక్షకులను అలరించింది. ఆ కోవలోనే ప్రముఖ బాలీవుడ్ నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రతిష్ఠాత్మకంగా రామాయణాన్ని నిర్మించారు. ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ సినిమాకున్న ఘనత చెప్పుకోవాలి.
రూ. 4000 కోట్ల బడ్జెట్, భారీ తారాగణంతో ఆరు భాషల్లో రెండు భాగాలుగా ఈ భారీ సినిమాను ప్లాన్ చేశారు. అంతర్జాతీయ చలన చిత్ర పరిశ్రమలో హాలీవుడ్‌కు ఇప్పటిదాకా ఓ రికార్డు ఉండేది. ఆ రికార్డును కూడా మన ‘రామాయణ’ చిత్రం తుడిచిపెట్టేసింది. నాటి హాలీవుడ్ చిత్రం ‘అవతార్’ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50,000 స్క్రీన్ల పైనే ప్రదర్శితమైతే మన ‘రామాయణ’ చిత్రం దాదాపుగా 59,000 లకు పైగా స్క్రీన్లపై ప్రదర్శితమవుతోంది. ప్రపంచంలో అతి పెద్ద పది బడ్జెట్ చిత్రాలలో ఇప్పుడు ‘రామాయణ’ కూడా నిలవడం విశేషం. అంత ఘనంగా విడుదలైన ‘రామాయణ’ ఎలా ఉందో ఆ రామాయణం పంథాలోనే (కట్టె... కొట్టె... తెచ్చె) చూద్దామా..
కట్టె (తెర వెనుక ఎలా నిర్మించారు)...
ప్రతి భారతీయుడికీ పరిచయమున్న కథ అయినా చెప్పే రీతిలో వైవిధ్యం లేక పోతే ప్రేక్షకులు ఆదరించరన్న సూత్రం నేటి తరం దర్శక–నిర్మాతలకు బాగా తెలుసు. నమిత్ మల్హోత్రా ఈ సినిమా ప్రకటించిన రెండు సంవత్సరాలలో పూర్తి చేసిన భారీ చిత్రం ఇది. దర్శకుడు నితీష్ తివారి ఎంతో జాగ్రత్తగా ఓ శిల్పాన్ని చెక్కినట్టు ఎంతో కష్టంతో ప్రయత్నం చేసిన దృశ్యకావ్యం ఈ ‘రామాయణ’. ఎవరికైనా ఆలోచన ఉంటే సరి పోదు, ఆచరణకు కావాల్సినంత ఆదరణ, నమ్మకం, ఓర్పు ఉండాలి. ఇవన్నీ ఈ చిత్రదర్శక–నిర్మాతలకు పుష్కలంగా ఉన్నాయి కాబట్టే ఇంతటి ఘన చరిత్రను ఘనమైన చిత్రంగా తీర్చిదిద్దగలిగారు.
నమిత్ మల్హోత్రా భారతదేశంలోనే అత్యంత ఖరీదైన చిత్రాన్ని తీయడం నిజంగా అభినందనీయం. నిజానికి భౌతికంగా రామాయణాన్ని చూసిన వారెవరూ లేరు. వాల్మీకి రాసిన కావ్యంతోనే ఆ ఇతిహాసం తరతరాలకు పరిచయం. ఆ ఇతిహాసాన్ని ఓ భారీ దృశ్య కావ్యంగా మలిచిన ప్రయత్నం అద్భుతం. 4000 కోట్ల రూ పాయల బడ్జెట్ సినిమాలోని దాదాపు ప్రతి సన్నివేశంలో కనిపిస్తుంది.
ఊహకందని గ్రాఫిక్స్‌తో తెరపై గ్రాండియర్‌గా మలిచిన ఈ సినిమా చరిత్రలో ఓ మైలురాయిలా నిలిచి పోతుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని గ్రాఫిక్స్ ముందు ఏ హాలీవుడ్ సినిమా పనికి రాదు. సినిమా నిడివి మూడు గంటల పదిహేను నిమిషాలైనా దాదాపు గంటకు పైగా కళ్ళు చెదిరే గ్రాఫిక్స్ ప్రేక్షకుడిని అలరిస్తాయి. దేవతలు–రాక్షసుల యుద్ధంతో ప్రారంభించి, జఠాయువు మరణంతో తొలి భాగాన్ని ముగించారు. ఈ సినిమా కోసం యూనిట్ పరిశోధనలు చేసి చాలావరకు వాడుకలో తెలియని విషయాలు కూడా పొందుపరచడం విశేషం. అందుకే వారి కృషి ఘనంగా తెర మీద ఆవిష్కృతమైంది.
కొట్టె (తెరపై ఎలా చేశారు)...
రామాయణ సినిమాలో ప్రధాన పాత్రధారులందరూ తమ పాత్రలలో జీవించారనే చెప్పాలి. మరీ ముఖ్యంగా చెప్పుకోదగ్గ పాత్రలంటే రావణుడి పాత్రలో నటించిన ప్రముఖ కన్నడ నటుడు యశ్‌తో మొదలుపెట్టాలి. ఈ పాత్రతోనే సినిమా ప్రారంభమౌతుంది. మనం విన్న, చూసిన రావణుడి పరాక్రమం, రౌద్రం నూటికి నూరు పాళ్ళు ఇలానే ఉంటాయన్న విషయం యశ్ తన నటనతో చూపించారు. బహుశా మున్ముందు ఇంకెవరైనా ఈ రావణుడి పాత్ర చేసినా యశ్‌ని మించి పోయేలా చేయాల్సిందే. అంతలా జీవించారు యశ్. తెలుగు ప్రేక్షకులకు శ్రీరాముడిగా సుపరిచితుడు నాటి నందమూరి తారక రామారావు.
ఆ పాత్రను అప్పట్లో ఎంతో సహజంగా చేశారాయన. ఆ స్థానం కోసం పోటీ పడుతున్నట్టుగా ఈ సినిమాలో శ్రీరాముడిగా అలరించారు ప్రముఖ బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్. శ్రీరాముడి పాత్రకు అతను తీసుకున్న శ్రద్ధ, చేసిన కృషి స్పష్టంగా ప్రతి ఫ్రేములో కనిపిస్తాయి. ఇక సీతగా సాయి పల్లవి, లక్ష్మణుడిగా రవి దూబే ఫరవాలేదనిపించారు. ఆ పై దశరథుడి పాత్ర చేసిన అరుణ్ గోవిల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
నాటి దూరదర్శన్‌లో ప్రముఖంగా ప్రసారమైన ‘రామాయణ్’ సుపరిచతమే. అందులో రాముడిగా అలరించిన అరుణ్ గోవిల్ ఈ సినిమాలో రాముని తండ్రి దశరథునిగా చేయడం విశేషం. శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్, మండోదరిగా కాజల్ అగర్వాల్ తమ పాత్రలకు న్యాయం చేశారు. అంతేకాదు ప్రముఖ సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్ తన మ్యూజిక్‌తో ఈ దృశ్య కావ్యాన్ని శ్రవణానందం చేశారంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ సినిమాకి ప్రధాన బలం విజువల్ ఎఫెక్ట్స్. ప్రతి ఫ్రేములో వారి కష్టం కనిపిస్తుంది. ఇంతటి భారీ తారాగణానికి భారీ సాంకేతిక బృందం కూడా తోడై ప్రేక్షకుల హృదయాలను దోచేశారనే చెప్పాలి.
తెచ్చె (ప్రేక్షకులను ఎలా మెప్పించారు)...
దేవతలు, రాక్షసుల యుద్ధంతో ప్రారంభమైన ఈ కథ రావణుడి ఆగమనంతో వేగం పెరుగుతుంది. ఆ పై రావణుడు లంకా నగరాన్ని దేవతల నుండి లాక్కొని తనదైన శైలిలో పరి పాలన ప్రారంభిస్తాడు. మరోపక్క శ్రీరామ జననం అయోధ్యలో జరుగుతుంది. ఆ పై సీతారాముల వివాహం, వనవాసం, రావణునిచే సీతాపహరణ చివరగా జఠాయువు మరణంతో మొదటి భాగం ముగుస్తుంది. తెలిసిన కథైనా చెప్పే రీతి విభిన్నంగా ఉండటంతో ప్రేక్షకులను మెప్పించేలా ఉందీ చిత్రం.
ముఖ్యంగా సినిమా ప్రారంభంలో రావణుడు దేవతలపై చేసే యుద్ధం, కుంభకర్ణుడిని నిద్ర లేపే సన్నివేశాలు, సీతను ఎత్తుకెళ్ళే రావణుడి వాహనం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో... ఆ గ్రాఫిక్స్ అన్నీ న భూతో న భవిష్యతి. ప్రపంచ సినీ పరిశ్రమలో విజువల్ వండర్స్‌కి పెట్టింది పేరు హాలీవుడ్. కానీ ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ప్రపంచ సినిమాలో మన భారతీయ సినిమా ‘రామాయణ’ మించిన గ్రాఫిక్స్ సినిమా ఇంతవరకూ రాలేదన్న విషయాన్ని నొక్కి వక్కాణిస్తారు. అంతేకాదు... ప్రత్యేకంగా చెప్పుకోవలసింది ఈ సినిమా డబ్బింగ్ ప్రక్రియ. ఆధునిక టెక్నాలజీతో భాషేదైనా సరే పాత్రధారుల పెదవుల కదలికలు స్పష్టంగా మాట్లాడే భాషలో ప్రతిబింబించడం ఓ అద్భుతం. ఆద్యంతం కనిపించే అద్వితీయమైన సన్నివేశాలు ప్రేక్షకులను మళ్ళీ మళ్ళీ ఈ సినిమాని చూసేలా ప్రేరేపిస్తాయనడంలో సందేహమే లేదు.
జెన్‌జీలకు...
రామాయణం అనేది మన జీవితంలో ఓ భాగం. భారతదేశంలో తరతరాలుగా వ్యాపిస్తున్న ఇతిహాసం. ముఖ్యంగా రేపటి తరానికి అంటే జెన్ జీ, ఆల్ఫా తరాలకు ఈ చిత్రాన్ని వారి పరిభాషలో చూపించే బృహత్తర ప్రయత్నం చేశారు దర్శక–నిర్మాతలు.
రామాయణంలోని ప్రతి అంశాన్ని ఆస్వాదించాను: – ఎస్.ఎస్. రాజమౌళి
‘రామాయణ’ సినిమాపై ప్రముఖ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి ప్రశంసలు కురిపించారు. ‘‘రామాయణం’ సినిమా విజువల్స్ బిగ్ స్క్రీన్ పై అద్భుతంగా ఉన్నాయి. రాముడిగా రణ్‌బీర్ కపూర్ చక్కగా నటించారు. ముఖ్యంగా వనవాసం సన్నివేశాల నుంచి ఎంతో అద్భుతమైన ఔన్నత్యంతో కనిపించారు. రావణుడిగా యశ్ ప్రెజెన్ ్స అద్భుతంగా ఉంది. సీతగా సాయి పల్లవి హుందాగా కనిపించారు.
ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ నాకు ఎంతగానో నచ్చాయి. సినిమాలోని ప్రతి అంశాన్ని ఆస్వాదించాను. ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన విజన్ ను అద్భుతంగా తెరపై ఆవిష్కరించిన నమిత్ మల్హోత్రా, నితీష్ తివారీతో పాటు యూనిట్‌కి అభినందనలు’’ అంటూ సోషల్ మీడియాలో రాజమౌళి పోస్ట్ చేశారు.
– హరికృష్ణ ఇంటూరు


