రణ్‌బీర్ కపూర్ రామాయణ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్‌లో తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగులోనూ రిలీజవుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మార్కెట్లకు సంబంధించి ‘రామాయణ’ థియేట్రికల్ హక్కుల విలువ దాదాపు రూ.54 కోట్లుగా తెలుస్తోంది. ఈ హక్కులను నిర్మాత దిల్ రాజు దక్కించుకున్నారు. నవంబర్ 5న విడుదల కానున్న ఈ చిత్రంపై అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఊపందుకున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో రామాయణ బిజినెస్ వివరాలు ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయి లాభాల్లోకి వెళ్లాలంటే బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాల్సి ఉంటుంది. ఒక డబ్బింగ్ చిత్రానికి తెలుగు మార్కెట్‌లో ఇది భారీ టార్గెట్ అవుతుంది.
అయినప్పటికీ రాముడి కథ కావడంతో పాటు రణ్‌బీర్, సాయి పల్లవి, యశ్ క్రేజ్ సినిమాకు కలిసివస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా దాదాపు రూ.6 కోట్ల మొత్తం వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో టాలీవుడ్‌లో బ్రేక్ ఈవెన్ సాధించడం అంతా ఈజీ కాదని అర్థమవుతోంది.


