మదిలో వీణలు మ్రోగించిన మధుర గాయని.. | Legendary Singer P Susheela Celebrates 90th Birthday on 14 Nov 2026 | Sakshi
Sakshi News home page

మదిలో వీణలు మ్రోగించిన మధుర గాయని..

Nov 13 2026 1:15 AM | Updated on Nov 13 2026 1:15 AM

Legendary Singer P Susheela Celebrates 90th Birthday on 14 Nov 2026

నేడు ప్రముఖ గాయని పి. సుశీల 90వ పుట్టినరోజు

‘ఈ వీణకు శ్రుతి లేదు.. ఈ వీణ పైన పలికిన రాగం ... వీణలోన తీగలోన ఎక్కడున్నదీ రాగము...’ ఈ  పాటలు వింటుంటే సాక్షాత్తు సరస్వతి వీణా తంత్రియే తెలుగు నాట పి. సుశీల రూపంలో అవతరించిందేమో అనిపిస్తుంది. గళంలో మాధుర్యం, గానంలో భావాభివ్యక్తి ఆమెను సమున్నత స్థితికి చేర్చాయి. నాలుగు దశాబ్దాల కాలంలో పలు భాషల్లో అనేక  పాటలు ఆలపించిన సుశీల సినీగాయనిగా స్థిరపడి ఉండక పోతే ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మిలా కర్నాటక శాస్త్రీయ సంగీత విద్వాంసురాలిగా వెలుగొందేవారు.

సుశీలని పెండ్యాల తొలిసారిగా తెలుగులో  ‘కన్న తల్లి’ (1952) చిత్రం ద్వారా గాయనిగా పరిచయం చేశారు. ‘మిస్సమ్మ, దొంగ రాముడు’ చిత్రాల్లో ఆమె  పాడిన  పాటలు హిట్‌ కావడంతో ఇక వెనుతిరిగి చూడలేదు. జావళీ మొదలు జానపదం వరకు వేలాది  పాటలను  పాడిన సుశీల ‘వీణ  పాటల గాయని’గా ఒక ప్రత్యేక గుర్తింపు  పొందారు.

తొలి వీణ  పాట...
సుశీల తొలి వీణా గీతం ‘సీతారామ కళ్యాణం’ (1960)లో సముద్రాల రాసిన ‘వీణా  పాడవే రాగమయీ’! అని చెప్పవచ్చు. దేశ్‌ రాగంలో గాలిపెంచల చేసిన ఈ  పాటను ఆమె ఎంతో మార్దవంగా  పాడారు. మండోదరి (బి. సరోజ) వీణను రాగమయీ! అని సంబోధించి ‘రావణుని గాథ’ను  పాడాలని కోరుతుంది. ఈ సన్నివేశంలో రావణుడే (ఎన్టీఆర్‌) వీణను  వాయించడం విశేషం. 

ఏమని  పాడెదనో...
‘భార్యా భర్తలు’ (1961) చిత్రంలో శ్రీ శ్రీ రాసిన ‘ఏమని  పాడెదనో ఈ వేళా’  పాటను నాయిక మానసిక వేదనను ప్రతిబింబించేలా సుశీల  పాడారు. ఇక  ‘డా. చక్రవర్తి’ (1964)లో ‘ పాడమని నన్నడగవలెనా...’  పాటకు ఆత్రేయ రెండు వెర్షన్లు రాశారు. తనకు కేన్సర్‌ అని తెలిసిన హీరో చెల్లెలు వీణ వాయిస్తూ, ‘ఈ వీణ మ్రోగక ఆగినా’ అని అన్యాప దేశంగా తన స్థితిని తెలుపుతుంది. సాలూరి ఖమాస్‌ రాగంలో చేసిన ఈ  పాటను సుశీల ఎంతో హృద్యంగా  పాడారు. 

మదిలో వీణలు మ్రోగే...
1969లో ‘ఆత్మీయులు’ చిత్రంలో దాశరథి రాసిన ‘మదిలో వీణలు మ్రోగే’  పాటను సుశీల హృదయ వీణను మ్రోగించినట్లు  పాడారు. మోహన రాగంలో సాలూరి స్వరాలు కూర్చగా సుశీల జన సమ్మోహనంగా  పాడారు. నాయిక తనను ఒక మూగవీణగా భావించి, తన బాధను  తెలుపుకున్నట్లుగా ‘జరిగిన కథ’ (1969)లో  ‘ఏ నాటికైనా... ఈ మూగ వీణా రాగాలు పలికి రాణించునా’... అని దాశరథి రాసిన  పాటను ఘంటసాల సంగీతంలో సుశీల గాద్గదికంగా  పాడటమే కాదు,  పాట చివర్లో వెక్కి వెక్కి ఏడ్చిన తీరు కదిలిస్తుంది.

నీ హృదయం కదిలించాలి...
‘ప్రేమనగర్‌ ’ (1971)లో వీణను తన జీవితానికి ప్రతీకగా భావించిన నాయిక ‘ఎవరో రావాలి... నీ హృదయం కదిలించాలి ...’ అని ఆక్రోశిస్తుంది. ఆత్రేయ రాసిన ఈ గీతాన్ని మహదేవన్‌ ‘పట్‌ దీప్‌’ రాగంలో స్వరపరచగా సుశీల ఎంతో ఆర్తిగా  పాడారు. ‘అమాయకురాలు’ (1971) చిత్రంలో పెళ్లి చూపుల సన్నివేశం కోసం దాశరథి  రాసిన ‘ పాడెద నీ నామమే గో పాల’  పాటను రాగ మాలికలో సుశీల ఆలపించిన విధానం రసరమ్యం... 

ఈ వీణకు శ్రుతి లేదు... 
వీణపై పలికించే రాగాన్ని నాయిక అనురాగంతో సమన్వయం చేస్తూ ‘అభిమానవంతులు’ (1973) చిత్రంలో సినారె రాసిన ‘ఈ వీణ పైన పలికిన రాగం...’  పాటలోని ప్రణయ భావనలను సుశీల గళం సున్నితంగా వినిపించింది. కోదండ పాణి సంగీతంలో జాలువారిన ఈ గీతం ఆ పాత మధురం! ‘దేశోద్ధారకులు’ (1973)లో ఆత్రేయ రాసిన ‘ఈ వీణకు శ్రుతి లేదు... ఎందరికో హృదయం లేదు’  పాటను మహదేవన్‌ ‘పట్‌ దీప్‌’ రాగంలో చేయగా సుశీల భావోద్వేగంతో  పాడారు.

నాదానికి, భావానికి ఉన్న సంబంధాన్ని ఇద్దరు ప్రేమికుల మధ్య ఉండే అనురాగ బంధంతో  పోలుస్తూ ‘చక్రవాకం’ (1974)లో ఆత్రేయ రాసిన ‘వీణలోన తీగలోన ఎక్కడున్నదీ రాగము’  పాటను మహదేవన్‌ చక్రవాకం రాగంలోనే స్వరపరచగా సుశీల భావబంధురంగా  పాడారు.

‘జమీందారుగారి అమ్మాయి’ (1976)లో దాశరథి రాసిన ‘మ్రోగింది వీణ పదే పదే హృదయాలలోన’  పాటను జీకే వెంకటేశ్‌ సంగీతంలో ఆలపించిన తీరు అలరిస్తుంది. 1990 నుంచి సుశీలమ్మ  పాటలు  పాడటం తగ్గించారు. ఆమెతో  పాటు తెలుగు చిత్రాలలో వీణ  పాటలు కూడా మూగవోయాయి.

సుశీల వీణ  పాటలే కాదు మరేది  పాడినా ఆ  పాట తాలూకు  పాత్ర సన్నివేశం కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. ఆమె  పాడిన  పాటలన్నీ అమృత గుళికలే. 
– డా. వి.వి. రామారావు
రచయిత, గాయకుడు, వ్యాఖ్యాత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement