అనస్వర రాజన్, అనీష్ జంటగా నటించిన చిత్రం ‘ఇట్లు అర్జున’. మహేశ్ ఉప్పల దర్శకత్వం వహించారు. ఈ సినిమా నవంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనీష్ రెడ్డికి ఇది తొలి చిత్రం కాగా.. అక్కినేని నాగార్జున సమర్పకుడిగా వ్యవహరించడం సినిమాపై ఆసక్తిని పెంచింది. మరోవైపు ఎన్టీఆర్, అఖిల్, రామ్‌చరణ్ వంటి స్టార్ హీరోలు సైతం ఈ సినిమాను ప్రమోట్ చేయడంతో విడుదలకు ముందే మంచి హైప్ క్రియేట్ అయింది. చిత్రబృందం కూడా వినూత్నంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది. మరి భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనీష్ తన తొలి సినిమాతో మెప్పించాడా? రివ్యూలో చూద్దాం.
కథేంటంటే?
అర్జున్ (అనీష్ ) పుట్టుకతోనే మూగవాడు. చిన్నప్పటి నుంచి తండ్రితో కలిసి దొంగతనాలు చేస్తూ పెరుగుతాడు. ఈ క్రమంలో చిన్న వయసులోనే జైలు జీవితం అనుభవించాల్సి వస్తుంది. అక్కడే చదువుకుంటాడు. చదువు అంతంతమాత్రంగానే ఉండటంతో జైలు నుంచి బయటకు వచ్చాక ర్యాపిడో డ్రైవర్‌గా జీవనం సాగిస్తుంటాడు. మరోవైపు అదే అపార్ట్‌మెంట్‌లో పై అంతస్తులో ఉండే కీర్తి (అనస్వర రాజన్)ను చిన్నప్పటి నుంచి ప్రేమిస్తుంటాడు. అయితే తన ప్రేమను ఆమెకు ఎలా చెప్పాలో తెలియక ఇబ్బందులు పడుతుంటాడు.
ఇదిలా ఉంటే.. రూ.1000 కోట్లకు సంబంధించిన ఓ పెన్‌డ్రైవ్ వ్యవహారం అర్జున్‌ను చిక్కుల్లో పడేస్తుంది. అసలు ఆ పెన్‌డ్రైవ్‌లో ఏముంది? దాని కోసం అర్జున్ ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? మాటలు రాకపోయినా తన ప్రేమను కీర్తికి తెలియజేయగలిగాడా? ఆమె అతడి ప్రేమను అంగీకరించిందా? చివరకు అర్జున్ జీవితంలో ఏం జరిగింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
మూగవాడి ప్రేమకథకు ఓ చిన్నపాటి థ్రిల్లర్‌ను జోడించి దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రేమ, కామెడీ, ఎమోషన్స్, థ్రిల్లింగ్ అంశాలను మేళవించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా కథలో వచ్చే కొన్ని మలుపులు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతాయి. అయితే అక్కడక్కడా కథనం కాస్త నెమ్మదించినట్లు అనిపిస్తుంది.
తొలి భాగంలో అర్జున్, కీర్తి మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. మాటలు రాని ఓ యువకుడు తన ప్రేమను హావభావాలతో వ్యక్తం చేయడానికి పడే తపనను తెరపై చక్కగా చూపించారు. ఈ సన్నివేశాలు ఓ కొత్త తరహా ప్రేమకథను చూస్తున్న అనుభూతిని కలిగిస్తాయి. ముఖ్యంగా వెన్నెల కిషోర్ ఎంట్రీ తర్వాత కామెడీ మరింత వినోదాన్ని పంచుతుంది. ఆయన టైమింగ్ నవ్వులు పూయిస్తుంది. ఇలా ప్రేమ, వినోదంతో మొదటి భాగం ఆసక్తికరంగానే సాగుతుంది.
సెకండాఫ్ ప్రధానంగా రూ.1000 కోట్ల పెన్‌డ్రైవ్ చుట్టూ తిరుగుతుంది. దీంతో కథలో ఒక్కసారిగా థ్రిల్లర్ కోణం మొదలవుతుంది. ఈ క్రమంలో వచ్చే ట్విస్టులు, అర్జున్ ఎదుర్కొనే పరిస్థితులు ఆసక్తిని పెంచుతాయి. మరోవైపు ప్రేమ, భావోద్వేగాలకు కూడా దర్శకుడు ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా మాటలు రాని అర్జున్ తన భావాలను వ్యక్తం చేసే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అక్కడక్కడా కథనం కొంత సాగదీసినట్లు అనిపించినా.. కీలక మలుపులతో సినిమా ముగింపు వరకు ప్రేక్షకుల్లో ఆసక్తిని కొనసాగిస్తుంది.
ఎవరెలా చేశారంటే?
అనీష్ రెడ్డికి ఇది తొలి సినిమా అయినప్పటికీ.. అర్జున్ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. ముఖ్యంగా మాటలు లేకుండానే కేవలం హావభావాలతో భావాలను పలికించిన తీరు ఆకట్టుకుంటుంది. తన తొలి సినిమాతోనే నటుడిగా మంచి ప్రయత్నం చేశాడని చెప్పొచ్చు. హీరోయిన్ అనస్వర రాజన్ కూడా కీర్తి పాత్రకు న్యాయం చేసింది. తన సహజమైన నటన, ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంది.
వెన్నెల కిషోర్ తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించాడు. చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ కూడా తన నటనతో మెప్పించాడు. బ్రహ్మాజీ, ముకేశ్ రిషి తదితరులు తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు.
సాంకేతికంగా సినిమా బాగుంది.సంగీత దర్శకుడు తమన్ మరోసారి తనదైన ముద్ర వేశాడు. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా కొన్ని కీలక సన్నివేశాలకు బలంగా నిలిచింది. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు మహేశ్ ఉప్పల ప్రేమకథకు థ్రిల్లర్ అంశాలను జోడించి కొత్తగా చెప్పే ప్రయత్నం చేశారు. కథనంలో అక్కడక్కడా వేగం తగ్గినా.. నటీనటుల ప్రదర్శన, కామెడీ, ట్విస్టులు సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయి.


